10 నెలలు.. 1,142 ఎన్‌కౌంటర్లు | 1142 Encounter In 10 Months Yogi Adityanath | Sakshi
Sakshi News home page

10 నెలలు.. 1,142 ఎన్‌కౌంటర్లు

Published Tue, Feb 6 2018 1:53 AM | Last Updated on Mon, Aug 27 2018 3:32 PM

1142 Encounter In 10 Months Yogi Adityanath - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేరస్తులపై యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గత మార్చిలో యోగి సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 2018, జనవరి 31 వరకూ యూపీలో 1,142 ఎన్‌కౌంటర్లు జరిగినట్లు పోలీసులు ఓ నివేదిక విడుదల చేశారు. ఈ కాల్పుల్లో 34 మంది నేరస్తులు ప్రాణాలు కోల్పోగా, 265 మంది గాయపడ్డారు. గత 10 నెలల్లో 2,744 మంది హిస్టరీ షీటర్ల(నేర చరిత్ర ఉన్నవారు)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ ఆపరేషన్లలో నలుగురు పోలీస్‌ సిబ్బంది చనిపోగా, 247 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో నేరస్తులను ఏరివేయడానికి పోలీసులకు సీఎం యోగి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ‘ఆపరేషన్‌ క్లీన్‌’ పేరిట పరారీలో ఉన్న నేరస్తుల కోసం వేట మొదలైందన్నారు. ‘లొంగిపోండి లేదా రాష్ట్రం విడిచివెళ్లిపోండి’ అని నేరస్తులకు ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. మీరట్‌ జోన్‌లో పోలీసులు అత్యధికంగా 449 ఎన్‌కౌంటర్లు చేయగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆగ్రా(210), బరేలీ(196), కాన్పూర్‌(91) జోన్లు నిలిచాయన్నారు.

సీఎం యోగి నియోజకవర్గమైన గోరఖ్‌పూర్‌ జోన్‌లో(31) అతితక్కువ ఎన్‌కౌంటర్లు జరిగినట్లు వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్రంలో నేరాలను అరికట్టడానికి 167 మంది క్రిమినల్స్‌పై జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేయడంతో పాటు రూ.150 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌ ముసుగులో సామాన్య పౌరుల్ని పోలీసులు కాల్చిచంపడంపై యూపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

నోయిడాలోని ఓ జిమ్‌ యాజమానితో పాటు మరో వ్యక్తిని పోలీసులు కాల్చిచంపడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) యూపీ ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు సైతం జారీచేసింది. ఈ ఎన్‌కౌంటర్లపై సరైన ప్రభుత్వ పర్యవేక్షణ లేకుంటే 1991 నాటి పిలిభిత్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ లాంటి ఘటనలు పునరావృతమవుతాయని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

1991లో ప్రైవేటు బస్సులో ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తున్న 10 మంది సిక్కుల్ని యూపీ పోలీసులు నకిలీ ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు. వీరిందరూ పాకిస్తాన్‌ ప్రోద్బలం ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులని బుకాయించారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక సీబీఐ కోర్టు 2016లో 47 మంది పోలీస్‌ అధికారుల్ని దోషులుగా తేల్చింది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌధరీ మాట్లాడు తూ.. ‘ప్రభుత్వం నేరాలను తగ్గించడంలో విఫలమై ఎన్‌కౌంటర్ల ముసుగులో తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటోంది’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement