
చట్టాన్ని పట్టించుకోని చంద్రబాబు
- రెండేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తాం: హరీశ్‌రావు
నంగునూరు: రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తుంగలో తొక్కినా తాము అమలు చేస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీన్ని సవాలుగా తీసుకుని వచ్చే రెండేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. మెదక్ జిల్లా పాలమాకులలో సోమవారం 132 కేవీ సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రాంత ప్రజలు ఇక్కడ సుఖంగా ఉంటున్నారన్నారు. చంద్రబాబుకు గెస్ట్‌హౌస్‌తో పాటు సెక్రటేరియట్‌ను తామిచ్చినా కేంద్ర ప్రభుత్వం సూచిన విధంగా 54 శాతం విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కరెంటు సమస్యలు తీర్చేందుకు వెయ్యి వాట్ల విద్యుత్‌ను ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరిందని..రామగుండం, మణుగూరు ప్లాంట్ల ద్వారా వెయ్యి మెగావాట్లు, సౌర, పవన, జల విద్యుత్తును మరో 15 వేల మెగావాట్ల మేర ఉత్పత్తి చేస్తామన్నారు.
తమ విజన్ మేరకు కళకళలాడే చెరువులు, తళతళలాడే రోడ్లు నిర్మించి, ఇంటింటికీ మంచినీరు సరఫరా చేస్తామన్నారు. పింఛన్లను తొలగిస్తామంటూ కొన్ని పత్రికలు, పార్టీలు దుష్ర్పచారం చేస్తున్నాయని బడ్జెట్‌లో రూ. 3.6 వేల కోట్లు కేటాయించిన విషయాన్ని విస్మరించొద్దని హరీశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీర్ శ్రీరాములు, జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్.సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు శివశంకర్ పాల్గొన్నారు.