నిరసనల హోరు | The bill, asokbabu, united Clarion... | Sakshi
Sakshi News home page

నిరసనల హోరు

Published Fri, Dec 13 2013 1:30 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

నిరసనల హోరు - Sakshi

నిరసనల హోరు

=వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు
 =జిల్లా అంతటా రోడ్ల దిగ్బంధం.. అక్కడే భోజనాలు
 =సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యం

 
రాష్ట్ర విభజన అంశంపై మొండిగా ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును  వైఎస్సార్‌సీపీ వరుస ఆందోళనలతో నిరసిస్తోంది. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లా అంతటా నాయకులు, కార్యకర్తలు రహదారులు దిగ్బంధించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా, కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ నినాదాలతో హోరెత్తించారు. రోడ్లపై వంటావార్పులతో నిరసన తెలిపారు.
 
 సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన యత్నాలకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు రహదారుల దిగ్బంధం, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించాయి. అనంతరం నేతలు, కార్యకర్తలు, మద్దతుగా పాల్గొన్న ప్రజలు రోడ్లపైనే భోజనాలు చేసి తమ నిరసన తెలిపారు. ఆందోళనల్లో పాల్గొన్న కార్యకర్తలు, నేతలను పలుచోట్ల పోలీసులు అరెస్టు చేశారు.
 
 పామర్రు మండలంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో మండల పరిధిలోని అడ్డాడలో రహదారుల దిగ్బంధం కార్యక్రమం నిర్వహించారు. మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జ్యేష్ఠ రమేష్‌బాబు స్థానిక మార్కెట్ యార్డు వద్ద, జోగి రమేష్ స్థానిక ఇంజినీరింగ్ కళాశాల వద్ద రోడ్లు దిగ్బంధించారు. వంటావార్పు చేసి అక్కడే భోజనాలు చేశారు. ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారిపై జోగి రమేష్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రహదారి దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

తిరువూరులో నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో, గూడూరు మండలంలో మచిలీపట్నం - విజయవాడ రోడ్డుపై పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో, కంచికచర్ల మండలం పరిటాల జాతీయ రహదారిపై నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు ఆధ్వర్యంలో రోడ్ల దిగ్బంధం చేశారు. వంటావార్పు నిర్వహించారు.

చల్లపల్లి 214 జాతీయ రహదారిని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో దిగ్బంధించారు. దీంతో మచిలీపట్నం, విజయవాడ, అవనిగడ్డ రహదారుల్లో రాకపోకలు స్తంభించాయి. అనంతరం రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టి అక్కడే నాయకులు భోజనాలు చేశారు. కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పామర్రు- కత్తిపూడి 165 జాతీయ రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు.
 
అక్కడే వంటావార్పు చేశారు. పెనమలూరు మండలంలోని గంగూరు వద్ద నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నూజివీడు, గుడివాడ, గుడ్లవల్లేరులలో పార్టీ నేతల ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు.
 
విజయవాడలో నేతల అరెస్ట్...

పార్టీ విజయవాడ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో కుమ్మరపాలెం సెంటర్‌లో జాతీయరహదారిపై వంటావార్పు చేపట్టి, రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డగించారు. దీంతో జలీల్‌ఖాన్‌తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు త రలించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యకర్తలు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. వాహనాల రాకపోకలను అడ్డగించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement