సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: తాను బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్ని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖండించారు. తాను పార్టీ మారడం లేదని, ఒకవేళ కాంగ్రెస్‌ను కాదని బీఆర్‌ఎస్‌లో చేరితో అది ప్రాణ త్యాగమే అవుతుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌తోనే భద్రాచలం అభివృద్ధి చెందుతుంది. భద్రాచలం అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరాను. అదే నమ్మకంతో కాంగ్రెస్ లోనే ఉంటా. తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరనున్నానేది అవాస్తవమని తెలిపారు. భద్రాచలం ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. అయితే లోక్‌సభ ఎన్నికల ముందు తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్ వీడి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
తాజాగా ఆయన అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షనేత, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఛాంబర్‌కి వెళ్లారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేక్, మల్లారెడ్డిలు ఉన్నారు. కేసీఆర్ ఛాంబర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. అనంతరం తెల్లం వెంకటరావు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు కలిసి బయటకు వెళ్లడంతో..తెల్లం వెంకట్రావు సైతం తిరిగి బీఆర్‌ఎస్ చేరనున్నారనే సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తాను కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరడం లేదని స్పష్టత ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment