ముంపు ప్రాంతాల కోసం మరో సమరం | fighting for polavaram caved areas | Sakshi
Sakshi News home page

ముంపు ప్రాంతాల కోసం మరో సమరం

Published Thu, May 29 2014 1:55 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

fighting for polavaram caved areas

 భద్రాచలం, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాల అగ్గి మరోసారి రాజుకుంది. ముంపు పేరుతో జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో విలీనం చేసే ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారన్న వార్తలు గుప్పుమనడంతో రాజకీయ వేడి రగులుకుంది.  మరో మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తెలంగాణవాదులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ముంపుప్రాంతం మాత్రమే పోతుందని ఇప్పటి వరకూ భావించిన జిల్లా వాసులను తాజా వార్తలు తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఈపరిణామాలపై స్పందించిన రాజకీయ పక్షాలు ఓ వైపు తెలంగాణ బంద్‌కు, మరోవైపు జిల్లా బంద్‌కు వేర్వేరుగా పిలుపునిచ్చాయి. ఈ పిలుపునకు అన్ని పక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి.

 అప్పుడు అలా... ఇప్పుడు ఇలా
 రాష్ట్ర విభజన చేసిన సమయంలో ముంపు పరిధిలోకి వచ్చే జిల్లాలోని 136 రెవెన్యూ గ్రామాలను(211 హేబిటేషన్‌లు) అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని గత కేంద్ర ప్రభుత్వం బిల్లులో పొందుపరిచి చట్టం చేసింది. కానీ భద్రాచలం డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), పాల్వంచ డివిజన్‌లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు (పాల్వంచ నుంచి భద్రాచలానికి వచ్చే  మోరంపల్లిం బంజర్, మణుగూరు క్రాస్ రోడ్, సారపాక రూట్‌లో 12 గ్రామాలు మినహా ) మండలాలను పూర్తిగా సీమాంధ్రలో కలిపేందుకని అప్పుడే ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటకీ దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం  గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేస్తూ దీన్ని చట్టం రూపంలో తీసుకొచ్చేందుకు గాను రాష్ట్రపతికి పంపించినట్లుగా, దానిని రాష్ట్రపతి ఆమోదించినట్లుగా వార్తలొచ్చాయి. దీని ప్రకారం ఏడు మండలాల్లోని 92 పంచాయతీలు, 326 రెవెన్యూ గ్రామాలు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవనున్నాయి.

 2లక్షలకు పైగా జనాభా మునిగిపోనుందా?
 ముంపు మండలాలను పూర్తిగా విలీనం చేస్తే భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలోని 326 రెవెన్యూ గ్రామాలు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళతాయి. భద్రాచలం మండలంలో 70 రెవెన్యూ గ్రామాలు 20 పంచాయతీలు, కూనవరంలో 56 రెవెన్యూ గ్రామాలు 16 పంచాయతీలు, వీఆర్‌పురంలో 62 రెవెన్యూ గ్రామాలు 11 పంచాయతీలు, చింతూరులో 89 రెవెన్యూ గ్రామాలు 15 పంచాయతీలు, బూర్గంపాడులో 8 రెవెన్యూ గ్రామాలు 5 పంచాయతీలు, కుక్కునూరులో 20 రెవెన్యూ గ్రామాలు 11 పంచాయతీలు, వేలేరుపాడులో 21 రెవెన్యూ గ్రామాలు 9 పంచాయతీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం కాబోతున్నాయి. అదే విధంగా రెండు డివిజన్‌లలో గల ఏడు మండలాల్లో 2,02,369 మందిని జిల్లా నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో కలపనున్నారు. ముంపు గ్రామాలనే కలిపినట్లైతే 136 రెవెన్యూ గ్రామాలు, 211 హ్యాబిటేషన్‌లు, 1,16,796 మంది జనాభా జిల్లా నుంచి వేరు అయ్యేవారు.  ఆర్డినెన్స్‌లో పేర్కొన్న ప్రకారం ఏడు మండలాలు సీమాంధ్రలో కలవనుండగా, ఆ మండలాల ప్రజలకు పునరావాసం అక్కడే కల్పించనున్నారు.

 మండిపడుతున్న జిల్లా వాసులు
 ఈ ప్రాంత ప్రజానీకం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా ముంపు మండలాల ఆర్డినెన్స్‌ను తీసుకురావటం పట్ల జిల్లా వాసులు తీవ్రంగా మండిపడుతున్నారు. రెండు రాాష్ట్రాలుగా విడిపోతున్న సందర్భంలో త్వరలోనే కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు కానుండగా, ఇంతలోనే హడావిడిగా ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేయించేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అత్సుత్సాహం చూపిస్తుండటంపై తెలంగాణ వాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ అధినేత, కాబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. దీనికి మద్దతుగా జిల్లాలో కూడా సంపూర్ణంగా బంద్ పాటించేందుకు తెలంగాణజాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. అన్ని ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటిస్తూ బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

 నేడు భద్రాచలం ఎమ్మెల్యే ఆమరణ దీక్ష
 ముంపు ప్రాంతాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య గురువారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నారు. ముంపు ప్రాంతాలను తిరిగి తెలంగాణలోనే కొనసాగిస్తామని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ దీక్షను కొనసాగిస్తానని రాజయ్య ప్రకటించారు. భద్రాచలం డివిజన్‌లోని ముంపు మండలాల్లో గల సీపీఎం సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కూడా ఆయనతో పాటు నిరాహార దీక్షల్లో కూర్చొంటారని ఆ పార్టీ డివిజన్‌నాయకులు తెలిపారు.

 పోరుబాటలో ఆదివాసీలు
 పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో విలీనం చేయటం పట్ల ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో జూన్ 2న వీఆర్‌పురంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా అఖిల పక్షం ఆధ్వర్యంలో  ఈనెల 30న ముంపు మండలాల బంద్ చేయటంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున సరిహద్దు ప్రాంతాలను దిగ్బంధించేందుకు ఇప్పటికే కార్యాచరణ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement