- దసరా ఉత్సవాలపై సబ్ కలెక్టర్, పోలీసు కమిషనర్ సమీక్ష
- భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని ప్రకటన
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన తరువాత ఇంద్రకీలాద్రిపై తొలిసారిగా జరుగుతున్న దసరా ఉత్సవాలకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు రెండు రోజులు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసి, భక్తులకు ఏ విధమైన ఇబ్బందీ రాకుండా చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ నాగలక్ష్మి, పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు, ఈవో త్రినాథరావు ప్రకటించారు.
స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో వారు దసరా ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 23వ తేదీ సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తవుతాయని, 24 ఉదయం నుంచి పోలీసులు దసరా ఉత్సవ ఏర్పాట్లలో పాల్గొంటారని తెలిపారు. ఏటా రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది, ఈసారి మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారని వివరించారు.
నగర పోలీసులను కేవలం పర్యవేక్షణకు మాత్రమే ఉపయోగిస్తామని, నగరంలో శాంతి భద్రతల విధులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీఐపీలకు పూర్తి స్థాయిలో భద్రత ఉంటుందని చెప్పారు. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు పోలీసు నిబంధనలు సడలిస్తామని తెలిపారు. భక్తులకు అర్థమయ్యే విధంగా రూట్‌మ్యాప్‌లు ఏర్పాటు చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇబ్బందుల్లేకుండా చూస్తాం : సబ్ కలెక్టర్
సబ్ కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, స్థానఘాట్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు.
మూలా నక్షత్రం, విజయదశమి రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సేపు నిలబడకుండా అమ్మవారి దర్శనం త్వరగా అయ్యేలా చూస్తామని చెప్పారు. విద్యుత్, ఇరిగేషన్ సమస్యలు లేకుండా ఆయా శాఖల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఆలయ ఈవో త్రినాథరావు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి వేల మంది భక్తులు తరలి వస్తున్నందున, వారికి కావాల్సిన ప్రసాదాలు, దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావును ఆహ్వానించామన్నారు. దుర్గాష్టమి, మహార్ణవమి ఒకే రోజు వచ్చినందున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రతి ప్రాంతంలో దేవస్థానం సిబ్బంది అందుబాటులో ఉంటారని, వారిని అడిగి భక్తులు కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు. పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.