
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో డబ్బు పంపిణీ, ఎన్నికల ఖర్చుపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ రంగం సిద్ధంచేసినట్లు సమాచారం. ఎన్నికల్లో గెలవడానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేశామని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ ఇతర పార్టీలు ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈసీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా తాడిపత్రి రిటర్నింగ్ అధికారి.. జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని నిర్ధారించారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఆయన పూర్తిస్థాయి నివేదిక అందజేశారు. దీంతో జేసీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. కాగా, జేసీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జేసీ అస్మిత్‌రెడ్డి, పవన్‌రెడ్డిలు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుచేశారని ఆయన వ్యాఖ్యానించడం పెను దుమారమే రేపింది. కాగా, నివేదిక కలెక్టర్‌కు చేరిన నేపథ్యంలో జేసీ వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ విషయమై కలెక్టర్ వివరణ కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.