క్రీడాశ్వాస
- నేషనల్ గేమ్స్‌పై అభిమానుల ఆశ
రాష్ర్ట విభజన పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. విజయవాడ నగరంలో జాతీయ క్రీడలు నిర్వహిస్తే.. అపార నైపుణ్యం నిబిడీ కృతమై ఉన్న యువత తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకునేందుకు మంచి అవకాశం వస్తుందని భావిస్తున్నారు. పతకాలే కాదు.. పురస్కారాలు కూడా సొంతం చేసుకుంటామన్న కొండంత ఆశతో ఉన్నారు. నగరాన్ని క్రీడలకు వేదికగా మలచుకుంటే హైదరాబాద్‌ను తలదన్నే రీతిలో తయారవుతుందని క్రీడా నిపుణులూ విశ్లేషిస్తున్నారు.
విజయవాడ స్పోర్ట్స్ : రాష్ట్ర విభజనకు ముందు జాతీయ క్రీడలు, ఆఫ్రో ఆసియా వంటి క్రీడలు ఒక్క హైదరాబాద్‌లోనే నిర్వహించేవారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అధునాతన స్టేడియాలు, సింథటిక్ ట్రాక్‌లు, ఆస్ట్రోటర్ఫ్ మైదానాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం దండిగా నిధులిచ్చింది. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది. వెనక్కితిరిగి చూస్తే.. సీమాంధ్రకు మిగిలింది శూన్యమనే చెప్పాలి. మనకున్న వనరులు, సౌలభ్యాలను సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో విజయవాడను మరో హైదరాబాద్‌గా తీర్చిదిద్ది క్రీడాపతాకాన్ని రెపరెపలాడించవచ్చు.
2017 జాతీయ క్రీడలు ఇక్కడే..
రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో 2017లో జరగాల్సిన జాతీయ క్రీడల్ని నగరంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా మాత్రమే క్రీడా మౌలిక సదుపాయాలు సాధించుకోవచ్చని క్రీడాసంఘాలు, నిపుణులు చెబుతున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కోరింది. కేంద్రం కరుణించి జాతీయ క్రీడలు కేటాయించి ప్రత్యేక నిధులిస్తే విజయవాడతో పాటు విశాఖపట్నం, తిరుపతి, కాకినాడల్లోనూ అంతర్జాతీయ స్టేడియాలు, క్రీడా మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతాయి. గతంలో హైదరాబాద్‌లో జాతీయ క్రీడలు నిర్వహించినప్పుడు కంటితుడుపు చర్యగా విశాఖపట్నంలో మాత్రమే ఒకట్రెండు ఆటలు నిర్వ హించారు. 2017 జాతీయ క్రీడలు విజయవాడను బేస్ చేసుకుని తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలుల్లో కూడా నిర్వహించాలని నిర్ణయించారు.
నగర స్వరూపమే మారిపోతుంది
జాతీయ క్రీడల కోసం కనీసం రూ.2వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. 39వ జాతీయ క్రీడలు విజయవాడకు కేటాయిస్తే నగర స్వరూపమే మారిపోతుందనడంలో సందేహం లేదు. సింథటిక్ ట్రాక్‌లు, ఆస్ట్రోటర్ఫ్ మైదానాలు, స్విమింగ్ పూల్స్, డైవింగ్ పూల్స్, కృష్ణానదిలో వాటర్ స్పోర్ట్స్‌తోపాటు మంచి రోడ్లు, నగర సుందరీకరణ జరుగుతుంది.
విజయవాడ కేంద్రంగా 32 క్రీడాంశాల్లో ఆతిథ్యం ఇవ్వొచ్చు.
భవానీపురంలో దాదాపు 10 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు అప్పగించారు. అక్కడ స్టేడియం నిర్మిస్తే అంతర్జాతీయ స్థాయి సింథటిక్ రన్నింగ్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్డేడియం రూపుదిద్దుకుంటాయి.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అథ్లెటిక్ ట్రాక్ వేసుకోవచ్చు.
అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎంబీపీ మున్సిపల్ స్టేడియంలో హాకీ కోసం ఆస్ట్రోటర్ఫ్ హాకీ ఫీల్డ్ ఏర్పాటుచేసుకోవచ్చు.
మైలవరంలో అవుట్‌డోర్ స్టేడియంలో ఫుట్‌బాల్, ఇండోర్ స్టేడియంలో తైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్ వంటి పోటీలు నిర్వహించవచ్చు.
మచిలీపట్నంలో బీచ్ వాలీబాల్, యాచింగ్, సెయిలింగ్ వంటివి నిర్వహించుకోవచ్చు.
పొరుగునే ఉన్న గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కూడా జాతీయ క్రీడలు నిర్వహించుకోగలిగిన మైదానం ఉంది.
కృష్ణా నదిలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తే విజయవాడ క్రీడా, పర్యాటక రంగంగా మారిపోతుంది.
క్రీడావిలేజ్ నిర్మాణంతో నిధులే నిధులు..
జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు, అధికారులు, టెక్నికల్ స్టాఫ్ వసతి కోసం కోట్లాది రూపాయిలతో క్రీడా విలేజ్ నిర్మించాల్సి ఉంటుంది. గచ్చిబౌలీలో మాదిరిగా అధునాతన అపార్టుమెంట్లు కడతారు. పోటీలు ముగిసిన తరువాత వాటిని వేలం ద్వారా ప్రభుత్వం అమ్మకానికి పెడుతుంది. దీంతో భారీగా నిధులు సమకూరతాయి. ఆగిరిపల్లి -గన్నవరం మధ్య ఈ క్రీడా విలేజ్ నిర్మించేందుకు అవకాశం ఉందని క్రీడానిపుణలు చెబుతున్నారు.
ఆభివృద్ధి చెందాలంటే జాతీయ క్రీడలే మార్గం
జాతీయ క్రీడలు నిర్వహించడం ద్వారా స్థానిక వర్థమాన క్రీడాకారుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. కొత్త రాష్ట్రం పేరు ప్రఖ్యాతులు ఇప్పటికిప్పుడు దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పాలన్నా అది కేవలం క్రీడారంగంతోనే సాధ్యం. నగరానికి కొత్త రూపు వస్తుంది.