- వేధింపులకు పాల్పడేవారికి జైలుతోపాటు భారీ జరిమానా
- రెండోసారి అయితే నిర్భయ కేసు
- యాంటీ ర్యాగింగ్ చట్టాన్ని బలోపేతం చేస్తూ కొత్త చట్టం
- ముసాయిదాకు కేబినెట్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ఇకపై ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారు కటకటాలు లెక్కించడంతోపాటు భారీ జరిమానా చెల్లించక తప్పదు! ఈ మేరకు శిక్షలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఇప్పటికే ఉన్న యాంటీ ర్యాగింగ్ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈవ్ టీజింగ్ నిరోధ చట్టాన్ని రూపొందిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య నేతృత్వంలోని మహిళా భద్రత కమిటి చేసిన సిఫారసుల ఆధారంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఈ కొత్త చట్టానికి రూపకల్పన చేశారు.
ఈ చట్టం ముసాయిదాను ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదిం చింది. ఈవ్ టీజింగ్‌కు పాల్పడే నిందితులకు జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధించనున్నారు. నేర తీవ్రత బట్టి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం మొదలుకుని ప్రతి ప్రైవేటు సంస్థల్లో ఈవ్ టీజిం గ్‌ను నిరోధించడానికి యాజమాన్యం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలి.
విచారణ జరిపి చర్యలు చేపట్టాలి. లేకుంటే యాజమాన్యాన్ని కూడా శిక్షించవచ్చని ఈ ముసాదాలో పేర్కొన్నారు. టీజింగ్‌కు పాల్పడుతూ రెండోసారి పట్టుబడితే నిర్భయ కేసు పెట్టాలని సూచించారు. టీజింగ్ కారణంగా ఎవరైనా మరణి స్తే నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించే నిబంధనను కూడా చేర్చినట్టు సమాచారం.