
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు కీలక సమావేశం నిర్వహించారు.
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు కీలక సమావేశం నిర్వహించారు. తిరువూరు టీడీపీ కార్యాలయంలో నాలుగు మండలాల టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ కార్యకర్తల సమావేశంలో ఏపీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారశైలిపై టీడీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్న నాయకులకు గౌరవం, గుర్తింపు లేనేలేదని.. ఎమ్మెల్యేకు ఉన్న అధికారాలు కట్టడి చేసి, పార్టీ ఇంఛార్జిగా మరొకరికి అవకాశం కల్పించాలని కోరారు. 20 ఏళ్ల తర్వాత టీడీపీ గెలిచిందనే సంతోషం కూడా మాకు లేదని.. ఎమ్మెల్యే నుంచి ప్రతీరోజూ అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నామని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తుంది. పార్టీ కార్యకర్తలు పూర్తి నిస్తేజంగా ఉన్నారు. పార్టీ పూర్తిగా దెబ్బతినే పరిస్థితిని ఎమ్మెల్యే కొలికపూడి కల్పించారు’’ అంటూ కార్యకర్తలు మండిపడ్డారు.