ప్రజాప్రతి‘నిధుల’ | Leaders hoping for votes | Sakshi
Sakshi News home page

ప్రజాప్రతి‘నిధుల’

Published Mon, Feb 10 2014 5:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM

ప్రజాప్రతి‘నిధుల’

ప్రజాప్రతి‘నిధుల’

  • ఎన్నికల కాలం..
  •  ఓట్ల కోసం నేతల పాట్లు
  •  పనుల వరద.. కమీషన్ల దందా
  •   సాక్షి, సిటీబ్యూరో:  ఓ వైపు.. రాష్ట్ర విభజన.. తెలంగాణ ఏర్పాటు అంశం.
     మరో వైపు.. త్వరలో లోక్‌సభ (ఎంపీ) ఎన్నికలకు నోటిఫికేషన్.
     బహుశా.. అసెంబ్లీ ఎన్నికలకు కూడా త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం.
     ...ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకూ తీరిగ్గా సొంతపనుల్లో మునిగి తేలిన నేతలంతా ఇప్పుడు మరోమారు ఓట్లు పొందేందుకు పాట్లు పడుతున్నారు.

    పనులు చేయకుండా ప్రజల ముందుకెళ్లేందుకు మొహం చెల్లక.. చివరిక్షణంలో ఆదరాబాదరాగా పనులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీలైనన్ని రూపాల్లో నిధులు సేకరిస్తున్నారు. నియోజకవర్గాల్లో పనులు చేయాల్సిందిగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఏదోవిధంగా ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే.. కమీషన్లు సైతం రాబట్టే విధంగా ద్విముఖ వ్యూహంతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో అధికార కూటమిగా ఉన్న కాంగ్రెస్-ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎంపీలు త్వరితంగా పనులు చేయాల్సిందిగా హుకుం జారీ చేస్తున్నారు.

    ఇందుకోసం నిధులు మంజూరుకు పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల నిధులు, ఎంపీలకు ఎంపీల్యాడ్స్ నిధులు ఉన్నప్పటికీ.. జీహెచ్‌ఎంసీ నుంచి సైతం నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. కారణం.. ఎన్నికల కోడ్ వస్తే కొత్త పనులు చేపట్టేందుకు వీలుండదు. అందుకే ఇటీవల శ్రద్ధ చూపి మరీ ఆయా పనులకు రూ.కోట్లు మంజూరు చేయించుకున్నారు. ఇంకా చేయించుకుంటున్నారు. ఇంతకాలం పనులు చేసినా.. చేయకపోయినా గడచిపోయింది. కానీ..  ప్రజల ముందు మళ్లీ నిలబడాలంటే కాసిన్ని పనులైనా చేయక తప్పదని భావిస్తున్నారు.

    ఇలా జీహెచ్‌ఎంసీ నుంచి పనులు మంజూరు చేయించుకున్న వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సనత్‌నగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రాజిరెడ్డి, మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ ఉన్నారు. వీరు రోడ్లు, వరదనీటి కాలువలు, కమ్యూనిటీ హాళ్లు తదితర పనుల కోసం రూ.17.50 కోట్లు మంజూరు చేయించుకున్నారు. మరో ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ (మల్కాజిగిరి) పనుల ప్రతిపాదనలు అందజేశారు. ఎంఐఎం నుంచి ఎమ్మెల్యేలు బలాలా, మోజంఖాన్ ప్రతిపాదనలు అందజేశారు. వారి పనులకు నిధులు మంజూరు కావాల్సి ఉంది.
     
    సొంతలాభమూ...
     
    పుణ్యం.. పురుషార్థం.. అన్నట్లు ఓవైపు పనులు చేశామని చెప్పి.. ప్రజల ఓట్లడిగేందుకు సిద్దమవుతూనే.. ఎక్కువ పనుల మంజూరు ద్వారా సొంతలాభం కూడా చూసుకోవచ్చుననే యోచనలో కొందరు ప్రజాప్రతినిధులున్నారు. పనులు చేపట్టే ఆయా కాంట్రాక్టు సంస్థల నుంచి నజరానాలు, కమీషన్లు ముట్టడం పరిపాటే కావడంతో దాన్నీ వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
     
    మేయర్ సైతం..
     
    ఇక రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయగలరని భావిస్తున్న.. జీహెచ్‌ఎంసీ ప్రస్తుత మేయర్ మాజిద్ హుస్సేన్ సైతం తన కార్పొరేటర్ ఫండ్ నుంచే కాక, జీహెచ్‌ఎంసీ సాధారణ నిధుల నుంచి సైతం వీలైనన్ని నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. అంతేకాదు.. తమ ఎంఐఎం పార్టీ.. దాని వ్యవస్థాపకుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ పేరును వీలైనన్ని పథకాలకు పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే టోలిచౌకి ఫ్లై ఓవర్, తాగునీటి ఆర్‌ఓ ప్లాంట్లకు ఒవైసీ పేరు పెట్టేందుకు సిద్ధమయ్యారు. తద్వారా ఎంఐఎం పార్టీకి ప్రజల మద్దతు లభించగలదని భావిస్తున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement