నేను మళ్లీ ఖమ్మం జిల్లాకే వస్తా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సేవలు ఇక నుంచి జిల్లాకు అందే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాజ్యసభ సభ్యుల
పంపకానికి సంబంధించి తీసిన లాటరీలో రేణుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఈమెతో పాటు తెలంగాణకు చెందిన మరో ముగ్గురు ఎంపీలు కూడా ఆ రాష్ట్రానికి కేటాయించబడ్డారు.
దీంతో రేణుక తన పదవీకాలం ముగిసేంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే సేవలందించాల్సి ఉంటుంది. ఎంపీగా ఆమె ఖర్చు చేసే నిధులు కూడా అక్కడి ప్రజల అవసరాలను తీర్చేందుకే కేటాయించాల్సి ఉంటుంది. మళ్లీ 2018 తర్వాత ఆమెకు రాజ్యసభకు అవకాశం వస్తే... అది కూడా తెలంగాణ నుంచి అధిష్టానం ఎంపిక చేస్తే ఆమె ఇక్కడకు వచ్చే అవకాలున్నాయి. కాగా, జిల్లా నుంచి ప్రస్తుతానికి పంపకాలు జరిగిన రాజ్యసభ సభ్యుల మధ్య పరస్పర అవగాహన కుదిరితే నిధుల కేటాయింపునకు సంబంధించి భారత ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వుల మేరకు ఇక్కడ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించవచ్చని అధికార వర్గాలు చెపుతున్నా అది కూడా కష్టమేననే వాదన వినిపిస్తోంది.
రేణుక ఏమంటున్నారంటే....
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు కేటాయించబడిన నేపథ్యంలో రేణుకాచౌదరిని ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా... ఆమె ఎప్పటిలాగే తనదైన శైలిలో మాట్లాడారు. ప్రదేశ్ మారినా తాను మారేది లేదని, ఖమ్మం జిల్లాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వదిలిపెట్టబోనని, ఏ ప్రభుత్వం వచ్చినా తనలో మార్పు ఏమీ ఉండదని ఆమె చెప్పారు. ‘చూస్తూ ఉండండి... ఏం జరుగుతుందో... నేను మళ్లీ ఖమ్మం జిల్లాకే వస్తా’ అని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.
పోలవరం ముంపు ప్రాంత ప్రజల పక్షాన అటు పార్లమెంటులో, ఇటు బయట పోరాడింది తానేనని, సీఎం హోదాలో ఉండి కేసీఆర్ బంద్‌కు పిలుపునివ్వడం హాస్యాస్పదమని అన్నారు. అప్పుడు నోరుమెదపని నేతలు ఇప్పుడు డ్రామాలు ఎందుకు ఆడుతున్నారని ఆమె ప్రశ్నించారు.
జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర...
ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రేణుక జిల్లా రాజకీయాల్లో హల్‌చల్ సృష్టించారు. అతి తక్కువ కాలంలోనే జిల్లా రాజకీయాలను ఒక కుదుపు కుదిపారు. ఖమ్మం పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసిన ఆమె జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను ఒకరకంగా శాసించారనే చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ మహామహులను ఎదుర్కొని నిలబడ్డారు. జిల్లా కాంగ్రెస్ వర్గ రాజకీయాలు ముదురుపాకాన పడ్డప్పుడు కూడా ఆమె ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అయితే, ఇప్పుడు రేణుకను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో జిల్లా కాంగ్రెస్‌లో రేణుకాచౌదరి వర్గంగా గుర్తింపు పొందిన నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఖచ్చితంగా మేడమ్ ఇక్కడే ఉంటారనుకున్న రేణుక వర్గం ఆమె ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోవడంతో తమ భవిష్యత్తు ఏమిటనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.