మళ్లీ ర్యాగింగ్‌ కలకలం | Harassment On Juniors By Seniors In Medical Colleges In Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

మళ్లీ ర్యాగింగ్‌ కలకలం

Published Sun, Nov 17 2024 4:26 AM | Last Updated on Sun, Nov 17 2024 10:16 AM

Harassment of juniors by seniors in medical colleges

‘పాలమూరు’ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన 

గాంధీతో పాటు ఇతర వైద్య కళాశాలల్లోనూ జూనియర్లకు సీనియర్ల వేధింపులు! 

గత ఏడాది మూడు కాలేజీల్లో వెలుగుచూసిన వికృత చేష్టలు 

ప్రైవేటు కాలేజీల్లో జరుగుతున్నా బయటకు పొక్కనీయని యాజమాన్యాలు 

వైద్యవిద్య యంత్రాంగం పర్యవేక్షణ లోపంపై విమర్శలు 

నామమాత్రంగా మారిన ర్యాగింగ్‌ నిరోధక కమిటీలు 

యూజీసీ నిబంధనలు సైతం బేఖాతరు 

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌ భూతం మళ్లీ పంజా విసురుతోంది. సుప్రీంకోర్టు తీర్పు (2009), 1956 యూజీసీ చట్టం సెక్షన్‌ 36, సబ్‌సెక్షన్‌ (1) ప్రకారం విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ నిషేధం. అయినా ఆకతాయిలైన సీనియర్‌ విద్యార్థులు అక్కడక్కడా శ్రుతి మించి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మెడికల్‌ కాలేజీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. 

గత ఏడాది రాష్ట్రంలోని గాందీ, కాకతీయ, మహబూబాబాద్‌ వైద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ చోటు చేసుకుంది. తాజాగా పాలమూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు గాంధీ మెడికల్‌ కాలేజీలోనూ ర్యాగింగ్‌ జరుగుతోందని, అయితే బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

అలాగే మరికొన్ని ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోనూ ర్యాగింగ్‌ ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. కొత్తగా ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్‌ పేరిట వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, ర్యాగింగ్‌ ఘటనలు ఆగడం లేదనే చర్చ జరుగుతోంది. 

ర్యాగింగ్‌ పేరిట వికృత చేష్టలు 
రాష్ట్రవ్యాప్తంగా గత నెల నుంచి ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. కొత్త విద్యార్థులను రెండు, మూడో ఏడాది చదివే కొందరు ఎంబీబీఎస్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ర్యాగింగ్‌కు పాల్పడితే కాలేజీ నుంచి తొలగించాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సస్పెన్షన్లకే పరిమితం అవుతున్నామని వైద్య విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

గత ఏడాది గాంధీ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ సందర్భంగా కొందరు సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్‌ గదులకు రప్పించి వారితో బలవంతంగా మద్యం, సిగరెట్లు తాగించినట్లు తేలింది. కొందరితో బట్టలు విప్పించి డ్యాన్స్‌లు చేయించారనే ప్రచారం కూడా జరిగింది. వారు బూతులు తిడుతూ, బాధితులతో కూడా బూతులు మాట్లాడించారని తేలింది. కొందరు విద్యార్థినిలను కూడా ర్యాగింగ్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. 

‘పాలమూరు’లో విద్యార్థులతో గోడకుర్చీ వేయించడం లాంటి దారుణ చర్యలకు పాల్పడినట్లు తెలిసింది. ఇలా రాష్ట్రంలోని పలు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో కూడా ర్యాగింగ్‌ సంఘటనలు జరుగుతున్నా అవి బయటకు పొక్కకుండా యాజమాన్యాలు జాగ్రత్త వహిస్తున్నాయని అంటున్నారు. అయితే కళాశాలలపై నిఘా వేసి ర్యాగింగ్‌ను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఈ విషయంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

కొన్ని కాలేజీలు డీఎంఈ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంలేదని తెలిసింది. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు ఉన్నా అవి నామమాత్రంగా మారాయని అంటున్నారు. ర్యాగింగ్‌ ఘటనలపై వైద్యవిద్య డైరెక్టర్‌ (డీఎంఈ) డాక్టర్‌ వాణి వివరణ కోసం ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. 

క్రిమినల్‌ చర్య అన్న యూజీసీ
ర్యాగింగ్‌ను నేరపూరిత (క్రిమినల్‌) చర్యగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ పేర్కొంది. దీనిపై ఫిర్యాదులకు ప్రత్యేకంగా మానిటరింగ్‌ సెల్‌ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ర్యాగింగ్‌ను నిరోధించాలంటూ ఉన్నత విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లకు, వర్సిటీల వీసీలకు స్పష్టమైన ఆదేశాలున్నాయి. 

యూజీసీ నిబంధనలు.. 
» విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్‌ కమిటీని, యాంటీ ర్యాగింగ్‌ స్క్వాడ్‌ను, యాంటీ ర్యాగింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలి. 
»  ర్యాగింగ్‌ శ్రుతిమించి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన పక్షంలో సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్, వర్సిటీ రిజిస్ట్రార్లను విచారణకు పిలుస్తారు. వీరు నేషనల్‌ యాంటీ ర్యాగింగ్‌ మానిటరింగ్‌ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. 
»  విద్యాసంస్థలు, విద్యార్థుల హాస్టళ్లు, కీలక ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలి. 
»  విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించాలి. 
» యాంటీ ర్యాగింగ్‌ మానిటరింగ్‌ కమిటీ ఆదేశాల ప్రకారం జూనియర్లు, సీనియర్ల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు మెంటార్‌íÙప్‌ను ప్రోత్సహించాలి. 
» లీగల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ర్యాగింగ్‌ నిరోధక చట్టాలు, శిక్షలపై అవగాహన కల్పించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement