harikumar
-
నేవీ షిప్‌పై మొదటిసారిగా మహిళా అధికారికి బాధ్యతలు
న్యూఢిల్లీ: నావికా దళం యుద్ధ నౌకపై మొదటిసారిగా మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. మహిళా అధికారులకు ‘అన్ని ర్యాంకులు– అన్ని బాధ్యతలు’ అనే సిద్ధాంతానికి నేవీ కట్టుబడి ఉంటుందన్నారు. హిందూ మహా సముద్రంలో చైనా ఉనికి పెరిగిన నేపథ్యంలో భారత నావికా దళం యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు గత ఏడాదిగా వ్యూహాత్మకంగా చురుగ్గా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. -
వియత్నాంకు కానుకగా మన యుద్ధనౌక
న్యూఢిల్లీ: వియత్నాంకు భారత్ అరుదైన కానుక అందించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిదర్శనంగా ఐఎన్ఎస్ కృపాణ్ యుద్ధనౌకను బహుమతిగా ఇచి్చంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఇరు దేశాల్లో నెలకొన్న ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతంలో గస్తీని బలోపేతం చేయడం దీని ఉద్దేశమంటున్నారు. పూర్తి సామర్థ్యంతో పని చేసే యుద్ధ నౌకను ఒక మిత్రదేశానికి భారత్ కానుకగా ఇవ్వడం ఇదే తొలిసారని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన శనివారం బే ఆఫ్ కామ్ రన్హ్ జలాల్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ కృపాణ్‌ను ఆ దేశానికి అందజేశారు. పూర్తిస్థాయి ఆయుధాలతో కూడిన నౌకను ఆ దేశ నేవీకి అప్పగించినట్టు వివరించారు. భారత్ జీ20 సదస్సు ప్రధాన థీమ్ అయిన వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్)లో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు తెలిపారు. ఐఎన్ఎస్ కృపాణ్ గస్తీతో దక్షిణ చైనా జలాల్లో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ కృపాణ్ జూన్ 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి జూలై 8 నాటికి వియత్నాం చేరింది. -
ఇండో పసిఫిక్ భద్రతపై ఆస్ట్రేలియాతో కలిసి అడుగులు
సాక్షి, విశాఖపట్నం: ఇండో పసిఫిక్ సముద్ర భద్రత, సవాళ్లపై ఆస్ట్రేలియాతో కలిసి అడుగులు వేస్తున్నామని తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ హరికుమార్ వెల్లడించారు. సీఎన్‌ఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాలో మూడు రోజులు అధికారికంగా పర్యటించారు. రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ మార్క్ హమ్మండ్, ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్సెస్ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ డేవిడ్ జాన్సన్‌తోపాటు రక్షణ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక ఒప్పందాలు, పరస్పర సహకారానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. సాగర జలాల్లో ఉన్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన చర్యలపై ఆస్ట్రేలియా అధికారులతో సమీక్షించారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని గురువారం విశాఖపట్నం చేరుకున్న రియర్ అడ్మిరల్ హరికుమార్ సముద్ర పర్యావరణం, హిందూ మహాసముద్రం, ఇండో పసిఫిక్ తీరంలో ఆధిపత్యం, ఇతర అంశాలపై కేంద్రీకృత ప్రయత్నాలను పెంచాల్సిన అవసరాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని తూర్పు నౌకాదళ వర్గాలు పేర్కొన్నాయి. -
2047 నాటికి నేవీకి పూర్తి స్వదేశీ పరిజ్ఞానం
సాక్షి, విశాఖపట్నం: భారత నావికాదళం 2047 నాటికల్లా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానాన్ని సముపార్జించుకుంటుందని నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ చెప్పారు. ఆ తర్వాత ఆత్మనిర్భర్‌తో నూరు శాతం స్వదేశీ పరిజ్ఞానం ద్వారా యుద్ధనౌకలు, జలాంతర్గాముల నిర్మాణం చేపట్టవచ్చని తెలిపారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) స్వదేశీ పరిజ్ఞానంతో రూ.2,230 కోట్లు వెచ్చించి నిర్మించిన రెండు డైవింగ్ సపోర్టు వెసల్స్(డీఎస్వీల) జల ప్రవేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత సముద్ర జలాల్లో దేశ రక్షణకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా కొత్తగా 45 యుద్ధ నౌకలు, జలాంతర్గాములను నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో 43 నిర్మాణంలో ఉన్నాయన్నారు. నౌకా నిర్మాణ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగినట్టు తెలిపారు. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ డీఎస్‌వీలను తొలిసారిగా నేవీ కోసం విశాఖ హిందుస్తాన్ షిప్‌యార్డు నిర్మించిందని, వీటికి అవసరమైన పరికరాలను దేశంలోని 120 ఎంఎస్ఎంఈలు సమకూర్చినట్టు చెప్పారు. జలాంతర్గాముల్లో సమస్యలు తలెత్తినప్పుడు సరిచేసేందుకు, రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సిబ్బందిని రక్షించేందుకు కొత్త డీఎస్వీ వెసల్స్ ఉపయోగపడతాయని తెలిపారు. ఇవి అందుబాటులోకొచ్చాక డీప్ సీ డైవింగ్ ఆపరేషన్లలో కొత్త శకం ఆరంభమవుతుందన్నారు. హెచ్ఎస్ఎల్ సీఎండీ హేమంత్ ఖాత్రి మాట్లాడుతూ తమ నౌకా నిర్మాణం కేంద్రం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 200 నౌకలను నిర్మించిందని, 2000 నౌకలకు మరమ్మతులు చేసిందని వెల్లడించారు. 2021–22 ఆరి్థక సంవత్సరంలో రూ.755 కోట్ల టర్నోవర్ సాధించి, రూ.51 కోట్ల లాభాలనార్జించిందని వివరించారు. నిస్తార్, నిపుణ్‌లుగా నామకరణం కొత్తగా నిర్మించిన డీఎస్‌వీలకు నిస్తార్, నిపుణ్‌లుగా భారత నావికా దళాధిపతి సతీమణి కళాహరికుమార్ నామకరణం చేశారు. తొలుత ఆమె రెండు వెసల్స్‌కు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం నేవీ చీఫ్ హరికుమార్‌తో కలిసి ఆమె రిమోట్ కంట్రోల్ ద్వారా నిస్తార్, నిపుణ్‌లపై జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆ వెంటనే వాటిని హర్షధ్వానాల మధ్య జలప్రవేశం చేయించారు. కార్యక్రమంలో తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ బి.దాస్‌గుప్తా, నేవీ, షిప్‌యార్డు ఉన్నతాధికారులు, హెచ్ఎస్ఎల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
అరాచక శక్తులపై ఉక్కుపాదం
విజయవాడ నూతన సీపీ బాధ్యతల స్వీకరణ మావోల కదలికలపై సరిహద్దుల్లో నిఘా కొత్త డీఐజీ హరికుమార్ సాక్షి, ఏలూరు : అరాచక శక్తులను రూపుమాపేందుకు చర్యలు చేపడతామని ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్ తెలిపారు. సోమవారం డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏలూరు రేంజ్ పరిధిలోని పశ్చిమ, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీల నుంచి మూడు జిల్లాల్లో పరిస్థితులను తెలుసుకుంటానని, అన్ని సమస్యలను పరిష్కరిస్తాని చెప్పారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, బదిలీల విషయాలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. మావోల కదలికలపై సరిహద్దు ప్రాంతాలలో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏలూరు రేంజ్ పరిధిలోకి ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా వచ్చిన ఏడు మండలాల్లో పోలీస్ వ్యవస్థను పటిష్ట పరుస్తామని వివరించారు. పోలీస్ సిబ్బంది ఎటువంటి సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చని, ఆ సమస్యనను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీఐజీ తెలిపారు. డీఐజీని మూడు జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయవాడ సిటీ : విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా సోమవారం మధ్యాహ్నం 1.28 గంటలకు ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రస్తుత సీపీ బి.శ్రీనివాసులు బాధ్యతలు అప్పగించారు. అనంతరం డీసీపీలు తఫ్సీర్ ఇక్బాల్(శాంతిభద్రతలు), జీవీజీ అకోశ్‌కుమార్(పరిపాలన)లతో కలిసి ఏబీ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. పోలీస్ కమిషనరేట్‌కు పెద్ద సేవకుడిగా, కాపలాదారుగా వ్యవహరిస్తానని సీపీ చెప్పారు. విభజనానంతర ప్రత్యేక పరిస్థితుల్లో రెండోసారి తాను నగర కమిషనర్‌గా రావాల్సి వచ్చిందని, ఈ అవకాశాన్ని సవాల్‌గా తీసుకొని పని చేస్తానని తెలిపారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రజలు పూర్తిగా సహకరిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజా రక్షణలో పోలీసు బాధ్యత, పాత్రపై తగిన అవగాహన చేసుకొని పని చేస్తామన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఇక్కడి మీడియా ఎదగి పూర్వవైభవం పొందాలని ఆకాంక్షించారు.