
సాక్షి, అమరావతి : అనంతపురం పార్లమెంటు పరిధిలోని సిట్టింగు ఎమ్మెల్యేలను మార్చకుంటే అనంతపురం లోక్‌సభ స్థానంలో తమకు ఓటమి తప్పదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. పార్టీ స్క్రీనింగ్ కమిటీతో జేసీ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనంత పార్లమెంటులో కనీసం ముగ్గురు సిట్టింగు ఎమ్మెల్యేలను మార్చాలని ఆయన పట్టుబట్టినట్లు సమాచారం. తాను సూచించిన అభ్యర్థులకు గనుక అసెంబ్లీ సీట్లు ఇవ్వకుంటే పోటీకి దూరంగా ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. శింగనమల, కళ్యాణ దుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చకుంటే పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని ఆయన పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
జేసీ చిందులు.. శమంతకమణి కన్నీళ్లు
ఏబీసీ అంటూ ఏదో చెబుతున్నారు..
టీడీపీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుల తీరును జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో భేటీ అనంతరం ఆయన సీరియస్‌గా బయటకు వెళ్లిపోయారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చమని కమిటీకి సూచించాను. నేను చెప్పిన విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తుందో లేదో తెలీదు. కొన్ని సీట్ల విషయంలో ఏబీసీ అంటూ స్క్రీనింగ్ కమిటీ ఏదేదో చెబుతోంది. సిట్టింగులను మార్చినా గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి ఉంది. వారినే బరిలో దించితే మాత్రం ఓటమి తప్పదు. ఓడేందుకు నేను సిద్ధంగా లేను. పార్టీ మారను గానీ పోటీ చేయాలో లేదో ఆలోచిస్తా అని జేసీ పేర్కొన్నారు. కాగా శింగనమల(ఎస్సీ రిజర్వ్‌డ్) టిక్కెట్‌ను మళ్లీ తనకే ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీ బాల కోరుతుండగా.. ఈ సీటును ఈసారి తాను సూచించిన శ్రావణికి ఇవ్వాలని జేసీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment