
మేలైను మార్గం
సిటీలో ‘లైన్ డిసిప్లిన్’
అమలుపై దృష్టి జేఎన్‌టీయూ సహకారం తీసుకోవాలని నిర్ణయం
ఈ విధానంతో ముంబైలో మంచి ఫలితాలు
ట్రాఫిక్ పోలీసుల సన్నాహాలు
సిటీబ్యూరో: జంట కమిషనరేట్ల పరిధిలో కేవలం ఔటర్ రింగ్ రోడ్డుకు (ఓఆర్‌ఆర్) మాత్రమే పరిమితమైన లైన్ డిసిప్లిన్‌ను నగర వ్యాప్తంగా అమలుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రాథమికంగా ఎంపిక చేసిన మార్గాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి... ఆపై అనువైన ప్రతి మార్గానికీ విస్తరించాలని నిర్ణయించారు. దీని కోసం కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) నుంచి సాంకేతిక సహకారం తీసుకోనున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ విధానం మంచి ఫలితాలిచ్చిందని పేర్కొంటున్నారు. రాజధానిలోని రోడ్లపై లైన్ డిసిప్లిన్‌ను అమలు చేయడం ద్వారా వాహనాల వేగాన్ని పెంచడంతో పాటు వాహన చోదకులు గమ్యం చేరే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఓ పద్ధతి లేకుండా ...
నగరంలోని ఏ జంక్షన్‌ను తీసుకున్నా రెడ్‌లైట్ పడినప్పుడు స్టాప్‌లైన్ వద్ద వాహనాలు ఆగే తీరు నిర్దిష్టంగా ఉండదు. ద్వి చక్ర వాహనాల నుంచి ఆర్టీసీ బస్సుల వరకు ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా ఆగుతాయి. కుడి వైపునకు వెళ్లాల్సిన వాహనాలు కూడా ఎడమ వైపు ఆగుతుంటాయి. దీని వల్ల గ్రీన్‌లైట్ పడినప్పుడు వేటికవి ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నించడంతో అనేక సందర్భాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు ఇబ్బందికరమైన జంక్షన్లలో వీటి వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహన చోదకుల మధ్య చిన్న చిన్న తగాదాలు, ఘర్షణలు పరిపాటిగా మారాయి. ఈ సమస్యలకు లైన్ డిసిప్లిన్ పరిష్కారం చూపనుంది.
ముంబైలో ఎప్పటి నుంచో అమలు
నగరం కంటే వాహనాలు ఎక్కువగా ఉన్న ముంబైలో ఈ విధానం మంచి ఫలితాలనిచ్చింది. అక్కడి అధికారులు కొన్నేళ్ల క్రితమే దీన్ని అమలు చేశారు. నగరంలోని వాహనాల సామర్థ్యం, ప్రయాణించే వేగాన్ని బట్టి సిగ్నల్స్ వద్ద వేర్వేరుగా లైన్లు కేటాయిస్తారు. రెడ్‌లైట్ పడినప్పుడు ఆ వాహనాలను కచ్చితంగా వాటికి కేటాయించిన వరుసలోనే ఆగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రీన్‌లైట్ పడినప్పుడూ ముందుకు క్రమపద్ధతిలో వెళ్లడంతో జంక్షన్లలో ట్రాఫిక్ జామ్‌తో పాటు ప్రమాదాలు సైతం గణనీయంగా తగ్గాయి.
అన్ని రోడ్లలోనూ సాధ్యం కాదు...
సిటీ ట్రాఫిక్ విభాగం అధికారులు లైన్ డిసిప్లిన్ విధానాన్ని కేవలం జంక్షన్ల వద్దే కాకుండా.. రహదారుల పైనా అమలు చేయాలని యోచిస్తున్నారు. సిటీలోని అన్ని ప్రాంతాల్లోని రహదారులూ ఒకేలా ఉండవు. ఈ కారణంగా కొన్ని అవసరమైన వెడల్పుతో ఉండగా... మరికొన్ని కుంచించుకుపోయి... బాటిల్ నెక్స్‌తో సాగుతుంటాయి. జంక్షన్ల పరిస్థితీ ఇలానే ఉంటోంది. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఒకేసారి లైన్ డిసిప్లిన్ విధానాన్ని అమలు చేస్తే వీటి వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ప్రాథమికంగా లైన్ విధానం అమలుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని నిర్ణయించారు.
జేఎన్టీయూ సహకారంతో...
రహదారుల సర్వేతో పాటు లైన్ డిసిప్లిన్ అమలు, అందుకు చేపట్టాల్సిన ఇంజినీరింగ్ మార్పులను సూచించడానికి సిటీ ట్రాఫిక్ పోలీసులు జేఎన్టీయూ నిపుణుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. వారి ద్వారా సాంకేతిక అధ్యయనం చేయించిన తర్వాతే దీన్ని అమలు చేయనున్నారు. దీనివల్ల వాహనాల సరాసరి వేగం పెరగడంతో పాటు గమ్యం చేరే సమయం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు గ్రీన్‌లైట్-రెడ్‌లైట్ మధ్య సిగ్నల్‌ను 100 వాహనాలు దాటితే... లైన్ డిసిప్లిన్‌తో 150కి పైగా దాటేలా చేయవచ్చని చెబుతున్నారు. ఈ విధానాన్ని పరిచయం చేయడానికి ముందు కొన్ని మౌలిక వసతులను మెరుగుపచడంతో పాటు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
చిన్న క్లెయిమ్స్‌లో అనేకం ఇవే..
రాజధానిలో తేలికపాటి వాహనాలకు సంబంధించిన ఇన్స్యూ రెన్స్ క్లెయిమ్స్ ప్రతి నెలా వేల సంఖ్యలో ఉంటాయి. చిన్న చిన్న మరమ్మతులకు సంబంధించి వచ్చే క్లెయిమ్స్‌లో అత్యధికం లైన్ డిసిప్లిన్ లేని కారణంగా దెబ్బతిన్నవే. ప్రధానంగా వాహనాల పక్క భాగాలు దెబ్బ తినడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. లైన్ డిసిప్లిన్ అమలైతే ఈ క్లెయిమ్స్ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
- ఓ ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిధి