
‘ఔటర్’పై రయ్.. రయ్
- రోజుకు 35 వేల వాహనాల రాకపోకలు
- కనిపించని ‘విభజన’ ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర విభజన ప్రభావం పలు రంగాలపై పడినా.. ఔటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్‌పై మాత్రం కనిపించట్లేదు. ఈ ఎక్స్‌ప్రెస్ వేలో ప్రయాణించే వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఔటర్‌పై ట్రాఫిక్ తగ్గవచ్చని అధికార వర్గాలు అంచనా వేశాయి. కొంతమేర టోల్ ఆదాయం పడిపోయే ప్రమాదం ఉందని భావించాయి. అయితే, విభజన జరిగి నాలుగు నెలలైనా వాహనాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు.
ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం 158 కి .మీ.కుగాను ప్రస్తుతం పెద్ద అంబర్‌పేట నుంచి శంషాబాద్ మీదుగా శామీర్‌పేట వరకు 120 కి.మీ. అందుబాటులోకి వచ్చింది. మొదట్లో పటాన్‌చెరు నుంచి పెద్ద అంబర్‌పేట వరకు 85కి.మీ మార్గంలో టోల్ వసూలు చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించి, ఆ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని భావించారు. ఆ మేరకు 2011 మార్చిలో ఔటర్ ట్రాఫిక్‌పై సర్వే చేసి రోజుకు సుమారు 20 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్టు లెక్క తేల్చారు. దీని ఆధారంగా అప్‌సెట్ ప్రైస్ (కనీస మొత్తాన్ని) నిర్ణయించి టెండర్ పిలిచారు.
ఆ తర్వాత పటాన్‌చెరు- శామీర్‌పేట మార్గం 33కి.మీ. అందుబాటులోకి రావడంతో 2012 డిసెంబర్‌లో మరోసారి ట్రాఫిక్ సర్వే చేశారు. అప్పట్లో రోజుకు 25 వేల వరకు వాహనాల తిరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో ఆ 33కి.మీ. మార్గానికి టోల్ వసూలుకు టెండర్ పిలవగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ మార్గన్ని కూడా పాత ఏజెన్సీకే అప్పగించారు. తొమ్మిది నెలల తర్వాత టోల్ వసూలు ఒప్పందం గడువు ముగియడంతో 120కి.మీ. మార్గానికి టెండర్ పిలిచేందుకు 2014 జనవరిలో ట్రాఫిక్ సర్వే చేశారు.
ఈ మార్గంలో రోజుకు 33వేల నుంచి 35 వేల వాహనాలు నడుస్తున్నట్టు గుర్తించారు. సర్వే ఫలితాల ఆధారంగా అప్‌సెట్ ప్రైస్‌ను నిర్ణయించి హెచ్‌ఎండీఏ టెండర్ పిలించింది. నెలకు రూ.3.92 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడ్డ ఓ సంస్థకు టోల్ వసూలు బాధ్యతను అప్పగించారు. దీన్నిబట్టి హెచ్‌ఎండీఏ ఆదాయానికి ఢోకా లేదని స్పష్టమవుతోంది.