bhadrachalam constituency
-
నిజమైన నాయకుడు...
సాక్షి, భద్రాచలం : ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు తరతరాలకు సరిపడేంత వెనుకేసుకునే ప్రస్తుత రాజకీయాల్లో.. సంపాదనకు దూరంగా, విలువలే పరమావధిగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి. మూడుసార్లు భద్రాచలం నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించారు. శాసనసభలో ప్రజాసమస్యలపై విశేషంగా గళమెత్తారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిజాయితీగా పనిచేస్తున్న కుంజా బొజ్జి..వృద్ధాప్యంలోనూ ప్రస్తుత ఎన్నికల్లో జొరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ హ్యాట్రిక్ ఎమ్యెల్యే ఇప్పటికీ సాధరణ జీవితాన్ని గడుపుతున్నారు. గ్రామంలో జన్మించి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో వీఆర్‌పురం మండలం రామవరం పంచాయితీలోని అడవి వెంకన్న గూడెంలో కుంజా బొజ్జి జన్మించారు. నిరుపేద కుటుంబంలో 8వ సంతానంగా జన్మించిన ఆయన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో పెద్దగా చదువుకోలేదు. 1948లో లాలమ్మను వివాహం చేసుకున్న ఆయనకు ఆరుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. ఓటమి విజయానికి నాందిగా భావించి.. 1970లో వీఆర్‌పురం మండలంలోని రామవరం పంచాయితీ సర్పంచ్‌గా పోటీ చేసిన ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయారు. 1981లో వీఆర్‌పురం సమితి అధ్యక్షుడిగా సీపీఎం నుంచి పోటిచేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. కానీ ప్రతీ ఓటమిని ఓ గుణపాఠంగా తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే వారు. నక్సలైట్ల చేతిలో దెబ్బలు తిని.. మొదటి నుంచి కమ్యూనిస్లు పార్టీలో చురుకుగా పాల్గొన్న ఆయన 1985లో జీడిగుప్పలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీపీఎం నేతలు బత్తుల భీష్మారావు, బండారు చందర్రావులతో కలసి వెళ్లారు, వీరు వస్తున్న సమాచారం అందుకున్న మావోయిస్టులు చుట్టుముట్టి బత్తుల భీష్మారావు, చందర్రావులను కాల్చి చంపారు. బొజ్జిని మాత్రం కొట్టి వదిలివేశారు. పార్టీ గెలుపు కోసం.. సీపీఎం పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా 92ఏళ్ల ముదిమి వయుస్సులో కూడా యువకుడిలా చురుకుగా పాల్గొనడం పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప్రస్తుతం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా డాక్టర్ మిడియం బాబూరావు బరిలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా పార్టీ గెలవాలనే ఆకాంక్షతో ప్రచారంలో పాల్గొంటున్నారు. కుంజా బొజ్జిని ఆదర్శంగా పార్టీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. హ్యాట్రిక్ వీరుడు భద్రాచలం నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా 1985లో మొదటిసారిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం 1989,94ల్లో కూడా సీపీఎం నుంచి గెలుపొందారు. 1984లో ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే జీతం రూ.2వేలు. అందులో రూ.వెయ్యి రాష్ట్ర పార్టీకి ,రూ.200 జిల్లా ఫండ్‌గా ఇచ్చి మిగిలిన రూ.800లతో కుటుంబాన్ని సాకేవారు. ఆనాడు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం సొంత ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించగా పార్టీ నిర్ణయం మేరకు ఆ స్థలాన్ని కూడా నిరాకరించిన నిజాయితి పరుడు కుంజా బొజ్జి. రాజకీయాలు మారాలి పేదలకోసం పనిచేసే రాజకీయ నాయకులు కావాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి వారు చాలా తక్కువగా కనిస్తున్నారు. ఒక్క సారి గెలిస్తే ఎంత సంపాదిద్దామా అనే ధోరణితోనే ఉంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తరాలు మారినా మనం చేసిన సేవలు జనం గుర్తించుకోవాలి .రాజకీయాల్లో విలువలను పాటించాలి. లేకుంటే బతికున్నా చచ్చినట్టే, తన శేష జీవితం కూడా పార్టీ కోసమని ,ప్రజల కోసమే వెచ్చిస్తా అంటున్నారు మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి. మెజారిటీలోనూ ఆయనదే రికార్డు భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలోకెల్లా అత్యధిక మెజారిటీ ఓట్లతో విజయం సాధించిన ఘనత కూడా కుంజా బొజ్జికే దక్కుతుంది. 1985,89,94 సంవత్సరాల్లో వరుసగా మూడు సార్లు సీపీఎం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 1994లో 39,265 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు 1955 నుంచి 2014 ఎన్నికల వరకూ గెలిచిన అభ్యర్థుల్లో మరెవ్వరికీ ఈ స్థాయిలో మెజారిటీ రాలేదు. -
భద్రాచలంలో ఈసారి ఎవరు?
ఖమ్మం,భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరొంది, శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న భద్రాచలం, ఓ ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ.. అటు రాజకీయంగానూ విలక్షణ ప్రజాతీర్పుల కేంద్రంగాను గుర్తింపునొందింది. చుట్టూ అడవి నడుమ ఆదివాసీలు ఉన్న నియోజకవర్గం ఇది. ప్రధాన కేంద్రమైన భద్రాచలంలోనే సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఉంది. ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారుల పాలన సాగుతోంది. దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం కూడా ఇక్కడే ఉండటంతో ..గెలిచే ఎమ్మెల్యేకు కూడా తగిన రీతిలోనే గుర్తింపు లభిస్తుంది. ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరగ్గా సీపీఐ రెండుసార్లు, 4సార్లు కాంగ్రెస్ , 8సార్లు సీపీఎం అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. నియోజకవర్గంలో ప్రస్తుతం ఐదు మండలాలు మాత్రమే ఉన్నాయి. గతంలో ఎనిమిది మండలాలు ఉండగా రాష్ర్గ విభజన నేపథ్యంలో చింతూరు, వీఆర్.పురం, కూనవరం మండలాలను నియోజకవర్గం నుంచి వేరుచేసి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. వెంకటాపురం, వాజేడు మండలాలు భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లాయి. గతంతో పోలిస్తే ..ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఈ నియోజకవర్గం మూడు రాష్ట్రాలకు...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛతీస్‌గఢ్‌లకు సరిహద్ధుగా ఉంది. భద్రాచలంనకు ఆనుకునే ఏపీ సరిహద్దు(ఎటపాక) ఉండగా ,పట్టణంలో ఉన్న శివారు కాలనీలు కూడా ఏపీలోనే కలిశాయి. అదే విధంగా దుమ్ముగూడెంకు కూతవేటు దూరంలోనే ఛతీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు ఉంది. ఈ కారణంగానే ఇక్కడ మావోయిస్టుల పాబల్యం ఎక్కువ. మూడు ముక్కలు .. భద్రాచలం: ఉమ్మడి రాష్ట్రంలో వైశాల్యం పరంగా అతిపెద్ద నియోజకవర్గమైన భధ్రాచలం ప్రస్తుత ఎన్నికలనాటికి మూడు ముక్కలైంది. 1952లో ఏర్పడి..అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉండేది. తొలినాళ్లలో జనరల్ స్థానంగా ఉన్న నియోజకవర్గం 1967 ఎన్నికల నాటికి ఎస్టీ రిజర్వ్‌గా మారింది. 1955లో తొలిసారిగా ఎన్నికలు జరగ్గా..సీపీఐకి చెందిన శ్యామల సీతారామయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు నిర్వహించగా ..సీపీఐ రెండు సార్లు ,4సార్లు కాంగ్రెస్, 8సార్లు సీపీఎంకు చెందిన అభ్యర్థులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజనకు ముందు 8మండలాలు, 2,11,437 మంది ఓటర్లు, 261 పోలింగ్ బూతులు ఉన్న భద్రాచలం నియోజకవర్గం ప్రస్తుత ఎన్నికల నాటికి మూడు ముక్కలైంది . భద్రాచలం రూరల్, కూనవరం ,వీఆర్‌పురం, చింతూరు మండలాలు నియోజకవర్గం నుంచి వేరై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ఱంలోని రంపచోడవరం నియోజకవర్గంలో విలీనమయ్యాయి. భద్రాచలం టౌన్(భద్రాచలం రెవెన్యూ గ్రామం ఒక్కటే), దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో అక్టోబర్ 12వ తేదీన ప్రకటించిన జాబితా మేరకు 1,33,764 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలు ఉన్నప్పటికీ, జిల్లాల విభజనతో వెంకటాపురం, వాజేడు మండలాలు భూపాలపల్లి జిల్లాలోకలిపారు. ఈ కారణంగా ఆ మండలాలకు భద్రాచలం ఎమ్మెల్యేనే అయినప్పటికీ ,పాలన మాత్రం భూపాలపల్లి జిల్లా నుంచి సాగుతోంది. సీపీఎంకు కంచుకోట .. భద్రాచలం నియోజకవర్గాన్ని సీపీఎంకు కంచుకోటగా అభివర్ణిస్తారు. ఇక్కడ ఆ పార్టీ 8సార్లు గెలుపొందింది. ముర్ల ఎర్రయ్యరెడ్డి రెండుసార్లు, కుంజాబొజ్జి మూడుసార్లు వరుసగా విజయం సాధించారు. అతిసాధారణ జీవితంతో బొజ్జి నేటి తరానికి ఆదర్శమూర్తిగా నిలిచారు. వరుసగా మూడుసార్లు గెలిచి..ఆదివాసీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఆయన ..ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారంచుట్టిన నేతగా గర్తింపుపొందారు. నేటికీ.. సొంతిల్లు కూడా లేక..సాధారణ జీవితాన్ని గడుపుతూ... నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ ..మన్ననలు అందుకుంటున్నారు. ఇక తాజా మాజీ ఎమ్యెల్యే సున్నం రాజయ్య కూడా మూడుసార్లు గెలిచారు. అయితే 2009లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుంజా సత్యవతి చేతిలో ఓడిపోయారు. మళ్లీ కంచుకోటలో పాగా వేసేందుకు సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య గెలిచారు. ఈసారి రాజయ్య తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన సొంత మండలం ...వీఆర్‌పురం ఏపీలో కలవడంతో అటు వెళుతున్నారు. -
పోరు రసవత్తరం
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం నియోజకవర్గంలో ఈసారి రసవత్తర పోరు సాగనుంది. నాలుగు ప్రధాన పార్టీలు తొలిసారిగా పోటీలో నిలుస్తుండటంతో భద్రాద్రిపై పాగా ఎవరిదనే చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తరువాత భద్రాచలం నియోజకవర్గం రెండుగా చీలిపోనుంది. పోలవరం ముంపు ప్రాంతాలైన కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, భద్రాచలం మండలాల్లోని 87 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుస్తాయి. ముంపు ప్రాంత ఓటర్లు ఎవరిపై మొగ్గుచూపితే ఆ పార్టీ అభ్యర్థే గెలిచే అవకాశం ఉంది. అయితే ముంపు ప్రాంత మండలాల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. చింతూరు మండలంలో ఆ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోనూ వైఎస్ఆర్సీపీకే ప్రజాదరణ ఉందని ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సీపీఎంకు కూడా ఆయా మండలాల్లో మంచి పట్టు ఉంది. దీంతో ఈ రెండు పార్టీలను ఢీ కొనడటం కాంగ్రెస్,టీడీపీలకు సాధ్యమయ్యే పనికాదని పరిశీలకులు అంటున్నారు. నివురుగప్పిన నిప్పులా వర్గపోరు... కాంగ్రెస్, టీడీపీలలో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా దాగి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కుంజా సత్యవతిపై కాంగ్రెస్ నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. పలువురు నాయకులు ఆమెపై ఇటీవల కాలంలో బాహాటంగానే విమర్శనాస్త్రాలు సంధించారు. గెలిచిన ఐదేళ్లలో ఏ ఒక్కరినీ ఆమె నమ్మలేదని గుర్రుగా ఉన్న నాయకులు, అధిష్టానం ఆదేశాలతో పనిచేస్తున్నట్లు నటిస్తున్నప్పటికీ ఆమెకు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన వ్యతిరేకత కూడగట్టుకున్న సత్యవతి ఈ సారి గెలవటం అంత సులభం కాదని పరిశీలకులు అంటున్నారు. ఇక బలమైన కేడర్ ఉన్న టీడీపీ ఒక్కసారైనా భద్రాచలంపై పాగా వేయాలని తపన పడుతున్నప్పటకీ ఆ పార్టీలోని వర్గపోరు విజయం దరి చేరనివ్వటం లేదు. టీడీపీ నుంచి ఈసారి తమకే సీటు వస్తుందని ఆశించిన బోదెబోయిన బుచ్చయ్య, ఇర్పా శాంత, సోడె రామయ్య వంటి నేతలు పూర్తిస్థాయిలో సహకరిస్తానేది అనుమానమే. నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్న బాలసాని లక్ష్మీనారాయణకు అధిష్టానం టికెట్ కేటాయించకపోవటంతో ఈ ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఈసారి కూడా టీడీపీ ఆశలు అడియాశలుగానే మిగలవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక తొలిసారి బరిలో నిలిచిన టీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో అంత ప్రభావం చూపలేదని విశ్లేషకుల వాదన. మొత్తం మీద భద్రాద్రి బరిలో తొలిసారి నాలుగు ప్రధాన పార్టీలు పోటీలో నిలవడంతో ఈ ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అన్ని పార్టీలూ ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంది. -
హస్తవ్యస్తం..
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం వహించిన సీపీఎంని 2009 ఎన్నికల్లో ఖంగు తినిపించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు పూర్తిగా డీలా పడిపోయింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న కామ్రేడ్లకు అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చరిస్మాతో కళ్లెం పడింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారింది. నియోజకవర్గంలో దాదాపుగా ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అండగా ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పరాభవం తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికలబడడానికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కుంజా సత్యవతి గెలిచిన తర్వాత ఎల్‌డబ్ల్యూఈఏ పథకం పుణ్యమా అని గతంలో ఎప్పుడూ లేని విధంగా వందల కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. కానీ వచ్చిన నిధుల్లో ‘అధికారం’ పేరిట వచ్చిన కమీషన్ పంపకాలే ఆ పార్టీ నాయకుల మధ్య చిచ్చురేపిందనే విమర్శలు బాహాటంగానే వినిపించాయి. ఈ నేపథ్యం లోనే మూడేళ్లగా ఆ పార్టీ నాయకులు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే సత్యవతిపై కూడా ఆ పార్టీలో చాలామంది నాయకులు తీవ్రమైన విమర్శలే సంధించారు. మహబూబాబాద్ ఎం పీ, కేంద్రమంత్రి బలరామ్‌నాయక్‌తో కూడా సత్యవతికి సఖ్యత లేకపోవటంతో సీటు రాకుం డా చేసేందుకు వ్యతిరేక వర్గం పెద్ద లాబీయింగే చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. సీటుకోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మిగతా పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటి వరకూ ఆ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించేందుకు ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకు రావటం లేదు. వనమాకు సీటురాదనే ప్రచారంతో నియోజవర్గంలోని కేడర్ అంతా ఆయనకు బాసటగా నిలిచే క్రమంలో అసలు భద్రాచలం సీటు తమకు వద్దని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. దీంతో సీటు చేజారుపోతుందని బెంగపట్టుకున్న ఎమ్మెల్యే సత్యవతి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లాలో గెలిచిన ఏకైక గిరిజన మహిళా ఎమ్మెల్యే కావడంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ తిరిగి అధిష్టానం ఆమెకే సీటు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలిసింది. ఆమెకు సీటు వచ్చినప్పటికీ గెలుపు అసాధ్యమేనని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. పంచాయతీ ఫలితాల్లో ప్రజాభిమానం తమకే ఉందని వెల్లడి చేసుకున్న వైఎస్సార్సీపీ రెట్టింపు ఉత్సాహంతో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలిచేం దుకు ఉవ్విళ్లూరుతోంది. సీపీఎం, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు ఓట్లు ఏ మేరకు పడతాయో అనే విషయంపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలే పునరావృతం : ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని గత అనుభవాలు చెబుతున్నాయి. గత ఏడాది జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నవి కేవలం 12 మాత్రమే కావడం గమనార్హం. భద్రాచలం పట్టణంలోని ఓ వార్డులో ఎమ్మెల్యే సత్యవతి బంధువు పోటీ చేసినప్పటికీ చిత్తుగా ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో సంఖ్యా పరంగా వైఎస్సార్సీపీ ముందు వరుసలో నిలువగా, ఆ తర్వాత సీపీఎం, టీడీపీ, సీపీఐ నిలవగా చివరి స్థానం లో కాంగ్రెస్ మిగిలింది. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కేడరంతా ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఉత్సాహంగా నామినేషన్ లు వేసిన అభ్యర్థులంతా నాయకుల వ్యవహార శైలితో ప్రచారానికి కూడా వెళ్లడం లేదు. దీంతో నాటి ఫలితాలే పునరావృతం అవుతాయని, సార్వత్రిక ఎన్నికల నాటికి కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందనేది పరిశీలకులు భావిస్తున్నారు. మరోపక్క తమను వేరే రాష్ట్రంలో కలిపారనే ఆగ్రహంతో రగిలిపోతున్న నియోజకవర్గంలోని పోలవరం ముంపు మండలాల ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపుగా భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
బరిలో మిగిలేది ఎవరో..?!
భద్రాచలం, న్యూస్‌లైన్: స్థానిక సమరం రసవత్తరంగా మారుతోంది. బరిలో నిలిచేది ఎవరో సోమవారం సాయంత్రానికి తెలిసిపోతుంది. భద్రాచలం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు భారీగానే నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 93 ఎంపీటీసీ స్థానాలకు 553 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శని, ఆదివారాల్లో దుమ్ముగూడెం మండలంలో ఆరు, వీఆర్‌పురం మండలంలో నలుగురు మాత్రమే నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఆయా పార్టీల నుంచి డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిని సోమవారం ఉపసంహరించనున్నారు. రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను ఆయా పార్టీల నాయకులు బుజ్జగించే పనిలో పడ్డారు. నియోజకవర్గంలో పలు మండలాల్లో రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరుగుతున్నా అవి సఫలం కాకపోవడంతో నామినేషన్ల ఉపసంహరణకు ఆయా పార్టీల అభ్యర్థులు ముందుకు రావడం లేదు. వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో పొత్తులపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. మిగతా మండలాల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు సీపీఐ, ఇతర పార్టీల వారు కూడా బరిలో నిలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్, టీడీపీలకు రెబల్స్ బెడద జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు చాలా చోట్ల కాంగ్రెస్, టీడీపీలకు రెబల్స్ బెడద తీవ్రంగానే ఉంది. భద్రాచలం జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ తరుపున ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో ఒకరికి పట్టణ కమిటీ, మరొకరికి మండల కమిటీ, ఇంకొకరికి జిల్లా స్థాయిలో పార్టీ వ్యవ హారాలు చూసే నాయకుల మద్దతు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. బీఫామ్ ఎవరికిచ్చినా మిగిలిన ఇద్దరు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి విషయంలో ఇప్పటికే విభేదాలు తారాస్థాయికి చేరాయి. తనకు కాదని మరో వ్యక్తికి బీఫామ్ కట్టబెట్టడంపై చింతిర్యాల రవికుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీకి రాజీనామా ప్రకటించటంతో పాటు ఎమ్మెల్యే కుంజా సత్యవతిపై తీవ్రమైన ఆరోపణలు సంధించారు. చర్ల మండలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్, టీడీపీల విషయంలో దాదాపు ఇదే రీతిన ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇటువంటి వారు ప్రజలకేం సేవచే స్తారని పరిశీలకులు అంటున్నారు. బేరసారాలకు దిగుతున్న నాయకులు తాము పోటీ చేస్తామని కాంగ్రెస్, టీడీపీల నుంచి రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు తెగేసి చెబుతుండడంతో వారిని బుజ్జగించే పనిలో నాయకులు ఉన్నారు. ఉపసంహరించుకున్న వారికి నజరానాలు కూడా ముట్టజెబుతామని హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రానికి బరిలో ఎవరు ఉంటారో... తేలిపోనుంది.