అరాచక శక్తులపై ఉక్కుపాదం
- విజయవాడ నూతన సీపీ బాధ్యతల స్వీకరణ
- మావోల కదలికలపై సరిహద్దుల్లో నిఘా
- కొత్త డీఐజీ హరికుమార్
సాక్షి, ఏలూరు : అరాచక శక్తులను రూపుమాపేందుకు చర్యలు చేపడతామని ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్ తెలిపారు. సోమవారం డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏలూరు రేంజ్ పరిధిలోని పశ్చిమ, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీల నుంచి మూడు జిల్లాల్లో పరిస్థితులను తెలుసుకుంటానని, అన్ని సమస్యలను పరిష్కరిస్తాని చెప్పారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, బదిలీల విషయాలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. మావోల కదలికలపై సరిహద్దు ప్రాంతాలలో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏలూరు రేంజ్ పరిధిలోకి ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా వచ్చిన ఏడు మండలాల్లో పోలీస్ వ్యవస్థను పటిష్ట పరుస్తామని వివరించారు. పోలీస్ సిబ్బంది ఎటువంటి సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చని, ఆ సమస్యనను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీఐజీ తెలిపారు. డీఐజీని మూడు జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
విజయవాడ సిటీ : విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా సోమవారం మధ్యాహ్నం 1.28 గంటలకు ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రస్తుత సీపీ బి.శ్రీనివాసులు బాధ్యతలు అప్పగించారు. అనంతరం డీసీపీలు తఫ్సీర్ ఇక్బాల్(శాంతిభద్రతలు), జీవీజీ అకోశ్‌కుమార్(పరిపాలన)లతో కలిసి ఏబీ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. పోలీస్ కమిషనరేట్‌కు పెద్ద సేవకుడిగా, కాపలాదారుగా వ్యవహరిస్తానని సీపీ చెప్పారు.
విభజనానంతర ప్రత్యేక పరిస్థితుల్లో రెండోసారి తాను నగర కమిషనర్‌గా రావాల్సి వచ్చిందని, ఈ అవకాశాన్ని సవాల్‌గా తీసుకొని పని చేస్తానని తెలిపారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రజలు పూర్తిగా సహకరిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజా రక్షణలో పోలీసు బాధ్యత, పాత్రపై తగిన అవగాహన చేసుకొని పని చేస్తామన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఇక్కడి మీడియా ఎదగి పూర్వవైభవం పొందాలని ఆకాంక్షించారు.