ఐఐటికీ.. నూజివీడే అనుకూలం...
- అందుబాటులో అనువైన స్థలం
- ప్రముఖుల రాకపోకలకు అనుకూలం
నూజివీడు : సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ ఐటీని సొంత చేసుకుని గుర్తింపు తెచ్చుకున్న నూజివీడు ప్రాంతం నూతన నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్న ఐఐటీకీ అనుకూలమని ప్రముఖులు పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో 11జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పుతామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో నూజివీడు ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు అందుబాటులో ఉన్నందున ఐఐటీ ఏర్పాటుకు నూజివీడు ప్రాంతం అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విభజన అనంతరం రాష్ట్రంలో నూతన రాజధాని ఏర్పాటు కోసం, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నూజివీడులోనే ఐఐటీని ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఇక్కడ ట్రిపుల్‌ఐటీ నిర్వహిస్తుండటంతో పాటు నూజివీడు ప్రాంతంలో వేలాది ఎకరాల అటవీభూములు, దేవాదాయ భూములు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ ఏర్పాటు చేయాలంటే కనీసం 3వందల ఎకరాల భూమి కావాలి. ఇంత భూమి జిల్లాలో నూజివీడు ప్రాంతంలోనే ఉండటంతో పాటు ఒక్కరైతును కూడా ఇబ్బంది పెట్టకుండా భూములను సేకరించడానికి ఇక్కడ అవకాశముంది. ఐఐటీ ఏర్పాటు చేసినట్లయితే నిత్యం దేశ వ్యాప్తంగానే కాకుండా, విదేశాల నుంచి సైతం ప్రపంచస్థాయి విద్యావేత్తలు, సైంటిస్టులు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.
నూజివీడు నుంచి గన్నవరం విమానాశ్రయం కేవలం 30కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గతంలో 2007లో రాష్ట్రానికి ఐఐటీ మంజూరైనపుడు బాసరలో ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కేంద్రానికి నివేదిక పంపారు. దీంతో కేంద్రం నుంచి వచ్చిన హైపవర్ కమిటీ బాసర పరిసర ప్రాంతాలను సందర్శించి అక్కడి స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి విమానాశ్రయం లేదని, అదే హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తే ఐఐటీలకు వచ్చిపోయే విద్యావేత్తలకు, సైంటిస్టులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నివేదికను ఇవ్వడంతో చివరకు ఐఐటీని మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద 576ఎకరాల్లో నెలకొల్పారు.
విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐఐటీని ఏర్పాటు చేయనున్నందున 30కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉండటం, 20కిలోమీటర్ల దూరంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి ఉండటం , విజయవాడ-గుంటూరు రాజధాని అయితే రాజధానికి కేవలం 40కిలోమీటర్ల దూరంలోరనే ఉండటం కూడా కలిసొచ్చే అంశమేనని ఈ ప్రాంత మేధావులు, రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి టెక్నాలజీని అనుసంధానం చేసుకోవడానికి ఐఐటీలు ఎంతో అవసరమైన నేపథ్యంలో నూజివీడులో ఐఐటీ ఏర్పాటు మంచిదేనే అభిప్రాయాన్ని సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు.