చంద్రజాలం
ఈ ఆరునెలల్లో సీఎం చేసింది శూన్యం
ప్రమాణస్వీకారం చేసిన గుంటూరును సైతం విస్మరించిన వైనం
రుణ మాఫీ పేరుతో అన్నదాతలకు శఠగోపం
జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు
వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఊసే లేదు
పల్నాడులో సిమెంటు ఫ్యాక్టరీల ప్రస్తావనే మరిచారు
వాటర్ గ్రిడ్డూ లేదు..మెట్టకు నీళ్లూ లేవు.
రాజధాని భూసమీకరణపై రైతుల్లో వ్యతిరేకత
గుంటూరు: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి సోమవారం నాటికి ఆరు నెలల కాలం పూర్తయింది. గుంటూరు-విజయవాడ రహదారి పక్కన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై జూన్ 8న ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అదే వేదికపై నుంచి గుప్పించిన హామీలు, అంతకముందు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారు. అన్నింటా ఘోరంగా విఫలమయ్యారు. చివరకు ప్రమాణస్వీకారానికి వేదికైన గుంటూరు జిల్లాను సైతం మోసం చేశారు. జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో ఒక్క అడుగు సైతం ముందుకు వేయలేకపోయారు. అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయడం మినహా ఆయన పాలన అంతా డాంబికాన్ని తలపిస్తోంది. ప్రజల ఆశలన్నీ ఆవిరయ్యాయి.
రుణమాఫీ చేస్తామని మాట మార్చారు. రకరకాల నిబంధనలు విధించడంతో ఎక్కువ మంది రైతులు నష్టపోయారు. 11,78,383 బ్యాంకు ఖాతాలకు దాదాపు 3 లక్షల లోపు మాత్రమే అర్హమైనవిగా గుర్తించారు. చంద్రబాబును నమ్మి దాదాపు 8 లక్షల మందికి పైగా అన్నదాతలు నట్టేట మునిగారు. అన్నింటికీ ఆధార్ లింక్ అంటూ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో దాదాపు 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వాస్తు పిచ్చితో బాబు మూడు పంటలు పండే సారవంతమైన భూములు లాక్కొనే యత్నం చేస్తున్నారని కొంత మంది రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
బాబు వస్తాడు జాబు ఇస్తాడని యువతను ఎన్నికల సమయంలో మభ్య పెట్టారు. ఆయన అధికారంలోకి రాగానే కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న హామీని మరిచారు.
జిల్లాలో 2,257 మంది ఆదర్శ రైతులను తొలగించారు. గృహ నిర్మాణ శాఖలో 100 మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపించారు. ఇలా ఒక్క హామీ కూడా నేరవేర్చలేదు.
విఫలం.. ఇలా
వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి నాగార్జునసాగర్ కాలువ ద్వారా మాచర్ల, పిడుగురాళ్లతో పాటు మెట్ట రైతులకు సాగునీరు ఇస్తానని ప్రకటించారు. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు.
జిల్లాలో రైతుల పంటలకు గిట్టు బాటు ధర కల్పించేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలు ఆచరణకు నోచలేదు.
పల్నాడు ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
అర్హులైన పేదలకు మూడు సెంట్ల స్థలంలో రూ. 1.50 లక్షల రూపాయలతో పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పిన మాటలు నెరవేరకపోగా, నిర్మాణాల్లో ఉన్న 23,521 ఇళ్లకు ప్రభుత్వం బిల్లులు నిలిపి వేసింది.
జిల్లాలో 3,49,400 పింఛన్లు ఉండగా, గ్రామ కమిటీలు, సామాజిక కార్యకర్తల పేరుతో అర్హులైన వారి పింఛన్లలో కోత విధించారు. చివరకు 21,795 పింఛన్లు తొలగించారు.
జిల్లాలో 13,91,783 రేషన్ కార్డులుండగా ఆధార్ అనుసంధానంతో 1,19,393 కార్డులకు రేషన్ నిలిపి వేశారు.
ఎన్టీఆర్ సుజల పేరిట జిల్లాలో మొదటి దశలో 300 గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రకటించినా, కేవలం 24 ప్లాంట్లు మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.
మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా అవి నేటికీ కనిపిస్తూనే ఉన్నాయి. అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. వీటి రద్దుకు గ్రామ,మండల స్థాయిలో ఏర్పాటైన కమిటీల జాడ కూడా లేదు.