విభజన హామీలపై బాబు విఫలం
- వైఎస్సార్‌సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజం
- కేంద్రంపై ఒత్తిడి తేవటంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలం
- సీఎంకు ప్రచారం మీదున్న ధ్యాస ప్రజలపై ఏమాత్రం లేదు
- ఇతరుల హయాంలో జరిగిన పనులను తన ఘనతగా చెప్పుకుంటున్నారు
- ఆయన తీరు చూస్తుంటే విఠలాచార్య సినిమాలు గుర్తుకొస్తున్నాయి
- రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 5న కలెక్టరేట్లు ముట్టడించనున్న వైఎస్సార్‌సీపీ
- విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి విడిపోవటానికి కారకుడైన చంద్రబాబు ప్రత్యేక హోదా లాంటి హామీలను అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చేలా ప్రయత్నించే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏ కోశానా లేదన్నారు.
ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు, సేల్స్‌టాక్స్, ఇతర పన్నులపై రాయితీలు కల్పిస్తామని, రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రజలను మోసగిస్తోందని ధ్వజమెత్తారు. ఆదివారం కాకినాడలో తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో, అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు.
పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి ప్రసాదరాజు, మరో ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయ సాయిరెడ్డి ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. ‘సీఎం చంద్రబాబుకు ప్రచారం మీదున్న ధ్యాస హామీలు అమలు చేయటం, ప్రజలకు సేవ చేయటంపై ఏ కోశానా లేదు. ఇతరులు చేసిన అభివృద్ధి పనులను తానే చేసినట్లు బాబు చెప్పుకుంటున్నారు.
2013లోచిత్తూరులో శ్రీసిటీని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. చంద్రబాబు ఇప్పుడు జపాన్ వెళ్లి తానే అక్కడి కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడకు వెళ్లినా స్మార్ట్ సిటీలంటూ అది చేస్తాం, ఇది చేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే నాకు చిన్నతనంలో చూసిన విఠలాచార్య సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.
ఆ సిని మాలో మాంత్రికుడు చేతిలో మంత్రదండం సాయంతో ఒక్క క్షణంలో నగరాన్ని సృష్టించేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు మాటలు అలాగే ఉన్నాయన్నారు. దివంగత వైఎస్‌ఆర్ హయాం లో చేపట్టి, అనంతరం మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తిచేసే ఉద్దేశం బాబుకు లేదు. అందుకే 2019లో వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తేవాలని కోరుతున్నా. అలాగే మంత్రుల కనుసన్నల్లో టీడీపీ నాయకులు ఇసుకను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు.
పంట అమ్మబోతే కొనేవారు లేరు
చంద్రబాబు పాలనలో వరికి కనీస మద్దతు ధర కరువై రైతులు దిక్కుతోచక ఉన్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామంటున్న ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పించలేకపోతోంది.
ప్రజా పోరాటాలతో బలోపేతం: ధర్మాన
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పాలకపక్షానికి, ప్రతిపక్షానికి సమాన బాధ్యతలుంటాయన్నారు. పాలకపక్షం విధివిధానాలను, చట్టాలను రూపొందిస్తే వాటిలో లోపాలను, లొసుగులను నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదేనన్నారు.
సైనికుడిలా పని చేయాలి : జ్యోతుల
సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పోరాటాలతోనే చంద్రబాబు సర్కారు మెడలు వంచాలన్నారు. ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేసేం దుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎంవీఎస్ నాగి రెడ్డి, గౌతమ్‌రెడ్డి, మేరుగ నాగార్జున, ధర్మాన కృష్ణదాస్, సుధాకర్, సలామ్‌బాబు, ఐటీ సెల్ కార్యదర్శి మధుసూదన్ తమ ప్రసంగాల్లో చం ద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ సీజీసీ, సీఈసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చం ద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, పార్టీ రాష్ట్ర కా ర్యదర్శులు జక్కంపూడి రాజా, కొల్లి నిర్మలకు మారి, జీవీ రమణ, సంగిశెట్టి అశోక్, సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణ పాల్గొన్నారు.
జనవరిలో రెండు రోజులు జగన్ నిరశన దీక్ష
బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వ చ్చిన టీడీపీ అన్ని వర్గాల ప్రజలను వంచిం చిందని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. తమ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందన్నా రు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి మొదటి వారంలో ఉభ యగోదావరి జిల్లాల్లో రెండు రోజుల పాటు జగన్ నిరశన దీక్ష చేయనున్నారని చెప్పారు. ఫిబ్రవరి, మార్చిల్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టి పార్టీని సంస్థాగతంగా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.