పోలీస్ బండి.. ఎక్కడండీ..?
ఏపీలో.. సగం పోలీస్ స్టేషన్లకు వాహనాలు కరువు
గస్తీ నిర్వహించే కానిస్టేబుళ్లకు ద్విచక్ర వాహనాలు
ఇతర రాష్ట్రాల్లో వాహనాల వినియోగంపై అధ్యయనం
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్ర విభజనానంతరం.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు సగానికి పైగా పోలీస్ స్టేషన్లకు వాహనాలు లేవని తేలింది. వీటికి ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించే స్టేషన్ హౌస్ ఆఫీసర్లు సైతం సొంత వాహనాల పైనే తిరుగుతున్నారని సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన పంపకాల్లో భాగంగా ఏపీకి రావాల్సిన వాహనాల కంటే 1060 వరకు తక్కువ రావడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 13 జిల్లాల ఎస్పీ, మరో మూడు అర్బన్ జిల్లా, రెండు కమిషనరేట్లు, 4 రేంజ్, 3 జోన్ కార్యాలయాలతో పాటు 195 సర్కిళ్లు, 854 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటికి తోడు సీఐడీ, ఏఆర్ తదితర స్పెషల్ యూనిట్లు సైతం పనిచేస్తున్నాయి. వీటిలో 471 స్టేషన్లతో పాటు దాదాపు సగం మంది అధికారులకు ప్రభుత్వం సమకూర్చిన వాహనాలు లేవు.
ఫలితంగా పెట్రోలింగ్‌తో పాటు ఇతర కార్యకలాపాలు మందకొడిగా సాగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న డీజీపీ కార్యాలయం ఈ బడ్జెట్‌లో కేటాయించిన రూ.100 కోట్లను వెచ్చించి విడతల వారీగా అధికారులకు తేలికపాటి వాహనాలు, గస్తీ నిర్వహించే బీటు కానిస్టేబుళ్లకు ద్విచక్ర వాహనాలు సమకూర్చాలని నిర్ణయించింది.
► అయితే, టెండర్ల ప్రక్రియ ద్వారా వాహనాలను కొనుగోలు చేసేందుకు సమయం పడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డెరైక్టర్ జనరల్ ఆఫ్ సేల్స్ అండ్ ప్రపోజల్స్(డీజీఎస్పీ) నిర్దేశిత రేట్ల ప్రకారం ఆయా వాహనాలను కొనుగోలు చేసే అవకాశముంది.
► దీంతో డీజీఎస్పీ జాబితాలో ఉన్న కంపెనీల వివరాలు సేకరించిన డీజీపీ కార్యాలయం వాటిలో రాష్ట్రంలోని పరిస్థితులు, అధికారులకు అనుకూలంగా ఉండే వాహనాలను కొనాలని నిర్ణయించింది. ఇప్పటికే దక్షిణాదిలో ఉన్న పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో ఉన్న ప్రధాన నగరాల్లోనూ ఆయా పోలీసు విభాగాలు ఏస్థాయి అధికారులకు ఏ వాహనాలు వినియోగిస్తున్నారనే అంశంపై అధ్యయనం చేసింది.
► ఎస్పీ కంటే కిందిస్థాయి వారు సుమోలు వాడుతుండగా.. ఎస్పీ ఆ పైస్థాయి అధికారులు బొలేరో, స్కార్పియో, ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ వంటివి వినియోగిస్తున్నారని గుర్తించారు.
► స్కార్పియో వాహనం డీజీఎస్పీ జాబితాలో లేకపోవడంతో పాటు దీని వినియోగంలోనూ అనేక ఇబ్బందులు ఉంటాయని డీజీపీ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఈ వాహనం ఎక్కడానికి కొంత ఇబ్బంది ఉండడంతో పాటు లోపల ఖాళీ కూడా తక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.
► ఈ నేపథ్యంలోనే సుమో, ఇన్నోవాలనే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాలతో పాటు ఉన్నతాధికారులు వినియోగించేందుకు డిజైర్ తరహావీ సమకూర్చుకోవాలని భావిస్తున్నారు.
ఊరూ.100 కోట్లు వెచ్చించి ఒకేసారి వాహనాలు కొనుగోలు చేస్తే వాటి వల్ల ఇబ్బందులు తలెత్తితే మార్పిడి సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే ప్రాథమికంగా తొలి విడతలో కేవలం 150 తేలికపాటి వాహనాలు కొనాలని నిర్ణయించారు.
► వివిధ కంపెనీల ప్రతినిధులు పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్(పీటీఓ)లో తమ వాహనాలను ఉన్నతాధికారులకు చూపించారు. పోలీసు విభాగం సరఫరాకు ఆర్డర్ ఇస్తే వాటిలో చేయనున్న మార్పు చేర్పుల్నీ డీజీపీ నేతృత్వంలోని పర్చేజింగ్ కమిటీకి వివరించారు.