
హుజూర్‌నగర్ : విద్య, వైద్యం, వ్యవసాయ రంగ అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలో ఆయన విలేకరులతో మట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు తాను కోరుకున్న విధంగా ప్రజలకు సేవలందిస్తే.. తాను వారికి మద్దతుగా ప్రచారం, ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి స్ధిదమన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ చరిత్ర సృష్టించాడన్నారు.
రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఇటీవల నిర్ణయం ప్రకటించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం ప్రజల ఆరోగ్యాలకు భరోసా కల్పించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల బాలికలకు విద్యాభ్యాసం ఆధారంగా సైకిళ్లు, స్కూటీలు, ల్యాప్‌ట్యాప్‌లు అందజేయడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు కల్పించాలన్నారు. సమావేశంలో రోటరీక్లబ్ అధ్యక్షుడు కుక్కడపు కోటేశ్వరరావు, కార్యదర్శి కోతి సంపత్‌రెడ్డి, ఎన్.వెంకటేష్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.