ఫ్యాక‌్షన్‌ రాజకీయాల్లో బడుగులే సమిధలు!  | Faction With Someone To Come Up With Politics In Rayalaseema | Sakshi
Sakshi News home page

ఫ్యాక‌్షన్‌ రాజకీయాల్లో బడుగులే సమిధలు! 

Published Tue, Apr 9 2019 10:31 AM | Last Updated on Tue, Apr 9 2019 11:50 AM

Faction  With Someone To Come Up With Politics In Rayalaseema - Sakshi

సాక్షి, అనంతపురం : పది మంది బతుకు కోరేవాడు నాయకుడు.. తాను నాయకుడిగా ఎదగడం కోసం పది మిందిని సమిధలు చేసే  వాడు స్వార్థపరుడు.. మరి ఈ నేతలను ఏమంటారో జనమే చెప్పాలి.. తమ నాయకుడి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారు కొందరు.. ప్రాణాలు కోల్పోయిన వారు మరికొందరు.. మనిషే కనిపించక, ఏమైపోయారో తెలియక కనుమరుగైన వారు ఇంకొందరు.. వీరంతా ఇల్లు, ఇల్లాలు, పిల్లలను వదిలి నేతల బాగు కోసం ప్రాణాలే ధారపోశారు. మంచో.. చెడో, తెలిసో.. తెలియకో వారి వెంట నడిచారు. ఇలాంటి తరుణంలో ఆ నేతలు వారి స్వార్థానికి జైకొట్టి.. ఇన్నాళ్లూ ఎవరితోనైతే ఫ్యాక్షన్‌ నడిపారో ఇప్పుడు వారితోనే కలిసి రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు.   

వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో గుల్లకుంట(బాంబుల) శివారెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి కుటుంబాల రాజకీయ మనుగడ కోసం ఇరువైపులా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 1990లో ఆది పెద్దనాన్న దేవగుడి శంకర్‌రెడ్డి, బీమగుండం గోపాల్రెడ్డి హైదరాబాద్‌ నుంచి జమ్మలమడుగుకు వస్తుంటే.. షాద్‌నగర్‌ వద్ద బస్సు నిలిపేసి వారిద్దరినీ చంపారు. ఈ జంట హత్యలతో ఫ్యాక్షన్‌కు బీజం పడింది.

ఈ కేసులో ఇప్పటి టీడీపీ జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి రామసుబ్బా రెడ్డి రెండేళ్లు శిక్ష అనుభవించారు. ఈ హత్యకు ప్రతీకారంగా 1993లో శివారెడ్డిని.. ఆది వర్గం చంపింది. ఈ రెండు కుటుంబాల మధ్య నడిచిన ఫ్యాక్షన్‌లో కనీసం 300 మంది బలయ్యారు. రాజకీయంగా రెండు కుటుంబాలు బలపడిన తర్వాత పెద్దముడియం, కొండాపురం, ముద్దనూరు, మైలవరం మండలాల్లో జరిగిన హత్యలు కోకొల్లలు. మైలవరం మండలం కల్లుట్ల గ్రామాన్ని రామసుబ్బారెడ్డి వర్గీయులు పూర్తిగా తగలబెట్టారు. కొండాపురం మండలం కోడిగాండ్లపల్లి కూడా దహనమైంది. ఈ కేసుల్లో వందల మంది జైలు జీవితం గడిపారు.   

కర్నూలు, అనంతలో ఇదే తీరు.. 
కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి, గౌరు వెంకటరెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్‌ కొనసాగింది. బైరెడ్డి తండ్రి శేషశయనారెడ్డి, గౌరు బంధువు మద్దూరు సుబ్బారెడ్డి హత్యకు గురయ్యారు. తర్వాత ఇరు కుటుంబాల మధ్య రాజకీయానికి కనీసం 30 మంది బలై ఉంటారు. ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం ఇద్దరూ ఏకమై టీడీపీలో చేరారు.

కేఈ కృష్ణ్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబాల మధ్య మూడు తరాలుగా పోరు నడుస్తోంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కేఈ మాదన్న కుటుంబాల మధ్య మొదలైన ఆధిపత్య పోరులో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడుతో సహా చాలామంది బలయ్యారు.

అనంతపురం జిల్లాలో కలకలం రేపిన పరిటాల రవీంద్ర హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డి పేరు కూడా ఉంది. జేసీ కనుసన్నల్లోనే హత్య జరిగిందని మొన్నటి వరకూ పరిటాల కుటుంబం ఆరోపించింది. ఇపుడు జేసీ టీడీపీతో జట్టు కట్టడంతో పరిటాల శ్రీరాం, జేసీ పవన్‌కుమార్‌రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరిగే పరిస్థితి. కృష్ణా జిల్లాలో కలకం రేపిన ఘటన వంగవీటి రంగా హత్య. దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా కుటుంబాల మధ్య ‘ఫ్యాక్షన్‌’ తరహాలో ‘రౌడీయిజం’ నడిచింది. ఈ రెండు కుటుంబాల రాజకీయ మనుగడ కోసం ఇక్కడ కూడా అనేక మంది బలయ్యారు. ఇప్పుడు వీరు కూడా గతం మరిచి టీడీపీలో కొనసాగుతున్నారు.

కేఈ–కోట్ల, ఆది–రామసుబ్బారెడ్డిని ఒకే వేదికపై తెచ్చిన ఘనత టీడీపీది అని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. నిజానికి వీరంతా నిజంగా శాంతి కోసమో, తమ వర్గీయుల కోసమో రాజీ అయి ఉంటే నిస్వార్థంగా రాజీ కావాలి. కలిసిన ప్రతి కుటుంబం వెనుక స్వార్థ రాజకీయ కాంక్ష ఉంది. కేవలం ఎంపీగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు రాజకీయ సమీకరణల నేపథ్యంలో చేతులు కలిపారు.

ఈ కలయికను ఆయా నాయకుల వెంట ఉండి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల వారు చీదరించుకుంటున్నారు. తిరిగి ఇలాంటి వారికి అండగా నిలిస్తే మళ్లీ వారి రాజకీయ ఎదుగుదల కోసం మళ్లీ ఫ్యాక్షన్‌ భూతాన్ని ఉసిగొల్పుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఈనెల 11న ఏం చేయాలో అది చేస్తామని చెబుతున్నారు.

హత్య జరినప్పుడు ఒకరిద్దరు నాయకులపై కేసు కడతారు. తర్వాత కోర్టులో కొట్టేస్తారు. కానీ నాయకుల వెంట తిరిగిన బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై మాత్రం రౌడీషీట్లు తెరిచారు. ఈ పరిస్థితిలో ‘మా కోసం బలైన కుటుంబాల పరిస్థితి ఏంటి? అని నేతలు ఆలోచించలేదు. స్వార్థం కోసం మా త్యాగాలను కాదన్నారు. ఇలాంటి వారి కోసమా.. మేము ఇంతకాలం త్యాగాలు చేసింది?’ అని ఆయా వర్గాల ప్రజలు రగిలిపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement