
తిరువూరు ఆర్టీసీ డిపో ఎత్తివేత!
- కార్మికుల్లో ఆందోళన
- శాటిలైట్ డిపోగా నిర్వహించేందుకు యత్నం
- తమకు తెలియదంటున్న డిపో అధికారులు
తిరువూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 30 ఆర్టీసీ డిపోలను ఎత్తివేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని తిరువూరు డిపోను మూసివేయనున్నారని తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన కార్మికవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 1965లో ఏడు బస్సులతో ఫ్యాక్టరీ సెంటర్లో తిరువూరు డిపోను ప్రారంభించారు. 1969లో రాజుపేట ఊరచెరువులో గ్యారేజీ నిర్మించి 69 బస్సులతో డిపోను నిర్వహించారు. 1985లో బస్‌స్టేషన్ ను అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రారంభిం చారు.
ఈ డిపో కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని 10 మండలాల ప్రయాణికులకు సేవలందిస్తూ స్వర్ణోత్సవాలకు చేరువవుతోంది. రోజుకు 10 వేల మందికి పైగా ప్రయాణికులు తిరువూరు డిపో బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. జిల్లాలో మారుమూల ఉన్న తిరువూరులో ఆర్టీసీ డిపో అందిస్తున్న సేవలను విద్యార్థులు, గ్రామీణ ప్రజలు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం తిరువూరు డిపోలో 380 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీర్ఘ కాలంగా ఉన్న ఈ డిపోను వేరొకచోటికి తరలిస్తే ప్రయాణికులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
మైలవరానికి తరలింపు
తిరువూరు, ఇబ్రహీంపట్నం డిపోలను విలీనం చేసి మైలవరంలో కొత్త డిపో ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తిరువూరు డిపో నుంచి అత్యధికంగా ఖమ్మం జిల్లాకు సర్వీసులు నడుస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఈ సర్వీసులను కుదించాల్సి వస్తుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న డిపో మరింత వెనుకబడకుండా మైలవరానికి తరలించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
తిరువూరు డిపోను నూజివీడు డిపోకు అనుసంధానంచేసి శాటిలైట్ డిపోగా నిర్వహించాలనే మరో ప్రతిపాదన కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పొదుపు చర్యల పేరుతో తిరువూరు డిపోను మూసివేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు ప్రయాణికులను సైతం కలవర పరుస్తున్నాయి. జిల్లాలో మారుమూల ఉన్న తమకు ఆర్టీసీ బస్సులే ఆధారమని, డిపో ఎత్తివేస్తే ప్రయివేటు వాహనాలపై ఆధారపడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాకు తెలియదు
తిరువూరు ఆర్టీసీ డిపో తరలింపు ప్రతిపాదనలు మాకు తెలియదు. ఇంతవరకు యాజమాన్యం నుంచి ఎటువంటి సమాచారమూ మాకు అందలేదు.
- ప్రవీణ్‌కుమార్, తిరువూరు డిపో మేనేజర్