
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. ఎమ్మెల్యేపై దాడికి దిగి.. బీభత్సం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై రాళ్లదాడికి పాల్పడి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై గతకొంత కాలంగా జేసీ వర్గీయులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసి.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి వివరణ ఇచ్చినా తీరు మార్చుకోలేదు. అదేపనిగా దుష్ప్రచారం చేస్తూ ఎమ్మెల్యేను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు.
దీనిపై వివరణ కోరేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం నేరుగా జేసీ దివాకర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సమయంలో జేసీ సోదరులు ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో తిరిగి ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న జేసీ వర్గీయులు ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా ఘటనతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment