factionism
-
ఫ్యాక్షన్ రాజకీయాల్లో బడుగులే సమిధలు!
సాక్షి, అనంతపురం : పది మంది బతుకు కోరేవాడు నాయకుడు.. తాను నాయకుడిగా ఎదగడం కోసం పది మిందిని సమిధలు చేసే వాడు స్వార్థపరుడు.. మరి ఈ నేతలను ఏమంటారో జనమే చెప్పాలి.. తమ నాయకుడి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారు కొందరు.. ప్రాణాలు కోల్పోయిన వారు మరికొందరు.. మనిషే కనిపించక, ఏమైపోయారో తెలియక కనుమరుగైన వారు ఇంకొందరు.. వీరంతా ఇల్లు, ఇల్లాలు, పిల్లలను వదిలి నేతల బాగు కోసం ప్రాణాలే ధారపోశారు. మంచో.. చెడో, తెలిసో.. తెలియకో వారి వెంట నడిచారు. ఇలాంటి తరుణంలో ఆ నేతలు వారి స్వార్థానికి జైకొట్టి.. ఇన్నాళ్లూ ఎవరితోనైతే ఫ్యాక్షన్ నడిపారో ఇప్పుడు వారితోనే కలిసి రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో గుల్లకుంట(బాంబుల) శివారెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి కుటుంబాల రాజకీయ మనుగడ కోసం ఇరువైపులా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 1990లో ఆది పెద్దనాన్న దేవగుడి శంకర్‌రెడ్డి, బీమగుండం గోపాల్‌రెడ్డి హైదరాబాద్ నుంచి జమ్మలమడుగుకు వస్తుంటే.. షాద్‌నగర్ వద్ద బస్సు నిలిపేసి వారిద్దరినీ చంపారు. ఈ జంట హత్యలతో ఫ్యాక్షన్‌కు బీజం పడింది. ఈ కేసులో ఇప్పటి టీడీపీ జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి రామసుబ్బా రెడ్డి రెండేళ్లు శిక్ష అనుభవించారు. ఈ హత్యకు ప్రతీకారంగా 1993లో శివారెడ్డిని.. ఆది వర్గం చంపింది. ఈ రెండు కుటుంబాల మధ్య నడిచిన ఫ్యాక్షన్‌లో కనీసం 300 మంది బలయ్యారు. రాజకీయంగా రెండు కుటుంబాలు బలపడిన తర్వాత పెద్దముడియం, కొండాపురం, ముద్దనూరు, మైలవరం మండలాల్లో జరిగిన హత్యలు కోకొల్లలు. మైలవరం మండలం కల్లుట్ల గ్రామాన్ని రామసుబ్బారెడ్డి వర్గీయులు పూర్తిగా తగలబెట్టారు. కొండాపురం మండలం కోడిగాండ్లపల్లి కూడా దహనమైంది. ఈ కేసుల్లో వందల మంది జైలు జీవితం గడిపారు. కర్నూలు, అనంతలో ఇదే తీరు.. కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి, గౌరు వెంకటరెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కొనసాగింది. బైరెడ్డి తండ్రి శేషశయనారెడ్డి, గౌరు బంధువు మద్దూరు సుబ్బారెడ్డి హత్యకు గురయ్యారు. తర్వాత ఇరు కుటుంబాల మధ్య రాజకీయానికి కనీసం 30 మంది బలై ఉంటారు. ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం ఇద్దరూ ఏకమై టీడీపీలో చేరారు. కేఈ కృష్ణ్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబాల మధ్య మూడు తరాలుగా పోరు నడుస్తోంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కేఈ మాదన్న కుటుంబాల మధ్య మొదలైన ఆధిపత్య పోరులో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడుతో సహా చాలామంది బలయ్యారు. అనంతపురం జిల్లాలో కలకలం రేపిన పరిటాల రవీంద్ర హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డి పేరు కూడా ఉంది. జేసీ కనుసన్నల్లోనే హత్య జరిగిందని మొన్నటి వరకూ పరిటాల కుటుంబం ఆరోపించింది. ఇపుడు జేసీ టీడీపీతో జట్టు కట్టడంతో పరిటాల శ్రీరాం, జేసీ పవన్‌కుమార్‌రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరిగే పరిస్థితి. కృష్ణా జిల్లాలో కలకం రేపిన ఘటన వంగవీటి రంగా హత్య. దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా కుటుంబాల మధ్య ‘ఫ్యాక్షన్’ తరహాలో ‘రౌడీయిజం’ నడిచింది. ఈ రెండు కుటుంబాల రాజకీయ మనుగడ కోసం ఇక్కడ కూడా అనేక మంది బలయ్యారు. ఇప్పుడు వీరు కూడా గతం మరిచి టీడీపీలో కొనసాగుతున్నారు. కేఈ–కోట్ల, ఆది–రామసుబ్బారెడ్డిని ఒకే వేదికపై తెచ్చిన ఘనత టీడీపీది అని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. నిజానికి వీరంతా నిజంగా శాంతి కోసమో, తమ వర్గీయుల కోసమో రాజీ అయి ఉంటే నిస్వార్థంగా రాజీ కావాలి. కలిసిన ప్రతి కుటుంబం వెనుక స్వార్థ రాజకీయ కాంక్ష ఉంది. కేవలం ఎంపీగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు రాజకీయ సమీకరణల నేపథ్యంలో చేతులు కలిపారు. ఈ కలయికను ఆయా నాయకుల వెంట ఉండి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల వారు చీదరించుకుంటున్నారు. తిరిగి ఇలాంటి వారికి అండగా నిలిస్తే మళ్లీ వారి రాజకీయ ఎదుగుదల కోసం మళ్లీ ఫ్యాక్షన్ భూతాన్ని ఉసిగొల్పుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఈనెల 11న ఏం చేయాలో అది చేస్తామని చెబుతున్నారు. హత్య జరినప్పుడు ఒకరిద్దరు నాయకులపై కేసు కడతారు. తర్వాత కోర్టులో కొట్టేస్తారు. కానీ నాయకుల వెంట తిరిగిన బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై మాత్రం రౌడీషీట్లు తెరిచారు. ఈ పరిస్థితిలో ‘మా కోసం బలైన కుటుంబాల పరిస్థితి ఏంటి? అని నేతలు ఆలోచించలేదు. స్వార్థం కోసం మా త్యాగాలను కాదన్నారు. ఇలాంటి వారి కోసమా.. మేము ఇంతకాలం త్యాగాలు చేసింది?’ అని ఆయా వర్గాల ప్రజలు రగిలిపోతున్నారు. -
ఫ్యాక్షన్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి
చాపాడు : గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్‌ను నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా పోలీసు శాఖ ఓఎస్డీ లక్ష్మినారాయణ పేర్కొన్నారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఆదివారం ఫ్యాక్ష నిర్మూలనపై ప్రొద్దుటూరు పోలీసుశాఖ సబ్ డివిజన్ పోలీసులకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో కొన్నేళ్లుగా ఉన్న ఆధిపత్య, వర్గపోరులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్షన్ రూపుమాపేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, దాని వలన ఎదురయ్యే సమస్యలు, కష్ట, నష్టాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఫ్యాక్షన్ గొడవల వలన పిల్లల చదువుతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాలు జరగడంతో పాటు కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయన్నారు. ప్రజలు ఎలాంటి గొడవలకు దిగకుండా ప్రశాంత జీవనం గడిపేలా ఉండాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామాల్లో ఎలాంటి గొడవలు, కక్షలు, కార్పణ్యాలు ఉన్నా వాటి అణచి వేసేందుకు పోలీసులు ఉన్నారనే భరోసాను ప్రజల్లో నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని వన్ టౌన్ సీఐ, రూరల్ ఇన్చార్జి సీఐ పి.రామలింగయ్య, టూ టౌన్ సీఐ మల్లికార్జునగుప్త, త్రీ టౌన్ సీఐ జయనాయక్, చాపాడు ఎస్ఐ నరేంద్రకుమార్, ప్రొద్దుటూరు, చాపాడు, రాజుపాళెం మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు. -
ధర్మవరంలో భగ్గుమన్న పాత కక్షలు
-
ధర్మవరంలో భగ్గుమన్న ముఠాకక్షలు
సాక్షి, అనంతపురం : జిల్లాలోని ధర్మవరంలో ముఠా కక్షలు భగ్గుమన్నాయి. మండలంలోని తిప్పేపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డిపై ప్రత్యర్ధులు వేటకొడవళ్లతో దాడి చేశారు. గ్రామంలో లక్ష్మినారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఇరవై ఏళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. లక్ష్మినారాయణ రెడ్డిని రామకృష్ణారెడ్డి వర్గం నాలుగేళ్ళ కిందట హత్య చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు గోపాల్ రెడ్డిపై హత్యాయత్నం చేసి పారిపోయారు. రక్తపు మడుగులో పడిన ఉన్న గోపాల్ రెడ్డిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే గత కొంతకాలంగా గోపాల్ రెడ్డి నేర చరిత్రకు దూరంగా ఉంటున్నారు. సమీపంలోని ధ్యాన కేంద్రంలో ప్రవచనాలు చెబుతున్నాడు. అయితే గోపాల్ రెడ్డిపై ఎందుకు దాడి చేశారన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. -
పురివిప్పన పాతకక్షలు
ప్రకాశం, సంతమాగులూరు: సంతమాగులూరులో చిన్న గొడవ జరిగినా అది చివరకు ఎటు దారి తీస్తుందోనని స్థానికులతో పాటు పోలీసులు భయపడుతుంటారు. గతంలో హత్యలు జరిగిన నేపథ్యంలో గ్రామంలో ఇప్పటికి ఎప్పుడు ఏం జరుగుతుందోనని అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉంటారు. సంతమాగులూరులో ఓ ఇంటి స్థలం వివాదం ప్రాణాలపైకి తెచ్చింది. వివరాలు.. సంతమాగులూరులో సర్పంచ్ వర్గానికి వారి బంధువులైన మరో వర్గానికి చిన్న రహదారి వద్ద నవంబర్‌లో పెద్ద ఘర్షణ జరిగింది సర్పంచి వర్గానికి చెందిన ఐదుగురు ఆస్పత్రిపాలయ్యారు. మళ్లీ ప్రశాంతంగా ఉందనుకున్న సంతమాగులూరులో గురువారం ఉదయం సర్పంచ్ వీరనారాయణ తండ్రి వీరయ్య వర్గం దాడిలో మరో వర్గానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీతో పాటు సీఐ హైమారావు, ఎస్ఐ నాగరాజులు సంఘటన స్థలానికి చేరుకుని సమీక్షించారు. తన్నీరు వెంకట్రావు, తిరుపతయ్య, మురళి, పోలాంజీలు పొలం వెళ్లి వస్తుండగా కాపుగాసిన సర్పంచి వర్గానికి చెందిన 12 మంది కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పరారీలో నిందితులు దాడికి ప్రయత్నించిన సర్పంచ్ వర్గం 12 మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడికి దిగిన ప్రతి ఒక్కరిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని సీఐ హైమారావు హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగటంపై గ్రామంలో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు వర్గాలపై రౌడీషీట్ ఓపెన్ చేసి బల్లికురవ మండలం వేమవరం వంటి ఘటన పునరావృతం కాకుండా వారిని ఊరి నుంచి వెళ్లగొడతామని సీఐ పేర్కొంటున్నారు. తిరుపతయ్య కుమారుడు రవీంద్ర ఫిర్యాదు మేరుకు 12 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎసఐ నాగరాజు తెలిపారు. గ్రామంలో ప్రస్తుతం పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
‘దమ్ముంటే కడపకు వచ్చి మాట్లాడు’
విజయవాడ : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై కడప స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వర్మకు కేవలం ఫ్యాక్షన్ హత్యలు తప్ప.. రాయలసీమలోని మహానుభావులు కనిపించరా అని ప్రశ్నించారు. ఎక్కడో ముంబాయికి పారిపోయి అక్కడి నుంచి మాట్లాడటం కాదు.. దమ్ముంటే కడపకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. తాను విజయవాడకు వచ్చి మాట్లాడుతున్నామని సూటిగా చెప్పారు. తన సినిమాల కోసమే అందర్నీ విలన్లుగా చూపిస్తున్నారని విమర్శించారు. గతంలో బెజవాడను రౌడీల కేంద్రంగా వర్మ చూపించారని, ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తే తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. డబ్బుల కోసమే ఎప్పుడో జరిగిన వాటిని చూపిస్తే మళ్లీ కక్షలు పెరిగే ప్రమాదం ఉందని, పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే కడప వెబ్‌సిరీస్‌ను నిలిపి వేయాలని కోరారు. రాయలసీమను ఫ్యాక్షన్ సీమగా చిత్రీకరించడం సరికాదన్నారు. రాంగోపాల్ వర్మ నిజంగానే తెలుగు గడ్డ పైనే పుట్టావా లేదా అనే సందేహం తలెత్తుందన్నారు. ఎదుటి వారి బాధను చూసి రాక్షస ఆనందాన్ని పొందే సైకో లాంటి వ్యక్తి రాంగోపాల్ వర్మ అని అన్నారు. రాయలసీమ చరిత్రను పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని, రాయలసీమ నుంచే రతనాల వంటి నేతలు రాజకీయాలలో రాణించారని.. రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు అయ్యారని వ్యాఖ్యానించారు. -
క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకోవద్దు
బల్లికురవ: క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకోవద్దని గ్రామాల్లో ప్రజలు కక్షలు విడనాడి ప్రశాంతంగా జీవించాలని ఎస్పీ సత్య ఏసుబాబు కోరారు. మే 19న వేమవరం గ్రామంలో జరిగిన జంట హత్యల నేపథ్యంలో ఆయన గురువారం గ్రామాన్ని పరిశీలించారు. దాడులు జరిగిన ప్రాంతాలను, గ్రామ మ్యాప్‌ను పరిశీలించారు. తరువాత దాడితో గాయపడిన గోరంట్ల వెంకటేశ్వర్లు, పేరయ్య, వేగినాటి ముత్యాలరావు, వీరరాఘవుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. దాడిలో మరణించిన గోరంట్ల పెద అంజయ్య, వేగినాటి రామకోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శాంతి భద్రతల విషయంలో పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రాణం విలువ ఎంతో ముఖ్యమైందని, ఘర్షణలతో క్షణికావేశాలకు లోనైతే, ప్రాణాలు పోవడంతోపాటు, కోర్టుల చుట్టూ తిరగడం, జైలు పాలు అవుతారని చెప్పారు. దీనివల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయని హెచ్చరించారు. ఒకప్పుడు పల్లెల్లో ఎంతో ప్రశాతం వాతావరణం ఉండేదన్నారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. గ్రామాల్లో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరారు. దర్శి డీఎస్పీ శ్రీరాంబాబు, అద్దంకి సీఐ హైమారావు, ఎస్సై కట్టా అనూక్ పాల్గొన్నారు. డీటీసీ పరిశీలన ఒంగోలు క్రైం: స్థానిక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ (డీటీసీ–పోలీస్)ని ఎస్పీ బి. సత్య ఏసుబాబు గురువారం పరిశీలించారు. నూతనంగా ఎంపికైన స్టైఫండరీ కానిస్టేబుళ్లకు జూలై నెల 14 నుంచి ఇక్కడ శిక్షణ ఇవ్వనుండటంతో సౌకర్యాల గురించి డీటీసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 250 మంది స్టైఫండరీ కానిస్టేబుళ్లు శిక్షణ పొందనున్నారు. సంబంధిత ఏర్పాట్లపై వైస్ ప్రిన్సిపాల్ వై.శ్రీనివాసరెడ్డితో సమీక్షించారు. నైతిక విలువలతో కూడిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎస్బీ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు తదితర పోలీస్ అధికారులున్నారు. కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ ఒంగోలు టౌన్: కలెక్టర్ వి. వినయ్‌చంద్‌ను స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కలెక్టర్‌తో భేటీ అయ్యి జిల్లాలో శాంతిభద్రతల గురించి చర్చించారు. -
రాజకీయ కిడ్నాప్
కొత్త సంస్కృతి... పోరుమామిళ్ల ప్రాంతానికి పూర్తిగా తెలియనిది. ఫ్యాక్షన్ సంస్కృతిలో అది ఓ భాగం. మూడు కార్లల్లో వచ్చిన వారు ఓ యువకుడిని అడ్డగించి, దాడి చేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని పోవడం పట్టణంలో సంచలనమైంది. ఇలాంటి ఘటనలు ఫ్యాక్షన్ ఉన్న జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల్లో జరగడం తెలిసిందే. అలాంటి సంస్కృతి పోరుమామిళ్లకు పాకడం స్థానికంగా అందరినీ నివ్వెరపరచింది. ► పోరుమామిళ్లలో కలకలం ► ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్ ► 24 గంటల్లో తేల్చకపోతే ఆమరణదీక్ష చేస్తా ► పోలీసులకు ఎంపీ అవినాష్‌రెడ్డి హెచ్చరిక పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పట్టణంలోని గాజుల్లా టీ బంక్ దగ్గర స్థానిక ఎంపీటీసీ సభ్యుడు డాక్టర్ గౌస్‌పీర్ కుమారుడు ముర్తుజాహుస్సేన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో కిడ్నాప్ చేశారు. సినిమాకు వెళుతుండగా అడ్డగించి, కొట్టి కారులో ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పోరుమామిళ్లలో కలకలం సృష్టించింది. విషయం తెలిసిన ఎంపీ అవినాష్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు సోమవారం ఉదయం పోరుమామిళ్లకు చేరుకున్నారు. ముందుగా పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలతో మాట్లాడారు. ఎంపీ, మేయర్ వస్తున్నారని తెలిసి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అందరూ ర్యాలీగా పోలీస్‌స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ సీఐ పద్మనాథన్, ఎస్సై పెద్ద ఓబన్నలతో మాట్లాడారు. పోరుమామిళ్ల నుంచి కార్లు మైదుకూరు రూట్లో వెళుతున్నట్లు సీసీ పుటేజ్‌లో స్పష్టంగా తెలుస్తున్నా అమగంపల్లె, మల్లెపల్లె, వనిపెంట చెక్‌పోస్టుల వద్ద ఎందుకు పట్టుకోలేకపోయారని ఎంపీ నిలదీశారు. కిడ్నాప్‌నకు వచ్చిన వారిలో ఒకరి సెల్ కిందపడితే మీకు అందజేసినా ఎందుకు ఆచూకీ తెలుసుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆ సెల్ ఎవరిది? ఆ కార్లు ఎవరివి? యువకుడ్ని ఎక్కడకు తీసుకెళ్లారు? అంటూ ప్రశ్నించారు. సీఐ, ఎస్సై స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. తాము రాత్రి నుంచి గాలిస్తున్నామని, ఆచూకీ తెలియడం లేదన్నారు. స్థానికులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి ఉంటే ఆచూకీ తెలిసి ఉండేదని, మీ విధులను సమర్థవంతంగా నిర్వహించక పోవడం వల్లనే ఇంతవరకు ఆచూకీ తెలియలేదని మండిపడ్డారు. 24 గంటల్లో ఎంపీటీసీ డాక్టర్ గౌస్‌పీర్ కుమారుడు ముర్తుజాహుసేన్ ఆచూకీ కనుగొని అతడిని వారి కుటుంబానికి అప్పజెప్పకపోతే రేపు ఉదయం ఇక్కడే పోలీస్‌స్టేషన్ దగ్గర ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పోలీసులను హెచ్చరించారు. ఎన్నడూలేని రాజకీయ కిడ్నాప్: ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇలా రాజకీయ కిడ్నాప్‌లు ఎన్నడూ జరగలేదని, దీనికి స్థానికంగా కొంతమంది సహకరించి ఉంటారన్నారు. జమ్మలమడుగు, పులివెందుల నాయకుల హస్తం లేనిదే ఇలాంటి దారుణం జరగదని పేర్కొన్నారు. పక్కాప్లాన్‌తోనే రాత్రి మూడు కార్లల్లో వచ్చి డాక్టర్ గౌస్‌పీర్ కుమారుడ్ని ఎత్తుకెళ్లారని, ఇంతవరకు ఆచూకీ తెలుసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. ఈ వ్యవహారంలో స్థానిక తెలుగుదేశం నేతల సహకారం ఉన్నట్లు స్పష్టమవుతుందని తెలిపారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన డాక్టర్ గౌస్‌పీర్ భార్య అప్సరున్నీసా, కోడలు రేష్మాలు ముర్తుజాహుస్సేన్‌ను కాపాడాలని విలపించారు. ఎంపీ, మేయర్ వారిని ఓదార్చారు. -
'ఆయనే ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారు'
రాజకీయంగా తమను ఎదుర్కోలేకే చంద్రబాబు ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ప్రసాదరెడ్డి హత్యను రాజకీయ హత్య కాదంటూ డీఐజీ, ఎస్పీ ప్రకటించడం దారుణమని ఆయన చెప్పారు. పోలీసుల అండదండలతోనే టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని అనంత ఆరోపించారు. అనంతపురం జిల్లాలో సాగుతున్న హత్యాకాండపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న హత్యాకాండపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం
జూపాడుబంగ్లా: ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపుతామని.. రౌడీషీటర్లు, ఫ్యాక్షనిస్టులు వారి కార్యకలాపాలకు స్వస్తి చెప్పకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. గురువారం మండల జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొన్ని కేసులకు సంబంధించి రికార్డులను సక్రమంగా నమోదు చేయకపోవడంతో దర్యాప్తు సక్రమంగా సాగలేదన్నారు. వీటిని పునఃదర్యాప్తు చేసేందుకు సీఐ, డీఎస్పీలను ఆదేశించామన్నారు. గ్రామాల్లో బెల్టు, నాటుసారా విక్రయాలు సాగుతున్నట్లు తన దృష్టికి వస్తే ఆయా పోలీసుస్టేషన్ల ఎస్ఐలను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,400 మంది రౌడీషీటర్లను గుర్తించడంతో పాటు.. ఆయా స్టేషన్ల ఎస్ఐలకు వారి సమాచారం అందజేసి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. వీరిలో మార్పు తీసుకొచ్చేందుకు వారానికో రోజు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫ్యాక్షన్ కారణంగా కర్నూలు జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ఫ్యాక్షన్ కనుమరుగైన గ్రామాలను కేటగిరీల వారీగా విభజించి అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. ఐరన్‌ఓర్, ఇసుక అక్రమ తరలింపులపై మైనింగ్ అధికారులతో కలసి దాడులు చేస్తామన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలతో నగరంలోని చాలా మార్పు వస్తోందన్నారు. రాత్రిళ్లు ఈ కార్యక్రమం వల్ల ప్రమాదాలను నివారించడంతో పాటు పాత నేరస్తుల కార్యకలాపాలు తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. అనంతరం పోలీసు క్వార్టర్స్‌ను పరిశీలించి స్థానికంగా నివాసం ఉండని పోలీసుల వివరాలను తెలుసుకున్నారు. నివాసం ఉంటున్న చెన్నయ్యకు అవార్డు ప్రకటించి.. స్థానికంగా ఉండని సిబ్బందిని మందలించారు. మరోసారి తనిఖీకి వచ్చేలోపు సిబ్బంది అంతా క్వార్టర్స్‌లోనే నివాసం ఉండాలని ఆదేశించారు. పోలీసు హెడ్ క్టార్టర్స్కు బదిలీ అయిన ఆత్మకూరు డీఎస్పీ నరసింహారెడ్డిని శాలువా కప్పి అభినందించారు. ఎస్పీ వెంట నందికొట్కూరు సీఐ నరసింహమూర్తి, ఎస్ఐ గోపినాథ్ ఉన్నారు.