సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పోలీస్‌శాఖ మరింత శక్తివంతం కానుంది. ఇన్నాళ్లూ సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బంది పడిన ఈ శాఖకు అదనపు విభాగాలతోపాటు, అధికారులు రానున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం మిగిలిన 13 జిల్లాల్లో పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టపరిచే దిశగా ప్రభుత్వస్థాయిలో కసరత్తు జరుగుతోంది.
ఇందులో భాగంగా జిల్లాలోని పలు పోలీస్ విభాగాలకు అధికారులు రానున్నారు. ఇంటెలిజెన్స్, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ విభాగాల్లో కొన్ని శ్రీకాకుళం కేంద్రంగా పని చేస్తుండగా.. మరికొన్ని విభాగాలు పొరుగు జిల్లాలు కేంద్రంగా పని చేస్తుండటంతో పాలనాపరమైన ఇబ్బందులెదురువుతున్నాయి. ఈ ఇబ్బందులు తొలగించే క్రమంలో జిల్లాకు కొత్తగా కనీసం ఐదుగురు డీఎస్పీలను ప్రభుత్వం కేటాయిస్తుందని విశ్వసనీయ సమాచారం. ఇటీవలే డీపీసీ (డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ) నిర్ణయించిన మేరకు రాజధాని నుంచి కొత్త డీఎస్పీలు రానున్నట్టు తెలిసింది. అదే విధంగా ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్పీలైన కొంతమంది, సీఐలుగా పనిచేసి ఉద్యోగోన్నతి సాధించిన మరికొందరు జిల్లాకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది.
ఏసీబీకి డీఎస్పీ
అవినీతి నిరోధక శాఖ జిల్లా విభాగం ప్రస్తుతం విజయనగరం డీఎస్పీ పరి ధిలో పని చేస్తోంది. ఈ విభాగం శ్రీకాకుళం కార్యాలయంలో సీఐ, ఇతర సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. దీనివల్ల కేసుల నమోదు, దాడులు, ఆకస్మిక తనిఖీల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి పరిష్కారానికి త్వరలో శ్రీకాకుళం కేంద్రంగా ఏసీబీ డీఎస్పీ పోస్టు మంజూరు కానుందని అధికారులు చెబుతున్నారు. విశాఖలో పనిచేస్తున్న ఓ ఏసీపీ డీ ఎస్పీగా ఇక్కడ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం.
రెండుగా విజిలెన్స్?: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కలిపి శ్రీకాకుళం పట్టణంలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం ఉంది. ఓ ఎస్పీ, ఇద్దరు సీఐలు, మరికొంతమంది ఎస్‌ఐలు పని చేస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో ఆకస్మిక తనిఖీలు, కేసుల నమోదు వ్యవహారాలన్నీ ఈ కార్యాలయమే చూస్తోంది. రెండు జిల్లాల్లోనూ అక్రమాలు, కేసులు పెరిగినందున సిబ్బందికి పనిభారం పెరిగింది. అధికారులు ఇక్కడ నుంచి విజయనగరం జిల్లాకు వెళ్లి తనిఖీలు చేయడం కష్టమవుతోంది. సమయం కూడా వృథా అవుతోంది. విజిలెన్స్ విభాగాన్ని విడదీసి మరో డీఎస్పీ పోస్టు మంజూరు కోసం అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
కొత్తగా సీఐడీ విభాగం: ఇప్పటివరకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు కలిపి విశాఖపట్నం కేంద్రంగా సీఐడీ విభాగం పనిచేస్తోంది. పోలీస్‌శాఖలో నమోదయ్యే భారీ కేసుల ఛేదనకు, ప్రభుత్వం ఆదేశించే మరికొన్ని ప్రత్యేక కేసుల దర్యాప్తును చేపడుతున్న ఈ విభాగానికి మూడు జిల్లాల పరిధిలో పనిచేయాల్సి రావడం ఇబ్బందిగా మారింది. పెద్ద పెద్ద కేసుల పరిష్కారానికి విశాఖ నుంచి అధికారులు, సిబ్బంది తరచూ రావడం ఖర్చు, శ్రమతో కూడుకున్న పని అని అధికారులు గుర్తించారు. దీంతో ఇకపై జిల్లా యూనిట్‌గా సీఐడీ విభాగం ఉండాలన్న ప్రతి పాదనలు వెళ్లాయి. భవిష్యత్తులో ఓ డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐడీ విభాగం జిల్లా కేంద్రంలో ఏర్పాటవుతుందని అధికారవర్గాలసమాచారం.
ఎస్బీకి మరో డీఎస్పీ
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇప్పటి వరకూ ఇద్దరు స్పెషల్‌బ్రాంచ్ (ఎస్బీ) ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వహిస్తుండేవారు. పని విభజనలో భాగంగా మరో పైస్థాయి అధికారి అవసరం ఏర్పడింది. దీంతో వారం క్రితమే డీఎస్పీని నియమించారు. విశాఖలో పలు విభాగాల్లో పనిచేసిన టేకి మోహనరావు అనే అధికారి ఇటీవలే ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. పలాస (కాశీబుగ్గ), పాలకొండ, శ్రీకాకుళం డివిజన్లకు వేర్వేరుగా శాంతిభద్రతల డీఎస్పీలున్నారు. వీరిలో శ్రీకాకుళం డీఎస్పీకి ఇటీవల రివర్షన్ ఉత్తర్వులు రావడం, తరువాత ఉన్నతాధికారి వద్దకు వెళ్లడంతో ఆయనకు మళ్లీ పోస్టింగ్ వేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది.
అయితే విశాఖలో పనిచేస్తున్న మరో డీఎస్పీ ఇక్కడి శాంతిభద్రతల విభాగానికి రానున్నట్టు తెలిసింది. అదేవిధంగా పాలనాపరమైన విధులు నిర్వహించేందుకు ఓఎస్‌డీ (ప్రత్యేకాధికారి) ఒకరు, నేరవిభాగ అధికారిగా మరో ఓఎస్‌డీ ఇక్కడ ఉన్నారు. జిల్లా కేంద్రంగా ఆర్మ్‌డ్ రిజర్వు అధికారిగా ఏఆర్‌డీఎస్పీ, జిల్లా పోలీస్ శిక్షణ కేంద్ర అధికారిగా (డీపీటీసీ) మరో డీఎస్పీ, ఇంటెలిజెన్స్ విభాగానికి శ్రీకాకుళం కేంద్రంగా మరో డీఎస్పీ విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడున్న సిబ్బంది సంఖ్యను పెంచేందుకు, పోలీస్‌శాఖను మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా మరికొందరు డీఎస్పీలు రానున్నట్టు పోలీస్‌వర్గాల భోగట్టా.
పోలీసు శాఖకు జవసత్వాలు
Published Thu, Aug 7 2014 2:32 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement