కొత్త రాజధాని బెజవాడే బెస్ట్
- ఆరు దశాబ్దాల క్రితమే చెప్పిన వాంఛూ కమిటీ
- మళ్లీ చర్చనీయాంశమైన ఆ నివేదిక
- అన్ని విధాలా అనువైన ప్రాంతంగా తేల్చిన వాంఛూ
- ఆనాటి కుటిల రాజకీయాలే మళ్లీ పునరావృతమవుతాయా?
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన ఘట్టం ముగియడంతో సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధాని ఎక్కడ అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఐదారు ప్రాంతాల వారు తమ జిల్లాల్లోనే రాజధాని ఏర్పాటుచేయాలనే డిమాండు ముందుకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్రిత పుటల్లోకి తొంగిచూస్తే 1952, 53ల్లో నెలకొన్న పరిస్థితులు మళ్లీ ఇప్పుడు పునరావృతమైనట్లు అనిపిస్తుంది. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారు విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన రోజులవి.
ఇప్పటి మాదిరిగానే అప్పుడు రాజధాని ఎక్కడ అనే చర్చ సాగింది. చాలామంది వాల్తేరు-విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఆహ్లాదకరమైన వాతావరణం, రాజధానికి కావలసిన హంగులు, వివిధ కార్యాలయాలు నెలకొల్పుకోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలే ఆ అభిప్రాయం వ్యక్తం కావడానికి కారణం. ఇందుకు భిన్నంగా వాంఛూ కమిటీ తన నివేదిక అందజేసింది. ఇప్పుడు ఆ కమిటీ నివేదికను జనం మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.
నూతన ఆంధ్ర రాష్ట్రం- ఆర్థిక, ఇతర అంశాలపై వాంఛూ కమిటీ కేంద్రానికి సమగ్ర నివేదిక ఇచ్చింది. అలహాబాద్ చీఫ్ జస్టిస్ కైలాస్‌నాథ్ వాంఛూ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఈ కమిటీని 1952 డిసెంబరు19న అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ సభ్యులు రాయలసీమ, కోస్తాంధ్రలో రెండు నెలలపాటు విస్తృతంగా పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేసి 1953 ఫిబ్రవరిలో కేంద్రానికి నివేదిక ఇచ్చింది.
కమిటీ ఏం చెప్పిందంటే..
ఆరు దశాబ్దాల క్రితమే ఈ కమిటీ.. ఆంధ్ర రాష్ట్ర రాజధాని విజయవాడ- గుంటూరు మధ్య ఏర్పాటుచేయాలని సూచించింది. ఇది అన్ని విధాలా హేతుబద్ధమైనదని, శాస్త్రీయమైనదని కూడా స్పష్టంచేసింది. భౌగోళికంగా, ఇతర వసతులు పరంగా ఈ ప్రాంతం అనువైనదని పేర్కొంది. కొత్త రాష్ట్రం మధ్య భాగంలో విజయవాడ-గుంటూరు ప్రాంతం ఉందని, రైల్వే జంక్షన్, వివిధ ప్రాంతాలతో రోడ్డు మార్గాల అనుసంధానం కలిగి ఉందని వెల్లడించింది. కృష్ణానది జలాల లభ్యతను కూడా ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. భూగర్భ, నదీ జలాలు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో కొత్త రాష్ట్ర రాజధానిగా ఈ ప్రాంతం ఎంపిక సశాస్త్రీయమని తేల్చింది. ఇదే ప్రాతిపదికలు నేడు కూడా వర్తిస్తాయనడంలో సందేహంలేదు.
సీమాంధ్రలోని 13 జిల్లాలకు అన్ని విధాలా మధ్యస్థ ప్రాంతంగా బెజవాడ ఉంది. రైలు, రోడ్డు మార్గాలు అభివృద్ధి చెందాయి. గన్నవరం ఎయిర్‌పోర్టు అందుబాటులో ఉంది. దాన్ని విస్తరించుకోవడం సులువైన పని. అంతేకాదు, సచివాలయం, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలు ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్నాయి. నాగార్జున యూనివర్సిటీని ఖాళీ చేయిస్తే సచివాలయం, ఇతర ప్రభుత్వ శాఖలకు కావాల్సిన వసతి ఏర్పాటుచేసుకోవచ్చు. ఇలా ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నా రాష్ట్ర రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు బెజవాడకు ఉన్నాయి.
కుటిల రాజకీయాలు
ఆనాడు విజయవాడ కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండడం, రాయలసీమ ప్రాంతవాసులు తమకే రాజధాని కావాలని డిమాండు చేయడంతో కర్నూలు రాజధానిగా ఏర్పాటుచేశారు. అయితే అక్కడ కనీస వసతులు లేక గుడారాలు వేసి కార్యాలయాలు పెట్టి నానా అవస్థలు పడిన చరిత్ర మరవలేనిది. ఆనాడు విజయవాడకు రాజధానిగా అవకాశం లేకుండా చేయడంలో నీలం సంజీవరెడ్డి, జవహర్‌లాల్ నెహ్రూ కీలకపాత్ర పోషించారనే వాదనలు ఉన్నాయి. రాజధానిగా కర్నూలు ఉండాలా.. విజయవాడ ఉండాలా అనే అంశంపై మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోని ఈ ప్రాంత శాసనసభ్యుల మధ్య ఓటింగ్ జరిగింది. కేవలం ఒక ఓటు తేడాతో కర్నూలు ఎన్నుకునానరు.
కర్నూలుకు అనుకూలంగా 80, విజయవాడకు 79 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా తొంటి రాజకీయమే జరిగింది. మద్రాసు రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనడంతోపాటు ప్రకాశం పంతులు, ఎన్జీరంగా నేతృత్వంలో గుంటూరు ప్రాంతానికి చెందిన ఏడుగురు సభ్యులు కర్నూలుకు అనుకూలంగా ఓటు చేశారు. ఇలా విజయవాడకు చరిత్రలో తీరని అన్యాయం జరిగింది. అదే విజయవాడే రాజధాని అయి ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా రాజధాని మారకుండా ఉండేదని, నేడు రాష్ట్ర విభజనకు ఆస్కారమే ఉండేది కాదనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అటువంటి రాజకీయాలే చోటుచేసుకుంటున్నాయి.
కొందరు విశాఖపట్నం, మరికొందరు కర్నూలు లేదా ఒంగోలు జిల్లాలో రాజధాని ఉండాలనే వాదనలు తీసుకువస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొనైనా ఈసారి మరో పొరపాటు చేయకూడదని పలువురు మేధావులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వాణిజ్య, రవాణా రాజధానిగా ఉన్న విజయవాడను కొత్త రాష్ట్ర రాజధానిగా ఎంపికచేస్తే అన్ని విధాలా అభివృద్ధి ఊతంగా నిలుస్తుందని వారు చెబుతున్నారు.