- కుప్పంకు నీళ్లు తీసుకెళ్లేందుకే..
- మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపణ
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో హెచ్చెల్సీ ఆయకట్టును బీడు పెట్టడానికి వెనుక భారీ కుట్ర ఉందని మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలను అన్ని విధాలుగా అణగదొక్కేందుకు సీఎం చంద్రబాబు స్థాయిలో కుట్ర చేశారన్నారు. హంద్రీనీవా, హెచ్చెల్సీ కలిపి 30 టీఎంసీలొచ్చినా ఆయకట్టుకు నీళ్లు వదలలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. కేవలం కుప్పంకు నీటిని తీసుకుపోవడానికే ఇదంతా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే కృష్ణా డెల్టా కింద రెండో పంటకు నీరివ్వాలని భావిస్తున్నారన్నారు. రెండేళ్లుగా జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. చెరువులకు నీళ్లిస్తున్నామని చెబుతున్నారని, శింగనమల నియోజకవర్గంలో ఏ చెరువులు నింపారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధికారప్రతినిధి రమణ, డీసీసీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ పాల్గొన్నారు.