టేకోవర్లపై ఇండియన్ బ్యాంక్ దృష్టి | Indian Bank to open 100 branches | Sakshi
Sakshi News home page

టేకోవర్లపై ఇండియన్ బ్యాంక్ దృష్టి

Published Wed, Jul 9 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

టేకోవర్లపై ఇండియన్ బ్యాంక్ దృష్టి

టేకోవర్లపై ఇండియన్ బ్యాంక్ దృష్టి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టేకోవర్ల ముప్పు నుంచి తప్పించుకోవడంతోపాటు ఇతర బ్యాంకులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ రంగం సిద్ధమయ్యింది. మూడు గ్రామీణ బ్యాంకులను ప్రధాన బ్యాంక్‌లో విలీనం చేయడం ద్వారా పెద్ద బ్యాంకుగా ఎదగడమే కాకుండా, వేరే బ్యాంక్‌ను కొనుగోలు చేసే స్థాయికి చేరతామంటున్నారు ఇండియన్ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ టి.ఎస్.భాసిన్. హైదరాబాద్‌లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన భాసిన్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

 ఆ ఇంటర్వ్యూ వివరాలు.. విలీనాలు, కలయికలపై..
 దేశీయ బ్యాంకింగ్ రంగంలో విలీనాలు, కలయికలు తప్పనిసరి. కానీ ఈ విషయం ఇంకా చర్చల దశలోనే ఉంది. బ్యాంకుల బోర్డులు, ఉద్యోగ సంఘాలు, ఖాతాదారుల మధ్య అనేక చర్చలు జరిగి, దానికి తగిన వాతావరణం ఏర్పడిన తర్వాత విలీనాలు, కలయికలు ప్రారంభమవుతాయి. దీనికి ఇంకా సమయం ఉన్నా మేము మాత్రం టేకోవర్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. అందులో భాగంగా మా బ్యాంక్‌కు చెందిన మూడు గ్రామీణ బ్యాంకులను విలీనం చేసుకోవాలనుకుంటున్నాం.

దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఉన్నతాధికారులతో చర్చలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే ఇండియన్ బ్యాంక్ శాఖల సంఖ్య ప్రస్తుతమున్న 2,260 నుంచి 3,500కి పెరగడమే కాకుండా, తగినంత మూలధనం సమకూరుతుంది. దీంతో వేరే బ్యాంకులను కోనుగోలు చేసే శక్తి వస్తుంది. అవకాశం వస్తే ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులను కొనుగోలు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాం.

 నిధుల సేకరణ గురించి..
 గత పదేళ్ళుగా కేంద్రం నుంచి ఎటువంటి నిధుల సహాయం లేకుండా సొంత లాభాలతోనే వ్యాపారాన్ని విస్తరిస్తున్నాం. గడచిన ఏడాది రూ.1,159 కోట్ల నికర లాభం రావడంతో రూ10,000 కోట్ల వరకు అదనపు రుణాలను ఇవ్వగలం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి కానీ, వాటాలను విక్రయించడం ద్వారా కానీ నిధులు సేకరించే ఆలోచన లేదు. బాసెల్-3 నిబంధనల ప్రకారం క్యాపిటల్ అడిక్వసీ రేషియో 13.1 శాతంగా, అదే బాసిల్-2 నిబంధనల ప్రకారం అయితే 12.48 శాతంతో పటిష్టంగా ఉంది.

 వ్యాపార విస్తరణ..
 కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం రావడంతో పాటు, వృద్ధిరేటు పెరుగుతుండటంతో రుణాలకు డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ ఏడాది రుణాల్లో 18 నుంచి 20%, డిపాజిట్లలో 15.5% వృద్ధిని అంచనా వేస్తున్నాం. గడచిన ఏడాది 16% వృద్ధితో వ్యాపార పరిమాణం రూ.2.80 లక్షల కోట్లుగా ఉంది.

 ఎన్‌పీఏల విక్రయం గురించి
 ఎన్‌పీఏల రికవరీపై పూర్తి దృష్టి పెట్టడమే కాకుండా కొన్ని నిరర్థక ఆస్తులను విక్రయించాలని నిర్ణయించాం. 18 అకౌంట్లకు చెందిన రూ.562 కోట్ల విలువైన ఎన్‌పీఏలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి విక్రయించడానికి సంబంధించి చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. నికర నిరర్థక ఆస్తులు 2.26 శాతంగా ఉన్నాయి. పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు.

 వడ్డీరేట్ల గురించి...
 ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించడానికి పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆహార సరఫరా వైపు పలు చర్యలు తీసుకుంటుండటంతో రుతుపవనాలు నెమ్మదించినా ధరల పెరుగుదలపై అంతగా ప్రభావం ఉండదనుకుంటున్నాం. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గడానికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 రాష్ట్ర విభజన ప్రభావం..
 రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అపారమైన వ్యాపార అవకాశాలు ఏర్పడ్డాయి. వీటిని అందిపుచ్చుకోవడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎంను కలిశాం. త్వరలోనే తెలంగాణ  ముఖ్యమంత్రిని కూడా కలుస్తున్నాం.  ఆంధ్రాలో రేవులు, సెజ్‌లు, పరిశ్రమల అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలకు అనుగుణంగా వచ్చే రెండేళ్లలో రూ.10,000 కోట్లు రుణాలను ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం.

 ఇందులో రేవుల కోసం రూ.5,000 కోట్లు, సెజ్‌లు, ఇతర రంగాల కోసం మరో రూ.5,000 కోట్ల కేటాయించాం. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కలిపి 301 శాఖలు ఉంటే ఈ ఏడాది చివరి నాటికి 350కి పెంచనున్నాం. అలాగే రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.25,000 కోట్లుగా ఉన్న వ్యాపారాన్ని ఈ ఏడాది చివరి నాటికి రూ.35,000 కోట్లకు, 2016 మార్చికి రూ.50,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement