‘త్రిశంకు’లో బందరు పోర్టు
- ఆరు నెలల్లో నిర్మిస్తామంటూ టీడీపీ నేతల హామీ
- భూసేకరణకే ఎనిమిది నెలల సమయం
- మరో నాలుగు శాఖల అనుమతులు రావాలి
- ఫైనాన్షియల్ క్లోజర్‌కు వెళ్లని కాంట్రాక్టు కంపెనీ
మచిలీపట్నం : రాష్ట్ర విభజన నేపథ్యంలో బందరు పోర్టు అభివృద్ధి అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రం కలిసి ఉన్న సమయంలో బందరు పోర్టు అభివృద్ధి అంశాన్ని పాలకులు పక్కనపెట్టేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 ఏప్రిల్ 23వ తేదీన బందరు పోర్టు పనులకు శంఖుస్థాపన చేశారు. వైఎస్సార్ మరణంతో బందరు పోర్టును పట్టించుకునే వారు లేకుండా పోయారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన పాలకులు ఆరు నెలల్లో పోర్టు పనులను ప్రారంభిస్తామని చెబుతున్నారని,అయితే పోర్టు పనులు ప్రారంభించాలంటే అనేక ఆటంకాలున్నాయని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ చెబుతున్నారు. మచిలీపట్నం పోర్టు లిమిటెడ్ నవయుగ సంస్థకు, ప్రభుత్వానికి మధ్య 2010 జూన్ 7వ తేదీన ఒప్పందం కుదిరిందని చెప్పారు.
ఒప్పందం కుదిరిన 12 నెలల్లోగా నిర్మాణ సంస్థ ఫైనాన్షియల్ క్లోజర్‌కు వెళ్లాల్సి ఉందని అన్నారు. రూ. 1590 కోట్లతో బందరు పోర్టును అభివృద్ధి చేయాల్సి ఉందని, పోర్టు అభివృద్ధిపై ప్రభుత్వానికి, నిర్మాణ సంస్థకు ఒప్పందం కుదిరి నాలుగేళ్లు గడచినా ఇంత వరకు ఆ సంస్థ ఫైనాన్షియల్ క్లోజర్‌కు వెళ్లలేదని గుర్తుచేశారు. పోర్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం పర్యావరణ అనుమతిచ్చిందన్నారు.
పోర్టుకు డీజిల్ స్టోరేజీ నిమిత్తం చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ శాఖ, అగ్నిమాపకశాఖ, విమానయానశాఖ, అటవీశాఖ, వన్యమృగసంరక్షణశాఖ అనుమతులు ఇవ్వాలని తెలిపారు. దీంతో పాటు పోర్టు నిర్మాణ సంస్థ రూపొందించిన రివైజ్డ్ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (ఆర్డీపీఆర్) మాస్టర్ ప్లాన్ ప్రకారం 4,800 ఎకరాలను నిర్మాణసంస్థకు అప్పగించాల్సి ఉంద ని తెలిపారు. ఇప్పటివరకు కేవలం 412 ఎకరాలను మాత్రమే సేకరించించారని చెప్పారు.
పోర్టుకు కేటాయించాల్సిన భూమి సంస్థకు అప్పగించలేదని, ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందన్నారు. ఇదిలాఉండగా భూసేకరణ నోటిఫికేషన్ జారీ, నష్టపరిహారం చెల్లింపులు, రైతుల అభిప్రాయ సేకరణ తదితర అంశాలన్నీ పూర్తికావాలంటే అన్నిశాఖలు సమష్టిగా పనిచేస్తే కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 2008లో పోర్టు పనుల శంఖుస్థాపన జరిగిన అనంతరం భూసేకరణకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు.
పోర్టు నిర్మాణానికి భూసేకరణే కీలక అంశంగా మారింది. ప్రభుత్వం భూసేకరణ చేసి నిర్మాణ సంస్థకు అప్పగిస్తే ఆ భూమిని చూపి ఆ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి రుణం తెచ్చుకుని పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బందరు పోర్టు అభివృద్ధి అనివార్యంగా మారింది. పాలకులు, అధికారులు పోర్టు అభివృద్ధి కోసం సత్వర నిర్ణయాలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.