విభజన ద్రోహులు కాంగ్రెస్, చంద్రబాబే : కిరణ్
పెనుగంచిప్రోలు/ వత్సవాయి : రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌తో పాటు తెలంగాణాకు అనుకూలమని లేఖ ఇచ్చి చివరలో నాటకాలాడిన చంద్రబాబు రాష్ట్ర విభజనకు కారణమని జైసమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు, వత్సవాయి గ్రామాల్లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. విభజన వలన వచ్చే నష్టాలను కాకుండా ఓట్లు, సీట్ల కోసమే మిగిలిన రాజకీయ పార్టీలు ఆలోచించాయన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాటిబండ్ల వెంకట్రావు, డా.గంగాధర్, కంచేటి రమేష్, కట్టా సత్యనారాయణ, బత్తుల రామారావు, తదితరులు పాల్గొన్నారు.
రోడ్‌షోకు స్పందన నిల్..
మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రోడ్‌షోకు ప్రజల నుంచి ఏమాత్రం స్పందన లభించలేదు. రాష్ట్ర విభజనలో కిరణ్ కూడా పాత్ర పోషించాడనే అభిప్రాయం ప్రజల్లో ఉండటంతో స్పందన కరువైంది. ఆయన రోడ్‌షోకు నేతలు పూర్తిగా దూరంగా ఉన్నారు. 20కి పైగా వాహనాలతో భారీ కాన్వాయ్ ఉన్నప్పటికీ కేవలం వందల సంఖ్య లోపే ప్రజలు ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
భోజనాల కోసం ఆందోళన....
కిరణ్ రోడ్‌షోకు జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకు అన్నం కరువై ఆందోళనకు దిగిన సంఘటన పెనుగంచిప్రోలులో శుక్రవారం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనానికి ఆపి తమకు అన్నం పెట్టలేదని, అలాంటప్పుడు తమను ఎందుకు తీసుకొచ్చారని నిర్వాహకులను నిలదీసిన కార్యకర్తలు బల్లలను పడవేశారు.