
అంతర్జాతీయ ప్రమాణాలతో గన్నవరం ఎయిర్‌పోర్ట్
గన్నవరం : రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అలోక్‌సిన్హా చెప్పారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఆయనతోపాటు హెచ్‌ఎంసీఏ పీయస్ జె. కృష్ణకిషోర్, ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా ప్లానింగ్ విభాగం సభ్యులు సుధీర్హ్రేజా, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కల్పనశెత్తి, టీఎస్ చంద్రమౌళి, ఐఎఫ్‌ఎస్ ప్రత్యేక భద్రతాధికారి పెర్జిన్‌తో కూడిన కమిటీ గురువారం గన్నవరం విమానాశ్రయాన్ని సందర్శించింది.
తొలుత విమానాశ్రయ రన్‌వేను పరిశీలించిన కమిటీ అనంతరం విస్తరణపై చర్చించారు. రన్‌వే విస్తరణకు ఎంత భూమి కావాలి, భూసేకరణ సాధ్యసాధ్యాలను నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రధరరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెర్మినల్ బిల్డింగ్‌ను సందర్శించిన అధికారుల ప్రయాణికులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సదుపాయలను పరిశీలించారు.
అనంతరం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో విమానాశ్రయ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో స్థానిక ఎయిర్‌పోర్టు అధికారులతో చర్చించారు. ప్లానింగ్ అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను వీక్షించారు. రానున్న ఆరేళ్లపాటు వినియోగించే విధంగా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడంతోపాటు భవిష్యత్తులో ప్రత్యామ్నయంగా గ్రీన్‌ఫిల్డ్ ఎయిర్‌పోర్టును నిర్మించాలని ఆలోచించినట్లు సమాచారం.
ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం
సాయంత్రం తిరిగి న్యూఢిల్లీ వెళ్ళేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అలోక్‌సిన్హా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ సమాచారం మేరకు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయనుండడంతో భవిష్యత్‌లో ఇక్కడి నుంచి ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరగనుందన్నారు.
దీనికి అనుగుణంగా 500 మంది డోమిస్టిక్ ప్రయాణికులు, 200 మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా కొత్తగా ఇంటిగ్రేడెట్ టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్‌లో ఉండే సదుపాయలకన్నా మెరుగైన వసతులను ప్రయాణికులకు కల్పించనున్నట్లు చెప్పారు. అదే విధంగా భూసేకరణ పూర్తయితే భారీ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రస్తుతం 7,500 అడుగులు ఉన్న రన్‌వేను 10,500 అడుగులకు విస్తరించనున్నట్లు సిన్హా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ విభజన యాక్టులోనే ఈ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నట్లు కృష్ణకిషోర్ తెలిపారు. దీనిలో భాగంగా గన్నవరం విమానాశ్రయాన్ని అత్యాధునిక హంగులతో వరల్డ్ బెస్ట్ టెర్మినల్‌గా తీర్చితిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో ఇక్కడి నుంచి విమాన సర్వీస్‌లను పెంచడంతో భారీ విమానాలు దిగే విధంగా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ఆయన వివరించారు.