ఉవ్వెత్తున ఎగసిన ఉద్యోగ గళం
- రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్జీవోల నినాదాలు
- ప్రభుత్వ కార్యాలయాల్లో స్తంభించిన కార్యకలాపాలు
- బోసిపోయిన కలెక్టరేట్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: మళ్లీ సమ్మె సైరన్ మోగింది. సమైక్యాంధ్ర పరిరక్షణ ధ్యేయంగా ఉద్యోగుల గళం గర్జించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో మళ్లీ పని స్తంభించిపోయింది. ఉద్యోగ సంఘాల నాయకుల పిలుపు మేరకు సమ్మె మళ్లీ మొదలైంది. ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు గురువారం ఉదయం విధులను బహిష్కరించి రోడ్ల మీదకు వచ్చి విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారి ఆందోళనతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. గ్రామ కార్యాలయాల నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు అన్నీ మూతపడ్డాయి. ఉద్యోగులు లేక ఆఫీసులు బోసి పోయాయి.
పాడేరులో ఐటీడీఏ, సబ్‌కలెక్టర్ కార్యాలయాలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. పీవో వి.వినయ్‌చంద్‌ను కలిసి సమైక్యాంధ్రకు మద్దతుగా తాము చేపడుతున్న సమ్మెకు సహకరించాలని కోరారు. ఎన్జీవో నేతలు, పలు శాఖల ఉద్యోగులు పాడేరు వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. పాతబస్టాండ్‌లో రాస్తారోకో చేపట్టి రాష్ట్ర విభజన చర్యలను నిరసించారు.
కాగా ఎన్జీవోల సమ్మెతోఅంగన్‌వాడీ లింక్ వర్కర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఇబ్బంది పడ్డారు. ట్రైకార్ పథకంలో రుణాలు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చినవారు నిరాశతో వెనుతిరిగారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం నర్సీపట్నంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రెవెన్యూ అధికారులు పెన్ డౌన్ చేయగా సిబ్బంది పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. అనకాపల్లిలోనూ ఇదే పరిస్థితి చోటుచేసుకుంది.
కార్యాలయాలకు తాళాలు
సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఎపీఎన్‌జీవోలు, ఏపీఆర్‌ఎస్‌ఏ, పంచాయతీ రాజ్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి విధులను బహిష్కరించారు. ఉన్నతాధికారులు మినహా తహశీల్దార్ నుంచి కింది స్థాయి వరకు ప్రతీ ఒక్కరూ సమ్మెలో పాల్గొన్నారు. ఎప్పటిలాగే ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చినా విధులకు హాజరుకాకుండా రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలు చేశారు. తహశీల్దార్ కార్యాలయాలే కాకుండా జిల్లా కలెక్టరేట్‌లో సెక్షన్లకు తాళాలు వేశారు. నిత్యం జనాలతో కిటకిటలాడే కలెక్టర్ కార్యాలయం గురువారం బోసి పోయింది.
రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్‌లోనే టెంట్ వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఇతర నాయకులు, తహశీల్దార్లు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి సమ్మెలోకి వెళుతున్నట్లు చెప్పారు. కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను శుక్రవారం కలిసి సమ్మె విషయాన్ని చెప్పనున్నారు.
బలవంతంగా మూసివేత
ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం ఉదయం నగరంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ తిరిగారు. డీఈఓ, కమర్షియల్ ట్యాక్ ఆఫీస్‌లలో విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది ఉద్యోగులను బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. కార్యాలయాలను మూసివేశారు. అలాగే ఇతర శాఖలకు కూడా వెళ్లి కార్యాలయాలన్నింటినీ మూయించారు. గ్రామీణ జిల్లాలో గ్రామ కార్యాలయాల నుంచి మండల తహశీల్దార్ ఆఫీస్‌ల వరకు మొత్తం మూత పడడంతో పాలన స్తంభించిపోయింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసేంత వరకు విధులను బహిష్కరించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. మున్ముందు మరిన్ని శాఖల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు చెబుతున్నారు.
ఆ నలుగురికీ మినహాయింపు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె బాట నుంచి నలుగురు తహశీల్దార్లకు వినహాయిం పు ఇచ్చారు. ఈ నలుగురూ జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు పోకుండా ఉండేందుకు రెవెన్యూ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గాజువాక తహశీల్దార్ వి.సింహాద్రిరావు, ఆనందపురం తహశీల్దార్ నెహ్రూబాబు, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ తహశీల్దార్ వై.పి.ఎస్.రాణి, కలెక్టరేట్‌లో ఉన్న రెవెన్యూ డివిజన్ ఆఫీస్ స్పెషల్ తహశీల్దార్ ఎన్.వి.సూర్యనారాయణలు గురువారం విధులు నిర్వర్తించారు. గత ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు జరిగిన సమ్మెలో వీరు పాల్గొన్నారు.