సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదైంది. నిన్న(మంగళవారం) జరిగిన కంభంపాడు ఘటనపై వైఎస్సార్‌సీపీ ఎంపీపీ నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి, టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తన ఇల్లు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి, మరికొందరిపై కేసు నమోదు చేసిన ఏ.కొండూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్నటి ఘటనలో వీడియోల ఆధారంగా ఇప్పటివరకు 60 మందికిపైగా పోలీసులు గుర్తించారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో అరాచకం సృష్టించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటనను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎ.కొండూరు ఎంపీపీపై కక్షసాధింపు చర్యలకు దిగారు. జేసీబీతో ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి ఇంటిని ధ్వంసం చేయించి, కంభంపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని కంభంపాడు పోలింగ్ కేంద్రంలోకి తన అనుచరులతో కలిసి అక్రమంగా ప్రవేశించబోయారు. అనుచరులతో కలిసి వెళ్లడాన్ని ఎంపీపీ నాగలక్ష్మి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఎంపీపీపై కక్షకట్టారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఉదయమే మందీ మార్బలంతో కంభంపాడు వచ్చారు. ఎంపీపీ నిర్మిస్తున్న భవనం ఆక్రమిత స్థలంలో ఉందంటూ అధికారులపై వత్తిడి తెచ్చారు. దానిని కూల్చివేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు.
ఎమ్మెల్యే ఆదేశాలతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కంభంపాడు చేరుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భవనం కూల్చివేతకు చేసిన హంగామా స్థానికుల్ని భయాందోళనలకు గురి చేసింది. ఎమ్మెల్యే వర్గీయులే పొక్లయిన్‌ను తీసుకొచ్చి పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఎంపీపీ భవనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment