
రియర్ అడ్మిరల్ హరికుమార్‌కు జ్ఞాపికను ఇస్తున్న ఆస్ట్రేలియన్ నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ హమ్మండ్
సాక్షి, విశాఖపట్నం: ఇండో పసిఫిక్ సముద్ర భద్రత, సవాళ్లపై ఆస్ట్రేలియాతో కలిసి అడుగులు వేస్తున్నామని తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ హరికుమార్ వెల్లడించారు. సీఎన్‌ఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాలో మూడు రోజులు అధికారికంగా పర్యటించారు.
రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ మార్క్ హమ్మండ్, ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్సెస్ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ డేవిడ్ జాన్సన్‌తోపాటు రక్షణ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు.
ద్వైపాక్షిక ఒప్పందాలు, పరస్పర సహకారానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. సాగర జలాల్లో ఉన్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన చర్యలపై ఆస్ట్రేలియా అధికారులతో సమీక్షించారు.
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని గురువారం విశాఖపట్నం చేరుకున్న రియర్ అడ్మిరల్ హరికుమార్ సముద్ర పర్యావరణం, హిందూ మహాసముద్రం, ఇండో పసిఫిక్ తీరంలో ఆధిపత్యం, ఇతర అంశాలపై కేంద్రీకృత ప్రయత్నాలను పెంచాల్సిన అవసరాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని తూర్పు నౌకాదళ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment