ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం
జూపాడుబంగ్లా: ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపుతామని.. రౌడీషీటర్లు, ఫ్యాక్షనిస్టులు వారి కార్యకలాపాలకు స్వస్తి చెప్పకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. గురువారం మండల జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొన్ని కేసులకు సంబంధించి రికార్డులను సక్రమంగా నమోదు చేయకపోవడంతో దర్యాప్తు సక్రమంగా సాగలేదన్నారు. వీటిని పునఃదర్యాప్తు చేసేందుకు సీఐ, డీఎస్పీలను ఆదేశించామన్నారు. గ్రామాల్లో బెల్టు, నాటుసారా విక్రయాలు సాగుతున్నట్లు తన దృష్టికి వస్తే ఆయా పోలీసుస్టేషన్ల ఎస్‌ఐలను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా వ్యాప్తంగా 2,400 మంది రౌడీషీటర్లను గుర్తించడంతో పాటు.. ఆయా స్టేషన్ల ఎస్‌ఐలకు వారి సమాచారం అందజేసి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. వీరిలో మార్పు తీసుకొచ్చేందుకు వారానికో రోజు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫ్యాక్షన్ కారణంగా కర్నూలు జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ఫ్యాక్షన్ కనుమరుగైన గ్రామాలను కేటగిరీల వారీగా విభజించి అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు.
ఐరన్‌ఓర్, ఇసుక అక్రమ తరలింపులపై మైనింగ్ అధికారులతో కలసి దాడులు చేస్తామన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలతో నగరంలోని చాలా మార్పు వస్తోందన్నారు. రాత్రిళ్లు ఈ కార్యక్రమం వల్ల ప్రమాదాలను నివారించడంతో పాటు పాత నేరస్తుల కార్యకలాపాలు తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. అనంతరం పోలీసు క్వార్టర్స్‌ను పరిశీలించి స్థానికంగా నివాసం ఉండని పోలీసుల వివరాలను తెలుసుకున్నారు.
నివాసం ఉంటున్న చెన్నయ్యకు అవార్డు ప్రకటించి.. స్థానికంగా ఉండని సిబ్బందిని మందలించారు. మరోసారి తనిఖీకి వచ్చేలోపు సిబ్బంది అంతా క్వార్టర్స్‌లోనే నివాసం ఉండాలని ఆదేశించారు. పోలీసు హెడ్ క్టార్టర్స్‌కు బదిలీ అయిన ఆత్మకూరు డీఎస్పీ నరసింహారెడ్డిని శాలువా కప్పి అభినందించారు. ఎస్పీ వెంట నందికొట్కూరు సీఐ నరసింహమూర్తి, ఎస్‌ఐ గోపినాథ్ ఉన్నారు.