లే‘ఔట్’..!
♦ జిల్లా పరిధిలో 102 అక్రమ లేఅవుట్లు రద్దు
♦ గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా వెలిసిన వెంచర్లు
♦ అక్రమమని తేలుస్తూ పంచాయతీరాజ్ శాఖకు నివేదిక
♦ వాటిని రద్దు చేస్తూ డీపీఓ ఉత్తర్వులు
అక్రమ లేఅవుట్లపై జిల్లా యంత్రాంగం కొరడా ఝళిపించింది. అనధికారికంగా వెలిసిన వెంచర్లపై ఉక్కుపాదం మోపింది. డెరైక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలోని మండలాల్లో పుట్టుకొచ్చిన 102 అక్రమ లేఅవుట్లను రద్దు చేసింది. ఎలాంటి అనుమతుల్లేకుండా అడ్డగోలుగా వెలిసిన వెంచర్ల చిట్టాను సేకరించిన డీటీసీపీ విభాగం అక్రమార్కుల జాబితాను జిల్లా పంచాయతీరాజ్ శాఖకు పంపింది. ఈ మేరకు డీటీసీపీ నిర్ధారించిన 102 అక్రమ లేఅవుట్లను రద్దు చేస్తున్నట్లు డీపీఓ అరుణ ప్రకటించారు.
కేసులు పెడతాం..
అనధికారికంగా వెలిసిన లేఅవుట్లను కూల్చేస్తాం. 102 ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం. అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్‌లు, కార్యదర్శులు, విస్తరణాధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా అడ్డగోలుగా లేఅవుట్లు చేస్తే ఉపేక్షించేది లేదు. అక్రమమని తేల్చిన లేఅవుట్ల జాబితాను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం. ప్లాట్లు కొనేముందు ఆయా వెంచర్లకు అనుమతి ఉందా? లేదా అనేది ఒకసారి సరిచూసుకుంటే మోసాల బారినపడే అవకాశముండదు. - అరుణ , డీపీఓ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : లేఅవుట్లకు అనుమతి ఇచ్చే ఎలాంటి అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్‌ఎండీఏ పరిధిలో హెచ్‌ఎండీఏకు.. ఆ పరిధి దాటిన మండలాల్లో డీటీసీపీకి మాత్రమే లేఅవుట్లకు అనుమతులు జారీ అధికారం ఉంది. అయితే, ఈవిషయాన్ని గుట్టుగా ఉంచుతున్న రియల్టర్లు పంచాయతీ లేఅవుట్ల పేర కొనుగోలుదారులను ఏమార్చుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. అభివృద్ధి చేయని వెంచర్లలో కారుచౌకగా ప్లాట్లు విక్రయిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. అప్రూవ్డ్ లేఅవుట్లతో పోలిస్తే తక్కువ ధరకు స్థలాలు దొరుకుతుండడంతో అల్పాదాయవర్గాలు ఈ వెంచర్లలో ప్లాట్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నాయి. మధ్యతరగతి ప్రజల బలహీనతలను సొమ్ముచేసుకుంటున్న స్థిరాస్తి సంస్థలు..
మారుమూల ప్రాంతాల్లో సైతం వెంచర్లు చేశాయి. కనీస రోడ్లు, విద్యుత్ స్తంభాలు కూడా వేయకుండా.. నాలుగు రాళ్లు పాతి ప్లాట్లుగా విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. కొ న్ని సంస్థలయితే.. భూ వినియోగ మార్పి డి చేయకుండానే లేఅవుట్లుగా అభివృద్ధి చేసినట్లు డీటీసీపీ అధికారుల పరిశీలనలో తేలి ంది. అంతేకాకుండా కొన్నిచోట్ల భూ యజ మానికి కొంత మొత్తం చెల్లించి అగ్రిమెంట్ కాపీతోనే ప్లాట్లను అమ్మేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే అక్రమ లేఅవుట్లపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వేచేసిన డీటీసీపీ అధికారుల బృందం జిల్లావ్యాప్తంగా దా దాపు 400 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ లేఅవుట్లు (102) వెలిసినట్లు తేల్చి జాబితాను జిల్లా పంచాయతీశాఖాధికారికి అంద జేసింది.