ప్రొద్దుటూరు డివిజన్ పోలీసులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఓఎస్డీ లక్ష్మినారాయణ
చాపాడు : గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్‌ను నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా పోలీసు శాఖ ఓఎస్డీ లక్ష్మినారాయణ పేర్కొన్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫ్యాక్ష నిర్మూలనపై ప్రొద్దుటూరు పోలీసుశాఖ సబ్ డివిజన్ పోలీసులకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో కొన్నేళ్లుగా ఉన్న ఆధిపత్య, వర్గపోరులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్షన్ రూపుమాపేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, దాని వలన ఎదురయ్యే సమస్యలు, కష్ట, నష్టాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.
ఫ్యాక్షన్ గొడవల వలన పిల్లల చదువుతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాలు జరగడంతో పాటు కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయన్నారు. ప్రజలు ఎలాంటి గొడవలకు దిగకుండా ప్రశాంత జీవనం గడిపేలా ఉండాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామాల్లో ఎలాంటి గొడవలు, కక్షలు, కార్పణ్యాలు ఉన్నా వాటి అణచి వేసేందుకు పోలీసులు ఉన్నారనే భరోసాను ప్రజల్లో నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని వన్ టౌన్ సీఐ, రూరల్ ఇన్‌చార్జి సీఐ పి.రామలింగయ్య, టూ టౌన్ సీఐ మల్లికార్జునగుప్త, త్రీ టౌన్ సీఐ జయనాయక్, చాపాడు ఎస్‌ఐ నరేంద్రకుమార్, ప్రొద్దుటూరు, చాపాడు, రాజుపాళెం మండలాల ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment