heavy hand
-
10 నెలలు.. 1,142 ఎన్కౌంటర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేరస్తులపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గత మార్చిలో యోగి సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 2018, జనవరి 31 వరకూ యూపీలో 1,142 ఎన్కౌంటర్లు జరిగినట్లు పోలీసులు ఓ నివేదిక విడుదల చేశారు. ఈ కాల్పుల్లో 34 మంది నేరస్తులు ప్రాణాలు కోల్పోగా, 265 మంది గాయపడ్డారు. గత 10 నెలల్లో 2,744 మంది హిస్టరీ షీటర్ల(నేర చరిత్ర ఉన్నవారు)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లలో నలుగురు పోలీస్ సిబ్బంది చనిపోగా, 247 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో నేరస్తులను ఏరివేయడానికి పోలీసులకు సీఎం యోగి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ‘ఆపరేషన్ క్లీన్’ పేరిట పరారీలో ఉన్న నేరస్తుల కోసం వేట మొదలైందన్నారు. ‘లొంగిపోండి లేదా రాష్ట్రం విడిచివెళ్లిపోండి’ అని నేరస్తులకు ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. మీరట్ జోన్లో పోలీసులు అత్యధికంగా 449 ఎన్కౌంటర్లు చేయగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆగ్రా(210), బరేలీ(196), కాన్పూర్(91) జోన్లు నిలిచాయన్నారు. సీఎం యోగి నియోజకవర్గమైన గోరఖ్‌పూర్ జోన్లో(31) అతితక్కువ ఎన్కౌంటర్లు జరిగినట్లు వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్రంలో నేరాలను అరికట్టడానికి 167 మంది క్రిమినల్స్‌పై జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేయడంతో పాటు రూ.150 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎన్కౌంటర్ ముసుగులో సామాన్య పౌరుల్ని పోలీసులు కాల్చిచంపడంపై యూపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నోయిడాలోని ఓ జిమ్ యాజమానితో పాటు మరో వ్యక్తిని పోలీసులు కాల్చిచంపడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) యూపీ ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు సైతం జారీచేసింది. ఈ ఎన్కౌంటర్లపై సరైన ప్రభుత్వ పర్యవేక్షణ లేకుంటే 1991 నాటి పిలిభిత్ నకిలీ ఎన్కౌంటర్ లాంటి ఘటనలు పునరావృతమవుతాయని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 1991లో ప్రైవేటు బస్సులో ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తున్న 10 మంది సిక్కుల్ని యూపీ పోలీసులు నకిలీ ఎన్కౌంటర్లో కాల్చిచంపారు. వీరిందరూ పాకిస్తాన్ ప్రోద్బలం ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులని బుకాయించారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక సీబీఐ కోర్టు 2016లో 47 మంది పోలీస్ అధికారుల్ని దోషులుగా తేల్చింది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌధరీ మాట్లాడు తూ.. ‘ప్రభుత్వం నేరాలను తగ్గించడంలో విఫలమై ఎన్కౌంటర్ల ముసుగులో తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటోంది’ అని అన్నారు. -
కల్తీ కారంపై ఉక్కుపాదం
► 11 లైసెన్సులు రద్దు ► గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ కొరిటెపాడు(గుంటూరు): కల్తీ కారం తయారీ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు హెచ్చరించారు. యార్డు పరిపాలనా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వార్థం కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. గత నవంబర్‌లో కోల్డ్ స్టోరేజీలు, కల్తీ కారం మిల్లులపై నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో 25 వేల కల్తీకారం బస్తాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి 97 శాంపిల్స్ తీసి ల్యాబ్‌కు పంపగా వాటిలో సుమారు 58 సురక్షితం కాని, ప్రమాణాలు లేనివిగా నివేదికలు వచ్చాయని వివరించారు. మొత్తం 40 మిల్లుల్లో కల్తీ కారం ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. వాటిలో 11 మిల్లులకు లైసెన్సులు ఉన్నాయని, మిగిలిన 29 మిల్లులకు లైసెన్సులు లేవని, లైసెన్సులు ఉండి కల్తీ కారం తయారు చేసిన 11 మిల్లుల లైసెన్సులను రద్దు చేసినట్లు చెప్పారు. లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తున్న మిల్లులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నామన్నారు. పుడ్ అండ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ వీరందరిపై చట్టప్రకారం క్రిమినల్ కేసులు పెట్టనున్నట్టు తెలిపారు. కల్తీకి పాల్పడినట్లు తేలితే శాశ్వతంగా వ్యాపారం చేయకుండా అన్ని లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. సత్యనారాయణ-రమేష్‌కుమార్ అండ్ కో, రమా సత్యదేవా చిల్లీస్, విజయ ఆదిలక్ష్మి ట్రేడర్స్, అనిల్ అండ్ కంపెనీ, వి.ఎం.స్పైస్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్, వి.ఎం.ఆర్.స్పైసెస్ ప్రొడక్ట్స్, వర్షిణి జనరల్ ట్రేడింగ్ కంపెనీ, రజిత్ ఎక్స్‌పోర్ట్సు, వేగాస్ ప్రొడక్ట్స్, వోలేమ్ అగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్, లక్ష్మీగణపతి ఇండస్ట్రీస్ లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు. సమావేశంలో యార్డు అధికారి సుబ్రహ్మణ్యం, పాలకవర్గ సభ్యుడు శ్రీరాం రాజీవ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
లే‘ఔట్’..!
♦ జిల్లా పరిధిలో 102 అక్రమ లేఅవుట్లు రద్దు ♦ గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా వెలిసిన వెంచర్లు ♦ అక్రమమని తేలుస్తూ పంచాయతీరాజ్ శాఖకు నివేదిక ♦ వాటిని రద్దు చేస్తూ డీపీఓ ఉత్తర్వులు అక్రమ లేఅవుట్లపై జిల్లా యంత్రాంగం కొరడా ఝళిపించింది. అనధికారికంగా వెలిసిన వెంచర్లపై ఉక్కుపాదం మోపింది. డెరైక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలోని మండలాల్లో పుట్టుకొచ్చిన 102 అక్రమ లేఅవుట్లను రద్దు చేసింది. ఎలాంటి అనుమతుల్లేకుండా అడ్డగోలుగా వెలిసిన వెంచర్ల చిట్టాను సేకరించిన డీటీసీపీ విభాగం అక్రమార్కుల జాబితాను జిల్లా పంచాయతీరాజ్ శాఖకు పంపింది. ఈ మేరకు డీటీసీపీ నిర్ధారించిన 102 అక్రమ లేఅవుట్లను రద్దు చేస్తున్నట్లు డీపీఓ అరుణ ప్రకటించారు. కేసులు పెడతాం.. అనధికారికంగా వెలిసిన లేఅవుట్లను కూల్చేస్తాం. 102 ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం. అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్‌లు, కార్యదర్శులు, విస్తరణాధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా అడ్డగోలుగా లేఅవుట్లు చేస్తే ఉపేక్షించేది లేదు. అక్రమమని తేల్చిన లేఅవుట్ల జాబితాను ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరుస్తాం. ప్లాట్లు కొనేముందు ఆయా వెంచర్లకు అనుమతి ఉందా? లేదా అనేది ఒకసారి సరిచూసుకుంటే మోసాల బారినపడే అవకాశముండదు. - అరుణ , డీపీఓ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : లేఅవుట్లకు అనుమతి ఇచ్చే ఎలాంటి అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్ఎండీఏ పరిధిలో హెచ్ఎండీఏకు.. ఆ పరిధి దాటిన మండలాల్లో డీటీసీపీకి మాత్రమే లేఅవుట్లకు అనుమతులు జారీ అధికారం ఉంది. అయితే, ఈవిషయాన్ని గుట్టుగా ఉంచుతున్న రియల్టర్లు పంచాయతీ లేఅవుట్ల పేర కొనుగోలుదారులను ఏమార్చుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. అభివృద్ధి చేయని వెంచర్లలో కారుచౌకగా ప్లాట్లు విక్రయిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. అప్రూవ్డ్ లేఅవుట్లతో పోలిస్తే తక్కువ ధరకు స్థలాలు దొరుకుతుండడంతో అల్పాదాయవర్గాలు ఈ వెంచర్లలో ప్లాట్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నాయి. మధ్యతరగతి ప్రజల బలహీనతలను సొమ్ముచేసుకుంటున్న స్థిరాస్తి సంస్థలు.. మారుమూల ప్రాంతాల్లో సైతం వెంచర్లు చేశాయి. కనీస రోడ్లు, విద్యుత్ స్తంభాలు కూడా వేయకుండా.. నాలుగు రాళ్లు పాతి ప్లాట్లుగా విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. కొ న్ని సంస్థలయితే.. భూ వినియోగ మార్పి డి చేయకుండానే లేఅవుట్లుగా అభివృద్ధి చేసినట్లు డీటీసీపీ అధికారుల పరిశీలనలో తేలి ంది. అంతేకాకుండా కొన్నిచోట్ల భూ యజ మానికి కొంత మొత్తం చెల్లించి అగ్రిమెంట్ కాపీతోనే ప్లాట్లను అమ్మేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే అక్రమ లేఅవుట్లపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వేచేసిన డీటీసీపీ అధికారుల బృందం జిల్లావ్యాప్తంగా దా దాపు 400 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ లేఅవుట్లు (102) వెలిసినట్లు తేల్చి జాబితాను జిల్లా పంచాయతీశాఖాధికారికి అంద జేసింది. -
జైషే గ్రూప్‌పై పాకిస్థాన్ ఉక్కుపాదం
-
ఐకేపీ యానిమేటర్లపై ఉక్కుపాదం
సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: దాదాపు ఏడాదిన్నరగా తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన జీతం బకాయిలు చెల్లించాలంటూ డ్వాక్రా యానిమేటర్లు (ఐకేపీ వీవోఏలు) సోమవారం తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆదివారం రాత్రి పోలీసులు తమ ప్రతాపం చూపించారు. వేతన బకాయిలు చెల్లించమని నెలల తరబడి ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం తీరుకు నిరసనగా సుమారు 20 వేలమంది వీవోఏలు అసెంబ్లీని ముట్టడించాలని నిర్ణయించారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద మోహరించి యానిమేటర్లు హైదరాబాద్ వెళ్లకుండా చేసేందుకు భయానక వాతవరణం సృష్టించారు. యానిమేటర్లకు నాయకత్వం వహించే మహిళలు, సీఐటీయూ నాయకులను రాత్రి ఇళ్ల వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మహిళలను నిర్బంధించిన పోలీసులు సీఐటీయూ నాయకులను అరెస్టు చేశారు. విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు, అనంతపురం జిలాల్లో బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మోహరించిన పోలీసు లు పలువురిని హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకున్నారు.వైఎస్సార్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేస్తామని హెచ్చరించినా ఆందోళనకారులు హైదరాబాద్ బయలుదేరారు. నెల్లూరు జిల్లాలో కూడా అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లాలోనూ అరెస్టులు కొనసాగాయి. ఐకేపీ యానిమేటర్ల ఆందోళనకు పది వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. -
ఈవ్ టీజింగ్‌పై ఉక్కుపాదం
వేధింపులకు పాల్పడేవారికి జైలుతోపాటు భారీ జరిమానా రెండోసారి అయితే నిర్భయ కేసు యాంటీ ర్యాగింగ్ చట్టాన్ని బలోపేతం చేస్తూ కొత్త చట్టం ముసాయిదాకు కేబినెట్ ఆమోదం సాక్షి, హైదరాబాద్: ఇకపై ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారు కటకటాలు లెక్కించడంతోపాటు భారీ జరిమానా చెల్లించక తప్పదు! ఈ మేరకు శిక్షలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఇప్పటికే ఉన్న యాంటీ ర్యాగింగ్ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈవ్ టీజింగ్ నిరోధ చట్టాన్ని రూపొందిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య నేతృత్వంలోని మహిళా భద్రత కమిటి చేసిన సిఫారసుల ఆధారంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఈ కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. ఈ చట్టం ముసాయిదాను ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదిం చింది. ఈవ్ టీజింగ్‌కు పాల్పడే నిందితులకు జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధించనున్నారు. నేర తీవ్రత బట్టి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం మొదలుకుని ప్రతి ప్రైవేటు సంస్థల్లో ఈవ్ టీజిం గ్ను నిరోధించడానికి యాజమాన్యం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలి. విచారణ జరిపి చర్యలు చేపట్టాలి. లేకుంటే యాజమాన్యాన్ని కూడా శిక్షించవచ్చని ఈ ముసాదాలో పేర్కొన్నారు. టీజింగ్‌కు పాల్పడుతూ రెండోసారి పట్టుబడితే నిర్భయ కేసు పెట్టాలని సూచించారు. టీజింగ్ కారణంగా ఎవరైనా మరణి స్తే నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించే నిబంధనను కూడా చేర్చినట్టు సమాచారం. -
ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం
జూపాడుబంగ్లా: ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపుతామని.. రౌడీషీటర్లు, ఫ్యాక్షనిస్టులు వారి కార్యకలాపాలకు స్వస్తి చెప్పకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. గురువారం మండల జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొన్ని కేసులకు సంబంధించి రికార్డులను సక్రమంగా నమోదు చేయకపోవడంతో దర్యాప్తు సక్రమంగా సాగలేదన్నారు. వీటిని పునఃదర్యాప్తు చేసేందుకు సీఐ, డీఎస్పీలను ఆదేశించామన్నారు. గ్రామాల్లో బెల్టు, నాటుసారా విక్రయాలు సాగుతున్నట్లు తన దృష్టికి వస్తే ఆయా పోలీసుస్టేషన్ల ఎస్ఐలను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,400 మంది రౌడీషీటర్లను గుర్తించడంతో పాటు.. ఆయా స్టేషన్ల ఎస్ఐలకు వారి సమాచారం అందజేసి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. వీరిలో మార్పు తీసుకొచ్చేందుకు వారానికో రోజు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫ్యాక్షన్ కారణంగా కర్నూలు జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ఫ్యాక్షన్ కనుమరుగైన గ్రామాలను కేటగిరీల వారీగా విభజించి అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. ఐరన్‌ఓర్, ఇసుక అక్రమ తరలింపులపై మైనింగ్ అధికారులతో కలసి దాడులు చేస్తామన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలతో నగరంలోని చాలా మార్పు వస్తోందన్నారు. రాత్రిళ్లు ఈ కార్యక్రమం వల్ల ప్రమాదాలను నివారించడంతో పాటు పాత నేరస్తుల కార్యకలాపాలు తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. అనంతరం పోలీసు క్వార్టర్స్‌ను పరిశీలించి స్థానికంగా నివాసం ఉండని పోలీసుల వివరాలను తెలుసుకున్నారు. నివాసం ఉంటున్న చెన్నయ్యకు అవార్డు ప్రకటించి.. స్థానికంగా ఉండని సిబ్బందిని మందలించారు. మరోసారి తనిఖీకి వచ్చేలోపు సిబ్బంది అంతా క్వార్టర్స్‌లోనే నివాసం ఉండాలని ఆదేశించారు. పోలీసు హెడ్ క్టార్టర్స్కు బదిలీ అయిన ఆత్మకూరు డీఎస్పీ నరసింహారెడ్డిని శాలువా కప్పి అభినందించారు. ఎస్పీ వెంట నందికొట్కూరు సీఐ నరసింహమూర్తి, ఎస్ఐ గోపినాథ్ ఉన్నారు. -
ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం
రాజంపేట: అంతర్జాతీయంగా విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని కర్నూలు రేంజ డీఐజీ మురళీకృష్ణ స్పష్టం చేశారు. రాజంపేట సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో పోలీసు శాఖ తీసుకున్న చర్యల ఫలితంగా స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టిందన్నారు. స్మగ్లింగ్ నిరోధానికి ప్రభుత్వం త్వరలో కఠినతరమైన చట్టాలను తీసుకొస్తుందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదన్నారు. ఎర్రచందనం కేసుల్లో ఉన్న నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పోలీసు, అటవీ శాఖ సమన్వయంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్మగ్లింగ్‌కు సంబంధించి పాతకేసులపై సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆధారాలు లేని కేసులు విషయంలో కొంత ఆలస్యం అవుతోందన్నారు. అటవీ గ్రామాల ప్రజలు ఎర్రచందనం చెట్లు నరకడం, రవాణా చేయడంపై సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసు శాఖకు ప్రజల సహకారం తప్పని సరిగా ఉండాలన్నారు. పోలీసులు కూడా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. కర్నూలు రేంజ్లో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఈయనతో పాటు జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీ పాల్గొన్నారు. అంతకు ముందుగా పోలీసు అధికారులతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టే విధి విధానాలపై సమీక్షించారు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
కళ్యాణదుర్గం రూరల్ : అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్‌బాబు తెలిపారు. కళ్యాణదుర్గం పోలీస్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ‘పోలీస్ ప్రజాబాట’ నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 73 మంది ఎస్పీకి అర్జీలు సమర్పించారు. ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, ఆర్డీఓ మలోల హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పోలీస్ ప్రజాబాట’, విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కర్ణాటక కేంద్రంగా చేసుకుని అసాంఘిక శక్తులు, అంతర్రాష్ర్ట ముఠాలు ‘అనంత’లో అనేక సంఘటనలకు పాల్పడుతున్నాయన్నారు. ఈ ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామన్నారు. త్వరలోనే వీటి ఆట కట్టించి.. జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పుతామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక మాఫియాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెంచామన్నారు. గ్రామ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తామని చెప్పారు. గ్రామానికి ఒక కానిస్టేబుల్‌ను నియమించామని, ఆ గ్రామంలో చోటు చేసుకునే సంఘటనలకు ఆ కానిస్టేబులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం చేస్తే పోలీసు అధికారులపై చర్యలు తప్పవన్నారు. జిల్లాలో 101 సమస్యాత్మక గ్రామాలను గుర్తించామన్నారు. డీఎస్పీ నెలకోసారి, సీఐ 15 రోజులకోసారి, ఎస్ఐ వారానికోసారి గ్రామాలను సందర్శించి అక్కడ చోటు చేసుకుంటున్న సంఘటనలను సభల ద్వారా సమీక్షించాల న్నారు. పది రోజులకొకసారి గ్రామాల్లో పోలీస్ ప్రజాబా ట నిర్వహించాలని ఎస్ఐలకు సూచించారు. భూ వి వాదాలు, అసాంఘిక కార్యాకలాపాలు, ఫ్యాక్షన్, దోపిడీలు, దొంగతనాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ జోక్యాన్ని అరికట్టండి ప్రభుత్వ కార్యకలాపాల్లో రాజకీయ పార్టీ నేతల జోక్యాన్ని అరికట్టాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త తిప్పేస్వామి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు, చౌకడిపో డీలర్లను అక్రమ తొలగింపజేయిస్తూ కక్షలు రేపుతున్నారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారని, కౌంటర్ కేసులూ బనాయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అరాచక శక్తులపై ఉక్కుపాదం
విజయవాడ నూతన సీపీ బాధ్యతల స్వీకరణ మావోల కదలికలపై సరిహద్దుల్లో నిఘా కొత్త డీఐజీ హరికుమార్ సాక్షి, ఏలూరు : అరాచక శక్తులను రూపుమాపేందుకు చర్యలు చేపడతామని ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్ తెలిపారు. సోమవారం డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏలూరు రేంజ్ పరిధిలోని పశ్చిమ, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీల నుంచి మూడు జిల్లాల్లో పరిస్థితులను తెలుసుకుంటానని, అన్ని సమస్యలను పరిష్కరిస్తాని చెప్పారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, బదిలీల విషయాలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. మావోల కదలికలపై సరిహద్దు ప్రాంతాలలో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏలూరు రేంజ్ పరిధిలోకి ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా వచ్చిన ఏడు మండలాల్లో పోలీస్ వ్యవస్థను పటిష్ట పరుస్తామని వివరించారు. పోలీస్ సిబ్బంది ఎటువంటి సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చని, ఆ సమస్యనను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీఐజీ తెలిపారు. డీఐజీని మూడు జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయవాడ సిటీ : విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా సోమవారం మధ్యాహ్నం 1.28 గంటలకు ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రస్తుత సీపీ బి.శ్రీనివాసులు బాధ్యతలు అప్పగించారు. అనంతరం డీసీపీలు తఫ్సీర్ ఇక్బాల్(శాంతిభద్రతలు), జీవీజీ అకోశ్‌కుమార్(పరిపాలన)లతో కలిసి ఏబీ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. పోలీస్ కమిషనరేట్‌కు పెద్ద సేవకుడిగా, కాపలాదారుగా వ్యవహరిస్తానని సీపీ చెప్పారు. విభజనానంతర ప్రత్యేక పరిస్థితుల్లో రెండోసారి తాను నగర కమిషనర్‌గా రావాల్సి వచ్చిందని, ఈ అవకాశాన్ని సవాల్‌గా తీసుకొని పని చేస్తానని తెలిపారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రజలు పూర్తిగా సహకరిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజా రక్షణలో పోలీసు బాధ్యత, పాత్రపై తగిన అవగాహన చేసుకొని పని చేస్తామన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఇక్కడి మీడియా ఎదగి పూర్వవైభవం పొందాలని ఆకాంక్షించారు.