
ప్రభుత్వ భూములపై మాస్టర్‌ప్లాన్
- ప్రాజెక్టుల కోసం భూముల పరిశీలన
- జిల్లాలో విస్తృతంగా సర్వే
- నివేదికలు సిద్ధం చేస్తున్న అధికారులు
విశాఖ రూరల్: రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి విశాఖపైనే పడింది. విశాఖను మెగా సిటీగా తీర్చిదిద్దుతామని కేంద్రం ప్రకటించడంతో హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది. ఉన్నత విద్యా సంస్థలు, శంషాబాద్ తరహాలో కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇలా రోజుకో ప్రతిపాదన తెరపైకి వస్తోంది. ఇప్పటి వరకు విశాఖకు ఎటువంటి ప్రాజెక్టులు వస్తాయన్న విషయంపై స్పష్టత లేకపోయినా .. అనేక ఊహాగానాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఎప్పుడు ఎటువంటి ప్రాజెక్టు జిల్లాకు కేటాయించినా వెంటనే వాటి ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.
ప్రధానంగా ప్రాజెక్టులకు అవసరమైన భూములను గుర్తించే పనిలో నిమగ్నమైంది. జిల్లాలో విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ భూముల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి వివరాలతో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని నిర్ణయించింది. ముందుగా విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధి మండలాల్లో కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు స్వయంగా ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నారు.
5 కేటగిరీల కింద సర్వే
ఈ భూముల సర్వేను అయిదు కేటగిరీల కింద చేపడుతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, అక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూములు, ఇతర శాఖలకు కేటాయించిన భూములతో పాటు కొంత మంది వ్యక్తులు, ప్రయివేట్ సంస్థలకు కేటాయించిన అసైన్డ్ భూముల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైన ప్రాజెక్టు కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకొనే అవకాశం ఉండడంతో వాటిపై కూడా సర్వే చేస్తున్నారు. ఆక్రమిత భూములను వెనక్కు తీసుకోవడంతో పాటు కోర్టు వివాదాల్లో ఉన్న భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఆరు ప్రాజెక్టులకు స్థలాల గుర్తింపు
జిల్లాలో ట్రిపుల్ ఐటీకి 100 ఎకరాలు, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌లకు ఒక్కో దానికి 200 ఎకరాలు, ఐఐటీ, ఎన్‌ఐటీ ఒక్కోదానికి 300 ఎకరాలు చొప్పున స్థలాలను గుర్తించాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్లేయిన్ ఏరియాలో అంత విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు లేకపోవడంతో భీమిలి, పెందుర్తి, పద్మనాభం, ఆనందపురం, విశాఖ రూరల్, సబ్బవరం, పరవాడ ప్రాంతాల్లో కొండ పోరంబోకు స్థలాలను గుర్తించారు.
కొండ స్థలాలు కావడంతో నిర్దేశించిన విస్తీర్ణం కంటే 100 నుంచి 200 ఎకరాలు అధికంగానే ప్రతిపాదనలు రూపొందించారు. వీటితో పాటు మరికొన్ని స్థలాలను కూడా గుర్తించి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాకు ఎప్పుడు ఈ ప్రాజెక్టు కోసం భమూలు అడిగినా వెంటనే ఆ మాస్టర్‌ప్లాన్ ప్రకారం వివరాలను ప్రభుత్వానికి సమర్పించే విధంగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
మరో వారం రోజుల్లో విశాఖ రెవెన్యూ డివిజన్‌లో ప్రభుత్వ భూముల సర్వే పూర్తవుతుందని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆ తర్వాత అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధుల్లో కూడా సర్వే చేపడతామని పేర్కొన్నారు. అయిదు కేటగిరీల్లో పరిశీలించిన భూముల వివరాలతో పూర్తిస్థాయి మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తామని చెబుతున్నారు.