భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం నియోజకవర్గంలో ఈసారి రసవత్తర పోరు సాగనుంది. నాలుగు ప్రధాన పార్టీలు తొలిసారిగా పోటీలో నిలుస్తుండటంతో భద్రాద్రిపై పాగా ఎవరిదనే చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తరువాత భద్రాచలం నియోజకవర్గం రెండుగా చీలిపోనుంది. పోలవరం ముంపు ప్రాంతాలైన కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, భద్రాచలం మండలాల్లోని 87 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుస్తాయి. ముంపు ప్రాంత ఓటర్లు ఎవరిపై మొగ్గుచూపితే ఆ పార్టీ అభ్యర్థే గెలిచే అవకాశం ఉంది. అయితే ముంపు ప్రాంత మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ బలంగా ఉంది.
చింతూరు మండలంలో ఆ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోనూ వైఎస్‌ఆర్‌సీపీకే ప్రజాదరణ ఉందని ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సీపీఎంకు కూడా ఆయా మండలాల్లో మంచి పట్టు ఉంది. దీంతో ఈ రెండు పార్టీలను ఢీ కొనడటం కాంగ్రెస్,టీడీపీలకు సాధ్యమయ్యే పనికాదని పరిశీలకులు అంటున్నారు.
నివురుగప్పిన నిప్పులా వర్గపోరు...
కాంగ్రెస్, టీడీపీలలో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా దాగి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కుంజా సత్యవతిపై కాంగ్రెస్ నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. పలువురు నాయకులు ఆమెపై ఇటీవల కాలంలో బాహాటంగానే విమర్శనాస్త్రాలు సంధించారు. గెలిచిన ఐదేళ్లలో ఏ ఒక్కరినీ ఆమె నమ్మలేదని గుర్రుగా ఉన్న నాయకులు, అధిష్టానం ఆదేశాలతో పనిచేస్తున్నట్లు నటిస్తున్నప్పటికీ ఆమెకు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన వ్యతిరేకత కూడగట్టుకున్న సత్యవతి ఈ సారి గెలవటం అంత సులభం కాదని పరిశీలకులు అంటున్నారు.
ఇక బలమైన కేడర్ ఉన్న టీడీపీ ఒక్కసారైనా భద్రాచలంపై పాగా వేయాలని తపన పడుతున్నప్పటకీ ఆ పార్టీలోని వర్గపోరు విజయం దరి చేరనివ్వటం లేదు. టీడీపీ నుంచి ఈసారి తమకే సీటు వస్తుందని ఆశించిన బోదెబోయిన బుచ్చయ్య, ఇర్పా శాంత, సోడె రామయ్య వంటి నేతలు పూర్తిస్థాయిలో సహకరిస్తానేది అనుమానమే. నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్న బాలసాని లక్ష్మీనారాయణకు అధిష్టానం టికెట్ కేటాయించకపోవటంతో ఈ ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఈసారి కూడా టీడీపీ ఆశలు అడియాశలుగానే మిగలవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక తొలిసారి బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ ఈ నియోజకవర్గంలో అంత ప్రభావం చూపలేదని విశ్లేషకుల వాదన. మొత్తం మీద భద్రాద్రి బరిలో తొలిసారి నాలుగు ప్రధాన పార్టీలు పోటీలో నిలవడంతో ఈ ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నామినేషన్‌ల ఉపసంహరణ అనంతరం అన్ని పార్టీలూ ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంది.
పోరు రసవత్తరం
Published Sat, Apr 12 2014 2:15 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement