‘గిరి’గీసుకున్నారా..
- సమైక్య ఘోష పట్టని గిరిజన మంత్రులు
- ఒకరిది వి‘భజన’వాదం
- మరొకరిది మౌనవేదం
ఇద్దరూ...ఇద్దరే...! ఒకరిది విభజనవాదం...మరొకరిది పలాయనవాదం. విభజనపై రాష్ట్రం మండుతుంటే....ఒకరు పార్టీ జపం చేస్తున్నారు...మరొకరు మౌనంగా చోద్యం చూస్తున్నారు. జిల్లాలో ‘హస్త’రేఖలు గల్లంతవుతుంటే ఈ ఇద్దరు మాత్రం ‘గిరి’గీసుకు కూర్చుకున్నారు. జనం ఘోష వినబోమంటూ ఒట్టు పెట్టుకున్నారు... సమైక్యవాదుల ఆగ్రహానికి కేంద్రబిందువులవుతున్నారు.
రాష్ట్ర విభజన తరువాత కూడా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైఖరిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఓటేసి గెలిపించిన నియోజక వర్గ ప్రజల కంటే రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన కాంగ్రెస్ అధిష్టానమే ముఖ్యమన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అడ్డగోలు విభజన పట్ల జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమౌతుండగా బాలరాజు మాత్రం కనీస విచారం కూడా వ్యక్తం చేయకుండా పార్టీ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని ప్రకటిస్తూ సమైక్యవాదుల ఆగ్రహానికి గురౌతున్నారు.
బాలరాజు వైఖరిని నిరసిస్తూ అరకుతో పాటు పలుచోట్ల సమైక్యవాదులు బుధవారం నాడు ఆయన దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలను దహనం చేశారు. జిల్లాకు చెందిన కేంద్రమంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు లోక్ సభలో విభజన బిల్లు ఆమోదం పొందిన వెంటనే మంగళవారం నాడే రాజీనామాలు సమర్పించగా బాలరాజు ఆ దిశగా ఆలోచనే చేయలేదు.
బుధవా రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో బాలరాజు మాజీ అయిపోయారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండగా విశాఖ మన్యం అభివృద్ధి, నియోజక వర్గ ప్రగతి గురించి ఏనాడూ పట్టించుకొన్న పాపానే పోలేదనే విమర్శలనెదుర్కొన్న బాలరాజు రెండు రోజుల క్రితం మాత్రం హడావుడిగా కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేయడం వివాదాస్పదమైంది. శంకుస్థాపనలు చేసిన పలు పథకాలకు నిధులు మంజూరు కాలేదని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.
మౌనం వహించిన కిశోర్
అరకు లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ విభజన వ్యవహారంలో మౌనంగా ఉండడం గిరిజనుల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. మిగిలిన కేంద్ర మంత్రులు కనీసం లోక్‌సభలో విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసన తెలుపగా కిశోర్ అటువంటి ప్రయత్నమే చేయలేదు. విభజన బిల్లు ఆమోదం తరువాత ఎక్కడా కనీసం నోరు కూడా విప్పలేదు. మౌనమే శ్రీరామరక్షగా మిన్నకున్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ తమకు ప్రాతినిధ్యం వహిస్తూ కూడా తమ గోడు పట్టించుకోని వీరి పట్ల మండిపడుతున్న గిరిజనులు బుధవారం అరకులో బాలరాజు, కిశోర్ ఫ్లెక్సీలను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.