ఐకేపీ యానిమేటర్లపై ఉక్కుపాదం
సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: దాదాపు ఏడాదిన్నరగా తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన జీతం బకాయిలు చెల్లించాలంటూ డ్వాక్రా యానిమేటర్లు (ఐకేపీ వీవోఏలు) సోమవారం తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆదివారం రాత్రి పోలీసులు తమ ప్రతాపం చూపించారు. వేతన బకాయిలు చెల్లించమని నెలల తరబడి ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం తీరుకు నిరసనగా సుమారు 20 వేలమంది వీవోఏలు అసెంబ్లీని ముట్టడించాలని నిర్ణయించారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు తీవ్రంగా స్పందించారు.
రాష్ట్రంలో అన్ని బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్ల వద్ద మోహరించి యానిమేటర్లు హైదరాబాద్ వెళ్లకుండా చేసేందుకు భయానక వాతవరణం సృష్టించారు. యానిమేటర్లకు నాయకత్వం వహించే మహిళలు, సీఐటీయూ నాయకులను రాత్రి ఇళ్ల వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మహిళలను నిర్బంధించిన పోలీసులు సీఐటీయూ నాయకులను అరెస్టు చేశారు. విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
కర్నూలు, అనంతపురం జిలాల్లో బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మోహరించిన పోలీసు లు పలువురిని హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకున్నారు.వైఎస్సార్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేస్తామని హెచ్చరించినా ఆందోళనకారులు హైదరాబాద్ బయలుదేరారు. నెల్లూరు జిల్లాలో కూడా అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లాలోనూ అరెస్టులు కొనసాగాయి. ఐకేపీ యానిమేటర్ల ఆందోళనకు పది వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.