ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపమిది | AP comprehensive morphological | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపమిది

Published Thu, Aug 21 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపమిది

ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపమిది

దేశవ్యాప్తంగా జనాభాలో పదో స్థానంలో ఆంధ్రప్రదేశ్
 

కిక్కిరిసిన తూర్పు గోదావరి... విజయనగరంలో అతి తక్కువ
46 మండలాల్లో ప్రమాదం అంచున భూగర్భ జలాలు..  ప్రణాళికా విభాగం సామాజిక ఆర్ధిక సర్వేలో వెల్లడి

 
విద్యావకాశాలు..

ఆంధ్రప్రదేశ్‌లో 146 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 141 ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలున్నాయి. వీటిలో 2.24 లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు.

సాంకేతిక విద్యకొస్తే 1,357 మంది డిప్లొమో, డిగ్రీ స్థాయి వృత్తి విద్య కళాశాలల్లో 3,44,551 మంది విద్యార్ధులు అభ్యసిస్తున్నారు.  
 
 హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపాన్ని ప్రణాళికా విభాగం తాజాగా విడుదల చేసిన ఆర్థిక సర్వేలో ఆవిష్కరించింది. 2013-14 సామాజిక ఆర్ధిక సర్వే ఆధారంగా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు, సామాజిక ఆర్ధిక స్థితిగతులు, జనాభా, పంటల ఉత్పత్తి, విద్యావకాశాలు తదితర అంశాలను పొందుపరిచారు. అయితే భౌగోళికంగా రాష్ట్రానికి సరిహద్దుగా మహారాష్ట్ర ఉందని ఆర్థిక సర్వేలో పేర్కొనడం గమనార్హం.

భౌగోళిక స్థితిగతులు

ఉత్తరాన చత్తీస్‌గఢ్, తెలంగాణాతోపాటు ఒడిశా రాష్ట్రాలు. తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు, పడమర కర్ణాటక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్నాయి. రెండు పెద్ద నదులైన కృష్ణా, గోదావరి రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి.

 జనాభా.. జన సాంద్రత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 4.94 కోట్లు. పురుషుల సంఖ్య 2.47 కోట్లు(50.1 శాతం) కాగా మహిళల సంఖ్య 2.46 కోట్లు (49.9 శాతం). దేశంలో జనాభా విషయంలో ఏపీ పదో స్థానంలో నిలిచింది. దేశ జనాభాలో రాష్ట్ర జనాభా 4.08 శాతంగా ఉంది.

2011 జనాభా లెక్కలతో పోలిస్తే రాష్ట్రంలో జనాభా పెరుగుదల శాతం తగ్గింది. 2011లో పెరుగుదల 9.21 శాతం ఉంటే 2001లో 11.89 శాతంగా ఉంది. అంటే జనాభా పెరుగుదల శాతం పదేళ్లలో 2.68 శాతం తగ్గిందన్న మాట. ఇక తూర్పు గోదావరిలో అత్యధికంగా 51.54 లక్షల జనాభా ఉంది. విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 23.44 లక్షల జనాభా ఉన్నారు. జనసాంద్రత విషయానికొ స్తే 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో చదరపు కిలోమీటర్‌కు 308 మంది చొప్పున ఉంటే, దేశంలో 382 మంది ఉన్నారు. కృష్ణా జిల్లాలో చ.కి.మీకి అత్యధికంగా 518 మంది జనాభా ఉండగా కడపలో అత్యల్పంగా 118 మంది ఉన్నారు.
 ఆహార ధాన్యాల దిగుబడి..

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 48.25 శాతం (78,388.6 చదరపు కిలోమీటర్లు) భూమి సాగులో ఉంది. అటవీ శాఖ రికార్డుల ప్రకారం 34,572 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. భౌగోళిక విస్తీర్ణంలో 796.8 చదరపు కి.మీ. భూమిని పరిశ్రమలకు వినియోగిస్తున్నారు. ఆక్వా కల్చర్‌కు 1,801.2 చదరపు కి.మీ. వినియోగిస్తున్నారు. 2012-13 లెక్కల ప్రకారం ఆహార ధాన్యాలు 41.56 లక్షల హెక్టార్లలో సాగు చేయగా 104.96 లక్షల టన్నుల దిగుబడి నమోదైంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 83.21 శాతం కాగా అపరాల ఉత్పత్తి 10.79 శాతంగా ఉంది.

భూగర్భ జలాల స్థితి

రాష్ట్రంలో 46 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదం అంచున ఉన్నాయి. 12మండలాల్లో నీటిమట్టం ప్రమాదక రంగా ఉంది.  వాతావరణం విషయానికొస్తే సగటున అధికంగా 39, కనిష్టంగా 15.70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏటా సగటున 911 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. 2013-14లో నైరుతి రుతుపవనాల సీజన్‌లో 514 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 554 మి.మి.గా ఉంది.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement