సాక్షి, తాడిపత్రి అర్బన్/అనంతపురం క్రైం: ప్రశాంతంగా ఉంటున్న అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గురువారం ఒక్కసారిగా అట్టుడికింది. టీడీపీకి చెందిన జేసీ సోదరుల వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఉద్దేశపూర్వకంగా కవ్వింపు చర్యలకు పాల్పడి దాడికి దిగి బీభత్సం సృష్టించారు. అంతేకాక.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన ఈ ఘటన పూర్వాపరాలు.. స్థానికులు తెలిపిన వివరాలు ఇవీ.. కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పార్టీలు, వర్గాలకు అతీతంగా ఎమ్మెల్యే సేవలు అందిస్తుండటాన్ని జేసీ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది.
జేసీ ఇంటి పైనుంచి పోలీసులపై రాళ్ల వర్షం కురిపిస్తున్న జేసీ అనుచరులు
ఎలాగైనా ఎమ్మెల్యేను రెచ్చగొట్టి ప్రజలలో భయాందోళనలు సృష్టించాలని భావించారు. ఇందులో భాగంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ వర్గీయులు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. వీటికి స్పందించకుండా తన పని తాను చూసుకుంటున్న ఎమ్మెల్యేను రెచ్చగొట్టడానికి ఆయన కుటుంబీకులపై కుట్రపూరిత పోస్టింగ్‌లను, అసత్య ఆరోపణలతో సోషల్ మీడియాలో హోరెత్తించారు. పెద్దారెడ్డి కుటుంబీకులు ఇసుక బండ్ల నిర్వాహకుల నుంచి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. రాజకీయం చేయమంటే ఇంట్లో మహిళలపై దుష్ప్రచారం చేయడమేమిటని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అసహనానికి లోనయ్యారు. ఆ పోస్టింగులను ఖండించడంతో పాటు, ఆ విషయం మాట్లాడేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి గురువారం జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే, అక్కడ జేసీ సోదరులెవరూ లేకపోవడంతో తిరిగి తన ఇంటికి వచ్చేశారు.
రెచ్చగొట్టే ధోరణి జేసీ సోదరులదే : ఎమ్మెల్యే కేతిరెడ్డి
ప్రజలను, గ్రామాల్లోని నాయకులను రెచ్చగొట్టి, గొడవలను సృష్టించి పబ్బం గడుపుకునే నీచ చరిత్ర జేసీ సోదరులదేనని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. తాడిపత్రిలోని తన నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జేసీ సోదరులు ఓటమిని జీర్ణించుకోలేక తమపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు ఎక్కడి నుంచో మనుషులను పిలిపించి వారికి జీతభత్యాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. వారి పోస్టింగులు మితిమీరిపోతుండటంతో.. వారితో చర్చించి వారి ఇబ్బంది తెలుసుకోవడం కోసమే గురువారం తాను జేసీ సోదరుల ఇంటికి వెళ్లానన్నారు. ఆ సమయంలో వారెవరూ ఇంట్లో లేకపోవడంతో తిరిగి వచ్చేశానన్నారు. మాట్లాడటానికి వెళ్తే దాడిచేయడానికి వచ్చానని తిరిగి మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా జేసీ సోదరులు దుష్ప్రచారాలు మానుకోవాలని కేతిరెడ్డి హితవు పలికారు.
టీడీపీ కార్యకర్తలతో కలసి దాడిచేయడానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి
పథకం ప్రకారం రెచ్చగొట్టి..
అనంతరం గంట తర్వాత ఇంటికి వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, తనయుడు అస్మిత్‌రెడ్డి.. పెద్దారెడ్డి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పెద్దారెడ్డి అనుచరులు ఎదురెళ్లేందుకు యత్నించగా.. తండ్రీకొడుకులు ఇద్దరూ దగ్గరుండి పోలీసులను సైతం లెక్కచేయకుండా వారిపై రాళ్లు రువ్వించారు. ఈ ఘటనలో పెద్దారెడ్డి అనుచరులు పలువురు గాయపడగా.. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. అలాగే, అంతకుముందు... పథకం ప్రకారం జేసీ ప్రభాకర్‌రెడ్డి గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలను పిలిపించి ఈ హంగామా సృష్టించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తాడిపత్రిలో 144 సెక్షన్ : ఎస్పీ
శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా తాడిపత్రిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ బి. సత్యయేసు బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమికూడరాదన్నారు. తాడిపత్రిలో ఇప్పటికే ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అనవసరంగా తాడిపత్రికి వచ్చి గ్రూపుల్లో చేరడం చేయరాదన్నారు. తాడిపత్రి పట్టణం, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా నిఘా ఉంచామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment