భద్రాచలం, న్యూస్‌లైన్: స్థానిక సమరం రసవత్తరంగా మారుతోంది. బరిలో నిలిచేది ఎవరో సోమవారం సాయంత్రానికి తెలిసిపోతుంది. భద్రాచలం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు భారీగానే నామినేషన్‌లు దాఖలయ్యాయి. మొత్తం 93 ఎంపీటీసీ స్థానాలకు 553 మంది అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు. శని, ఆదివారాల్లో దుమ్ముగూడెం మండలంలో ఆరు, వీఆర్‌పురం మండలంలో నలుగురు మాత్రమే నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
ఆయా పార్టీల నుంచి డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిని సోమవారం ఉపసంహరించనున్నారు. రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను ఆయా పార్టీల నాయకులు బుజ్జగించే పనిలో పడ్డారు. నియోజకవర్గంలో పలు మండలాల్లో రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరుగుతున్నా అవి సఫలం కాకపోవడంతో నామినేషన్‌ల ఉపసంహరణకు ఆయా పార్టీల అభ్యర్థులు ముందుకు రావడం లేదు. వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో పొత్తులపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. మిగతా మండలాల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు సీపీఐ, ఇతర పార్టీల వారు కూడా బరిలో నిలిచే అవకాశం ఉంది.
కాంగ్రెస్, టీడీపీలకు రెబల్స్ బెడద
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు చాలా చోట్ల కాంగ్రెస్, టీడీపీలకు రెబల్స్ బెడద తీవ్రంగానే ఉంది. భద్రాచలం జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ తరుపున ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో ఒకరికి పట్టణ కమిటీ, మరొకరికి మండల కమిటీ, ఇంకొకరికి జిల్లా స్థాయిలో పార్టీ వ్యవ హారాలు చూసే నాయకుల మద్దతు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. బీఫామ్ ఎవరికిచ్చినా మిగిలిన ఇద్దరు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి విషయంలో ఇప్పటికే విభేదాలు తారాస్థాయికి చేరాయి. తనకు కాదని మరో వ్యక్తికి బీఫామ్ కట్టబెట్టడంపై చింతిర్యాల రవికుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీకి రాజీనామా ప్రకటించటంతో పాటు ఎమ్మెల్యే కుంజా సత్యవతిపై తీవ్రమైన ఆరోపణలు సంధించారు. చర్ల మండలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్, టీడీపీల విషయంలో దాదాపు ఇదే రీతిన ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇటువంటి వారు ప్రజలకేం సేవచే స్తారని పరిశీలకులు అంటున్నారు.
బేరసారాలకు దిగుతున్న నాయకులు
తాము పోటీ చేస్తామని కాంగ్రెస్, టీడీపీల నుంచి రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు తెగేసి చెబుతుండడంతో వారిని బుజ్జగించే పనిలో నాయకులు ఉన్నారు. ఉపసంహరించుకున్న వారికి నజరానాలు కూడా ముట్టజెబుతామని హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రానికి బరిలో ఎవరు ఉంటారో... తేలిపోనుంది.
బరిలో మిగిలేది ఎవరో..?!
Published Mon, Mar 24 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM
Advertisement
Advertisement