సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చిట్టేల మహిళలు భగ్టుమంటున్నారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ ఆందోళనకు దిగారు. కొలికపూడి సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని మహిళలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకర మెసేజ్‌లు పంపి ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆరోపించారు. మహిళల్ని వేధిస్తున్న ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.
కాగా, తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వారం రోజులుగా జరుగుతున్న రగడకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు దిగుతున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు తలంటి దూకుడు తగ్గించుకోవాలని, నాయకులను కలుపుకొని పోవాలని పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరువూరు మండలంలోని చిట్టేల సర్పంచి తుమ్మలపల్లి శ్రీనివాసరావును ఎమ్మెల్యే బహిరంగంగా దూషించడమే కాక గుడ్డలూడదీసి కొడతానంటూ అసభ్య పదజాలంతో తిట్టడంతో నియోజకవర్గంలోని టీడీపీ వర్గాలు నిరసనలకు దిగాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావును సైతం నాయకులు కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.
ఇంతవరకు నియోజకవర్గంలోని సీనియర్ల ముఖం సైతం చూడని ఎమ్మెల్యే శ్రీనివాసరావు వైఖరిని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ‘తిరువూరును రక్షించండి’ నినాదంతో సోమవారం సాయంత్రం పట్టణంలో పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే, అధిష్టానం ఆదేశాలతో విరమించుకున్నారు. దీనికి తోడు ఫేస్‌బుక్ వేదికగా ‘అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భయంకరమైన ప్రశాంతంగా ఉంటుంది’ అంటూ ఎమ్మెల్యే పోస్టింగ్ పెట్టడంతో టీడీపీ నాయకులు మరింత ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా ఎమ్మెల్యే తీరును తప్పుబట్టడం, విలేకరులను ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించడం తదితర ఘటనలతో పార్టీకి, ప్రజలకు ఎమ్మెల్యే దూరమవుతున్నారని గ్రహించిన అధిష్టానం వెంటనే నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment